బాల్ ఠాక్రే ఆశయ సిద్ధికి పాటుపడాలి
శివసైనికులకు ఉద్ధవ్ పిలుపు
* వీర్ సావర్కర్‌కు భారత రత్న ఇవ్వాలని డిమాండ్
* ఘనంగా దివంగత నేత జయంతి
సాక్షి, ముంబై: శివ్‌బందన్ (కంకణం) కట్టుకుని సంవత్సరం పూర్తయిందని, బాల్ ఠాక్రే ఆశయాలకు, సిద్ధాంతాలకు కట్టుబడి ఉంటామని ఆ రోజు కంకణం కట్టుకున్నామని, వాటి కోసం పోరాడాలని శివసేన అధ్యక్షుడు ఉద్ధవ్ ఠాక్రే శివసేన కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఠాక్రే జయంతిని పురస్కరించుకొని మాటుంగాలోని షణ్ముఖానంద హాలులో శుక్రవారం సాయంత్రం జరిగిన ఉద్ధవ్ ఠాక్రే కార్యకర్తలనుద్దేశించి ప్రసంగించారు.
ఇటీవల కొందరు సంఘ్ పరివార్ నేతలు చేసిన ప్రకటనలను ఆయన ఎద్దేవా చేశారు. కొందరు నేతలు నలుగుర్ని, పది మంది పిల్లల్ని కనాలని పిలుపుని స్తున్నారని, అంతమందిని కంటే వారిని పోషించేదెవరని ఉద్ధవ్ ప్రశ్నించారు. ‘‘పది మేకలను కనే బదులు బాల్ ఠాక్రే లాంటి ఒక్క పులిని కంటే చాలు’’ అని వ్యాఖ్యానించారు. శాసనసభ ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేసి అనుకున్నది సాధించామని ఉద్ఘాటించారు.
మరాఠీ ప్రజలకు అన్యాయం జరిగితే చూస్తూ ఊరుకోబోమన్నారు. అండమాన్ జైలులో శిక్ష అనుభించిన స్వాతంత్య్ర పోరాట యోధు డు వీర్ సావర్కర్‌కు భారతరత్న బిరుదు ఇవ్వాలని ఉద్ధవ్ డిమాండ్ చేశారు. శివసేన లేకుంటే రాష్ట్రం అస్థిరంగా ఉంటుందనే ఉద్దేశ్యంతోనే బీజేపీతో జతకట్టామని చెప్పారు. రాష్ట్ర ప్రజల హితవుపై తమకు ఇచ్చిన హామీలు నెరవేర్చని పక్షంలో మిత్రపక్షమని కూడా చూడకుండా ప్రభుత్వాన్ని నిలదీస్తామని అన్నారు.
శివాజీ పార్కులో అఖండ జ్యోతి
శివాజీపార్క్ మైదానంలో దివంగత నేత బాల్ ఠాక్రే పేరిట ఒక అఖండ జ్యోతిని ప్రతిష్టించారు. ఠాక్రే జయంతిని పురస్కరించుకొని ఉదయం శివసేన అధ్యక్షుడు ఉద్దవ్ ఠాక్రే, ఆదిత్య ఠాక్రే, ఆయన కుటుంబ సభ్యులు స్మృతి స్థలం వద్ద శ్రద్ధాంజలి ఘటించారు. పార్టీ సీనియర్ నేతలు మనోహర్ జోషి, సంజయ్ రౌత్, నీలం గోర్హే తదితరులతోపాటు పదాధికారులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.
ఈ సందర్భంగా కాంస్యంతో తయారుచేసిన మూడడుగుల ఎత్తున్న ‘అఖండ ప్రేరణ జ్యోతి’ (దివిటి)ని ఉద్ధవ్, మేయర్ స్నేహల్ అంబేకర్‌లు వెలిగించారు. ఈ దివిటి నిరంతరంగా వెలుగుతూనే ఉంటుంది. బాల్ ఠాక్రే సిద్ధాంతాలు, ఆదర్శాలు ఎల్లప్పుడు గుర్తుండాలనే ఉద్ధేశ్యంతో ఈ దివిటి వెలిగించినట్లు ఉద్ధవ్ అన్నారు. ఈ జ్యోతి నిర్వహణకయ్యే ఖర్చులను మహానగర పాలక సంస్థ (బీఎంసీ) భరించనుంది.