రాయదుర్గం: దేశాభివృద్ధిలో ఇంజినీర్లు కీలక పాత్ర పోషించాలని ఇంజినీరింగ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా(ఎస్కీ) డెరైక్టర్ డాక్టర్ యు చంద్రశేఖర్ పేర్కొన్నారు. భారతరత్న మోక్షగుండం విశ్వేశ్వరయ్య జయంతిని సందర్భంగా గచ్చిబౌలిలోని ఎస్కీలో నిర్వహిస్తున్న ఐఈ ఫెస్ట్-2014లో భాగంగా సోమవారం ఆయన చిత్ర పటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఇంజినీర్లందరికీ భారతరత్న మోక్షగుండం విశ్వేశ్వరయ్య ఆదర్శమని ఆయన పేర్కొన్నారు.
అనంతరం ఎస్కీ ఐఈ ఫెస్ట్ కోఆర్డినేటర్లు సాయి కిషోర్, నిఖిల్ చౌదరి, సుబ్రహ్మణ్యం తదితరులు మోక్షగుండం విశ్వేశ్వరయ్య చేసిన సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో పలువురు విద్యార్థులు పాల్గొన్నారు. హైదరాబాద్ బైస్కిలింగ్ క్లబ్, ఎస్కీ సంయుక్తంగా ఈ సైక్లథాన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎస్కీ నుంచి 85 మంది ఇంజినీర్లు సైకిళ్లపై గచ్చిబౌలి కూడలి, ట్రిపుల్ ఐటీ మీదుగా జీఎంసీ బాలయోగి స్టేడియం వరకు అక్కడి నుంచి తిరిగి అదేమార్గంలో ఎస్కీ వరకు సైక్లథాన్ కార్యక్రమాన్ని నిర్వహించారు.
ముగిసిన ఐఈ ఫెస్ట్....
ఐఈ ఫెస్ట్-2014 పేరిట ఇంజినీరింగ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియాలో రెండు రోజులుగా నిర్వహించిన కార్యక్రమం సోమవారంతో ముగిసింది. ఈ సందర్భంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలకు చెందిన 20 ఇంజినీరింగ్ కళాశాలలకు చెందిన 900 మంది విద్యార్థులు రెండు రోజులుగా నిర్వహించిన నూతన ఆవిష్కరణల ప్రదర్శన, సెమీనార్లు, వర్క్‌షాప్‌లలో పాల్గొన్నారు. ఆటవిడుపు కోసం పలు వినూత్న కార్యక్రమాలను కూడా నిర్వహించారు.
ఇంజినీర్లు కష్టపడి పనిచేయాలి
పంజగుట్ట: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ వీజన్ ప్రకారం రాబోయే మూడేళ్లలో మిగులు విద్యుత్ రావాలంటే ఇంజినీర్లు కష్టపడి పనిచేయాలని విద్యుత్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఎస్.కె.జోషి కోరారు. రాష్ట్ర అభివృద్ధిలో ఇంజినీర్ల పాత్ర ఎంతో కీలకమని ఆయన అన్నారు. సోమవారం సోమాజిగూడలోని విద్యుత్ ఇంజినీర్ల భవన్‌లో తెలంగాణ రాష్ట్ర పవర్ ఇంజినీర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అసోసియేషన్ అధ్యక్షుడు ఎ.సుధాకర్ రావు అధ్యక్షతన 47వ ఇంజనీర్స్ డే వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మోక్షగుండం విశ్వేశ్వర య్య విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. విధుల్లో ప్రతిభ కనబర్చిన ఇంజినీర్లకు జ్ఞాపికలు అందచేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ జన్‌కో చైర్మన్, ఎండీ డి. ప్రభాకర్ రావు, ట్రాన్స్‌కో చైర్మన్, ఎండీ అహ్మద్‌నదీమ్, ట్రాన్స్‌కో జేఎండీ కార్తికేయ మిశ్ర, టీఎస్‌ఎన్‌పీడీసీఎల్ చైర్మన్, ఎండీ వెంకటనారాయణ, టీఎస్‌ఎస్‌పీడీసీఎల్ చైర్మన్, ఎండీ రఘురామరెడ్డి తదితరులు ప్రసంగించారు.
జలమండలిలో..
సాక్షి,సిటీబ్యూరో: 47వ ఇంజినీర్స్ డేను సోమవారం జలమండలి ఇంజినీర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బోర్డు ఇంజినీర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఖైరతాబాద్‌లోని ప్రధాన కార్యాలయంలో సర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య నగరానికి చేసిన సేవలను పలువురు అధికారులు కొనియాడారు. ఈకార్యక్రమంలో ఈడీ సత్యనారాయణ,ప్రాజెక్టు విభాగం డెరైక్టర్ కొండారెడ్డి,ఆపరేషన్స్ విభాగం డెరైక్టర్ రామేశ్వర్‌రావు పాల్గొన్నారు.
జీహెచ్‌ఎంసీలో..
ఇంజినీర్స్‌డే సందర్భంగా జీహెచ్‌ఎంసీలో జరిగిన కార్యక్రమంలో మోక్షగుండం విశ్వేశ్వరయ్య చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పిస్తున్న ఇంజినీర్లు. చిత్రంలో ఈఎన్‌సీ ఆర్.ధన్‌సింగ్, ఎస్‌ఈలు శ్రీధర్, కిషన్, మోహన్‌సింగ్, తదితరులున్నారు.
దేశాభివృద్ధిలో ఇంజినీర్లే కీలకం
Published Tue, Sep 16 2014 2:59 AM | Last Updated on Sat, Sep 2 2017 1:25 PM
Advertisement