‘తండ్రిని రాముడిగా, కూతుర్ని దుర్గగా వర్ణించారు’ | Atal Bihari Vajpayee Jawaharlal Nehru And Indira Gandhi | Sakshi
Sakshi News home page

నెహ్రూ, ఇందిరలతో వాజ్‌పేయి అనుబంధం

Published Fri, Aug 17 2018 11:53 AM | Last Updated on Fri, Aug 17 2018 2:17 PM

Atal Bihari Vajpayee Jawaharlal Nehru And Indira Gandhi - Sakshi

న్యూఢిల్లీ : రాజకీయాల్లో అజాతశత్రవుగా  ఎదిగిన మాజీ ప్రధాని అటల్‌ బిహారీ వాజ్‌పేయి కన్నుమూశారు. పదిసార్లు లోక్‌సభకు, రెండు సార్లు రాజ్యసభకు ఎన్నికయ్యారు. నిక్కచ్చిగా, సూటిగా మాట్లాడే వాజ్‌పేయి అంటే విపక్ష నేతలకు కూడా అభిమానమే. జవహర్‌లాల్‌ నెహ్రూ అంటే తనకు చాలా ఇష్టమని బహిరంగంగానే ప్రకటించేవారు వాజ్‌పేయి. రాజకీయ రంగంలో ఆయన ఒక్కో మెట్టూ ఎక్కుతూ ప్రధాని పీఠాన్ని అధిష్టించారు. అయితే వాజ్‌పేయి ప్రధాని అవుతారని నెహ్రూ ఎప్పుడో జోస్యం చెప్పారు.

అతనికి గొప్ప భవిష్యత్తు ఉంది
వివరాలు.. 1957లో వాజ్‌పేయి తొలిసారిగా ఉత్తర ప్రదేశ్‌ బలరాంపూర్‌ నుంచి రెండో లోక్‌సభకు ఎన్నికయ్యారు. ప్రతిపక్ష నేతగా లోక్‌సభలో క్రీయాశీలంగా ఉండేవారు వాజ్‌పేయి. ఆయన ఉత్సాహం నెహ్రూను ఎంతో ఆకర్షించింది. ఒకసారి నెహ్రూ, వాజ్‌పేయిని బ్రిటీష్‌ ప్రధానికి పరిచయం చేస్తూ.. ‘ఇతను మా లోక్‌సభలో యువ ప్రతిపక్ష నేత. నన్ను ఎప్పుడూ విమర్శిస్తుంటాడు. నాకు మాత్రం ఇతనికి గొప్ప భవిష్యత్తు ఉండబోతోందనిపిస్తోంది. మా దేశంలో వికసిస్తోన్న యువ పార్లమెంటేరియన్లకు ఇతను ప్రతీక’ అంటూ వాజ్‌పేయి భవిష్యత్తు గురించి స్వయంగా నెహ్రూ అనాడే జోస్యం చెప్పారు.

వ్యక్తిగతంగా అభిమాని.. రాజకీయాల్లో ప్రత్యర్థి
ఒకసారి వాజ్‌పేయి నెహ్రూని విమర్శిస్తూ.. ‘పండిట్‌జీ మీరు శీర్షాసనం వేస్తారని నాకు తెలుసు. ఆరోగ్యానికి అది ఎంతో మేలు చేస్తుంది కూడా. కానీ దేశంలో జరిగే విషయాలను కూడా అలా తలకిందులుగానే చూస్తానంటే కుదరదం’టూ విమర్శించారు. వ్యక్తిగతంగా నెహ్రూ అంటే ఎంతో అభిమానమున్నప్పటికీ ప్రతిపక్ష నేతగా ఉన్న వాజ్‌పేయి తన బాధ్యతలను విస్మరించేవారు కారు.  అందువల్లే నెహ్రూ 1961లో ఏర్పాటు చేసిన జాతీయ సమగ్రతా మండలీలో వాజ్‌పేయిని నియమించారు.

ఆయన శ్రీరాముడిలాంటి వారు
నెహ్రూ పట్ల తన గౌరవాన్ని చూపించడంలో వాజ్‌పేయి ఎవరికి భయపడేవారు కారు. 1964లో నెహ్రూ మరణించినప్పడు వాజ్‌పేయి మాట్లాడుతూ.. ‘ఒక కల చెదిరిపోయింది.. విశ్వంలో ఒక జ్వాల మరుగునపడిపోయింది. ఆకలి, భయమంటే తెలియని ప్రపంచం గురించి కలగన్న గులాబీ నేడు రాలిపోయింది. చీకటితో పొరాడి మాకు దారి చూపిన వెలుగు అస్తమించిందం’టూ నివాళులు అర్పించారు. అంతేకాక నెహ్రూ చాలా నిజాయితీ గల వ్యక్తి, చర్చలంటే భయపడే వారు కారంటూ నెహ్రూను, వాజ్‌పేయి శ్రీరామునితో పోల్చారు.

కూతురితోనూ ఢీ...
అయితే వాజ్‌పేయికి నెహ్రూతో ఉన్నంత మంచి సంబంధాలు ఆయన కూతురు ఇందిరా గాంధీతో లేవు. 1970లో ఒకసారి పార్లమెంట్‌లో వాడివేడి చర్చలు జరుగుతున్న సందర్భంలో ఇందిరా గాంధీ జన్‌ సంఘ్‌ను ముస్లిం వ్యతిరేకిగా చిత్రీకరిస్తూ విమర్శలు చేశారు. అంతేకాక తాను తల్చుకుంటే జన్‌సంఘ్‌ను 5 నిమిషాల్లో నాశనం చేస్తానంటూ ఆవేశపూరితంగా మాట్లాడారు ఇందిరా గాంధీ.

అయితే తర్వాత మాట్లాడిన వాజ్‌పేయి ప్రధాని ఇందిరా గాంధీ మాటలకు ధీటుగా బదులిస్తూ ‘ప్రజాస్వామ్య దేశంలో ఒక ప్రధాని ఇలా మాట్లాడటం సమంజసమేనా’ అంటూ విమర్శించారు. అంతేకాక ఆమె(ప్రధాని ఇందిర) జన్‌సంఘ్‌ను కేవలం 5 నిమిషాల్లో నాశనం చేస్తానని అన్నారు... 5 నిమిషాల్లో ఆవిడ తన జుట్టునే సరిచేసుకోలేరు అలాంటిది జన్‌సంఘ్‌ను ఎలా మారుస్తారంటూ’ వాజ్‌పేయి ప్రశ్నించారు. అంతేకాక నెహ్రూజీ కూడా కోప్పడేవారని, కానీ ఇలా మాత్రం మాట్లాడేవారు కారంటూ గుర్తు చేశారు.

ఇందిరను దుర్గా దేవిగా
అయితే మంచి పనులు చేసినప్పుడు కాంగ్రెస్‌ నాయకులను పొగడటానికి వాజ్‌పేయి ఏ మాత్రం సిగ్గుపడే వారు కారు. అందుకే1971 పాకిస్తాన్‌తో జరిగిన  యుద్ధంలో భారత్‌ విజయం సాధించడంతో వాజ్‌పేయి, పార్లమెంట్‌ సాక్షిగా  ఇందిరా గాంధీని దుర్గామాతాతో పోల్చారు. అలానే కాంగ్రెస్‌ నేత, మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీతోను వాజ్‌పేయికి మంచి స్నేహం ఉండేది. వాజ్‌పేయి చివరి వరకూ నమ్మిన సిద్ధాంతం ‘రాజకీయ చదరంగం కొనసాగుతూనే ఉంటుంది. పార్టీలు, ప్రభుత్వాలు ఏర్పడతాయి, పడిపోతాయి. కానీ ఈ దేశం, ప్రజస్వామ్యం ఎన్నటికి నిలిచి ఉంటాయి’.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement