ఈ ఏడాది పద్మ పురస్కారాలు ప్రకటించారు కానీ దేశ అత్యున్నత పురస్కారం ‘భారత రత్న’ను ప్రకటించలేదు. ఎన్నో త్యాగాలూ, సేవలూ చేసినవారికి ప్రదానం చేసే ఈ అత్యున్నత పురస్కారాన్ని ప్రతి ఏడాదీ ప్రకటించి వారిని గౌరవించుకోవడం మన విధి. 1954 నుండి భారత రత్న పురస్కారాన్ని ఇస్తున్నారు. ఇప్పటివరకు 48 మందికి ఈ అవార్డును అందించారు. చివరిసారిగా 2019లో ముగ్గురికి ఇచ్చారు. సామాజిక సేవకుడు నానాజీ దేశ్‌ముఖ్ (మరణానంతరం), కళాకారుడు డాక్టర్ భూపేన్ హజారికా (మరణానంతరం), మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీలకు ఈ అవార్డును ప్రదానం చేశారు.
భారత రత్నకు వ్యక్తులను ఎంపిక చేసే ప్రక్రియ పద్మ అవార్డుల కంటే భిన్నంగా ఉంటుంది. ఈ అవార్డుకు వ్యక్తులను సిఫార్సు చేసే ప్రక్రియ ప్రధాన మంత్రి నుంచి మొదలవుతుంది. వ్యక్తుల పేర్లను ఆయనే భారత రాష్ట్రపతికి పంపిస్తారు. కులం, వృత్తి, జెండర్... ఇలా ఎలాంటి భేదం లేకుండా ఎవరి పేరునైనా భారత రత్నకు పరిశీలించొచ్చు. ప్రతి ఏటా ముగ్గురికి భారత రత్న ఇవ్వొచ్చు.
అయితే కేంద్ర ప్రభుత్వం ప్రతి ఏటా పద్మ పురస్కారాలను ప్రకటించినట్లుగా భారతరత్న పురస్కారాన్ని ప్రకటించడం లేదు. అలా ప్రకటించాలని ప్రత్యేక నిబంధనలు ఏమీ లేకపోయినప్పటికీ, దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్ళు అయిన సందర్భంగా ఈ ఏడాది దేశ స్వాతంత్య్రం కోసం ప్రాణాలను అర్పించిన అల్లూరి సీతారామరాజు, చంద్రశేఖర్ ఆజాద్ వంటి మహనీయులకూ గొప్ప సంఘ సంస్కర్తలైన ఫూలే దంపతులకూ, జాతీయ జెండా రూపశిల్పి పింగళి వెంకయ్య వంటి త్యాగ ధనులకూ, ధ్యాన్ చంద్ వంటి క్రీడాకారులకూ భారతరత్న పురస్కారం ఇచ్చి ఉంటే బాగుండేది.
ఎటువంటి ప్రతిఫలం ఆశించకుండా సమాజా భివృద్ధి కోసం పాటుపడిన విశిష్ట వ్యక్తులకు భారతరత్నను ప్రదానం చేయడం ద్వారా వారి త్యాగాలను ఈ తరానికి మరొక్కసారి పరిచయం చేసినట్లు అవుతుంది. ఈ దిశగా కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టాలి.
– ఎం. రాం ప్రదీప్, తిరువూరు, ఎన్టీఆర్ జిల్లా
Comments
Please login to add a commentAdd a comment