రైతాంగ సంక్షేమ చర్యలకు ఆద్యుడు
ఎన్నెన్నో రైతు అనుకూల చట్టాలు తీసుకొచ్చిన చరణ్ సింగ్ రైతు బాంధవుడిగా గుర్తింపు పొందారు. కన్సాలిడేషన్ ఆఫ్ హెల్డింగ్స్ యాక్ట్ ఆఫ్ 1953, ఉత్తరప్రదేశ్ జమీందారీ, భూసంస్కరణ చట్టం–1952ని తీసుకొచ్చారు. దీనివల్ల ఉత్తరప్రదేశ్‌లో జమీందారీ వ్యవస్థ రద్దయ్యింది. చరణ్‌సింగ్ ప్రతిపాదించిన అగ్రికల్చరల్ ప్రొడ్యూస్ మార్కెటింగ్ బిల్లు 1964లో ఆమోదం పొందింది. దీంతో రైతులకు మార్కెట్ లింకేజీ మెరుగైంది.
ఆయన చేపట్టిన భూసంస్కరణలో చిన్న రైతులు ఎంతగానో లబ్ధి పొందారు. భూమి లేనివారికి భూములపై హక్కులు లభించాయి. రైతులకు సామాజిక, ఆర్థిక ప్రగతికి ఈ సంస్కరణలు దోహదపడ్డాయి. 1966, 1967లో ఉత్తరప్రదేశ్‌లో కరువు తాండవించింది. దాంతో రైతుల నుంచి అధిక ధరలకు పంట ఉత్పత్తులు కొనుగోలు చేసి, లబ్ధి చేకూర్చారు. చరణ్ సింగ్ ప్రారంభించిన చర్యల వల్లనే పంటలకు కనీస మద్దతు ధర(ఎంఎస్సీ) విధానం ప్రారంభమైంది. – సాక్షి, నేషనల్ డెస్క్
చౌదరీ చరణ్‌సింగ్. రైతన్నల హక్కుల కోసం పోరాడి వారి ఆత్మబంధువుగా పేరు పొందిన దివంగత ప్రధానమంత్రి. తొలి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ అవలంబించిన సోషలిస్టు ఆర్థిక విధానాలను ఆయన వ్యతిరేకించారు. అయితే తన సుదీర్ఘ రాజకీయ జీవితంలో తొలుత కాంగ్రెస్‌లోనే పనిచేశారు. 1960వ దశకంలో ఆ పార్టీ నుంచి బయటికొచ్చారు. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఎన్నికై ఉత్తర భారతదేశంలో తొలి కాంగ్రెసేతర సీఎంగా రికార్డుకెక్కారు. రెండుసార్లు యూపీ సీఎంగా, ఒకసారి ప్రధానిగా సేవలందిచారు. కేంద్రంలో మొరార్జీ దేశాయ్ తర్వాత ప్రధాని పదవి చేపట్టిన రెండో కాంగ్రెసేతర నాయకుడు చరణ్‌సింగ్ కావడం విశేషం.
► చరణ్‌సింగ్ 1902 డిసెంబర్ 23న ఉత్తరప్రదేశ్‌లో మీరట్ జిల్లా నూర్పూర్ గ్రామంలో జన్మించారు. తల్లిదండ్రులు నేత్రా కౌర్, చౌదరీ మీర్‌సింగ్.
► స్వగ్రామంలోనే ప్రాథమిక విద్య అభ్యసించారు. తర్వాత మీరట్‌లోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో మెట్రిక్యులేషన్ పూర్తిచేశారు.
►1923లో ఆగ్రా కాలేజీలో సైన్స్‌లో గ్రాడ్యుయేషన్ చదివారు. ఆగ్రా యూనివర్సిటీ నుంచి ఎంఏ(హిస్టరీ) పూర్తిచేశారు. 1927లో ఎల్‌ఎల్‌బీ పట్టా సాధించారు. ఘజియాబాద్‌లో అడ్వొకేట్‌గా పేరు నమోదు చేసుకున్నారు.
►ఆర్య సమాజ్ వ్యవస్థాపకుడు దయానంద సరస్వతి బోధనలతో చరణ్‌సింగ్ ప్రభావితులయ్యారు. మహాత్మా గాంధీ, వల్లభ్‌బాయ్ పటేల్ వంటి నాయకుల నుంచి స్ఫూర్తిని పొందారు. భారత స్వాతంత్య్ర పోరాటంలో అడుగుపెట్టారు. పలుమార్లు అరెస్టై జీవితం అనుభవించారు. ఉప్పు చట్టాన్ని ఉల్లంఘించినందుకు ఆర్నెల్లు జైల్లో ఉన్నారు. 1940లో మరో కేసులో ఏడాది జైలుశిక్ష పడింది. 1942లో మళ్లీ అరెస్టయ్యారు.
►స్వాతంత్య్ర పోరాటంలో పాల్గొంటూనే మరోవైపు ఉత్తరాదిన యునైటెడ్ ప్రావిన్సెస్ రాజకీయాల్లో క్రియాశీలకంగా వ్యవహరించారు.
►1937లో తొలిసారిగా యునైటెడ్ ప్రావిన్సెస్ అసెంబ్లీకి ఎన్నికయ్యారు. మీరట్ జిల్లాలోని చాప్రౌలీ నుంచి గెలిచారు. 1946, 1952, 1962, 1967లోనూ విజయం సాధించారు.
►1946లో యునైటెడ్ ప్రావిన్సెస్ ముఖ్యమంత్రి పండిట్ గోవింద్ వల్లభ్ పంత్ ప్రభుత్వంలో పార్లమెంటరీ కార్యదర్శిగా చరణ్ సింగ్
పని చేశారు.
►1951లో మొదటిసారి కేబినెట్ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. న్యాయ శాఖ, సమాచార శాఖ, రెవెన్యూ శాఖ, వ్యవసాయ శాఖ
మంత్రిగా సేవలందించారు.
►1967 ఏప్రిల్ 1న కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. రెండు రోజుల తర్వాత సంయుక్త విధాయక్ దళ్ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు.
►1970 ఫిబ్రవరిలో రెండోసారి యూపీ సీఎంగా ఎన్నికయ్యారు. అదే సంవత్సరం అక్టోబర్ 2న యూపీలో రాష్ట్రపతి పాలన విధించడంలో చరణ్ సింగ్ రాజీనామా చేశారు.
►ఎమర్జెన్సీ వ్యతిరేక ఉద్యమంలోనూ చరణ్‌సింగ్ పాల్గొన్నారు. 1975 జూన్ 26న అరెస్టయ్యారు.
►తన సొంత పార్టీ భారతీయ లోక్‌దళ్‌ను జనతా పార్టీలో విలీనం చేశారు. జనతా పార్టీ వ్యవస్థాపకుల్లో ఒకరైన చరణ్ సింగ్ 1977లో లోక్‌సభకు ఎన్నికయ్యారు.
►జనతా ప్రభుత్వంలో కేంద్ర హోం మంత్రిగా చేశారు. 1979 జనవరిలో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అయ్యారు. తర్వాత ఉప ప్రధానిగా పదోన్నతి పొందారు.
►జనతా పార్టీ చీలిక చరణ్ సింగ్‌కు కలిసివచ్చింది. కాంగ్రెస్ మద్దతుతో 1979 జూలై 28న ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేశారు. అయితే ఆగస్టు 20 దాకా కేవలం 23 రోజులే పదవిలో కొనసాగారు. ఆగస్టు 21 నుంచి 1980 జనవరి 14 దాకా ఆపద్ధర్మ ప్రధానిగా వ్యవహరించారు.
►గ్రామాలకు విద్యుత్ సౌకర్యం కల్పించడానికి చరణ్‌సింగ్ ఎంతగానో చొరవ చూపారు. ‘నాబార్డ్’వంటి సంస్థల ఏర్పాటులో ఆయనదే కీలక పాత్ర.
►భారత ఆర్థిక శాస్త్రం, దేశ వ్యవసాయ రంగం, భూసంస్కరణలు, పేదరిక నిర్మూలనపై పలు పుస్తకాలు రాశారు.
►1987 మే 29న 84 ఏళ్ల వయసులో చరణ్‌సింగ్ తుదిశ్వాస విడిచారు. ఆయన జయంతి డిసెంబర్ 23ను ఏటా ‘కిసాన్ దివస్’గా పాటిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment