అమ్మ అభిమానులకు నిరాశ
అమ్మ అభిమానులకు నిరాశ
Published Fri, Jan 6 2017 3:08 PM | Last Updated on Mon, Jul 29 2019 5:53 PM
ఎన్నో సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలితకు భారత రత్న ఇవ్వాలని కోరుతున్న అమ్మ అభిమానులకు నిరాశ ఎదురైంది. జయలలితకు భారత రత్న ఇచ్చేలా కేంద్రాన్ని ఆదేశించాలని కోరుతూ దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని మద్రాసు హైకోర్టు కొట్టేసింది. మద్రాసు హైకోర్టు తోసిపుచ్చిన ఈ పిల్తో అమ్మకు భారతరత్న వస్తుందో రాదోనని అన్నాడీఎంకే నేతల్లో ఆందోళన నెలకొంది. డిసెంబర్లో అమ్మ మరణించిన తర్వాత భేటీ అయిన తొలి కేబినెట్ జయలలితకు భారత రత్న ఇవ్వాలని కేంద్రానికి తీర్మానించిన సంగతి తెలిసిందే. దేశంలో అత్యున్నత పౌర పురస్కారంగా భారతరత్నకు పేరొంది.
అమ్మకు భారతరత్న ఇవ్వాలనే డిమాండ్తో పాటు పలు తీర్మానాలను ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం నేతృత్వంలోని కేబినెట్ ఆమోదించింది. అమ్మ కాంస్య విగ్రహాన్ని పార్లమెంట్ కాంప్లెక్స్లో ఏర్పాటుచేయాలని కేంద్రానికి ప్రతిపాదించింది. అదేవిధంగా ఎంజీఆర్ స్మారకమందిరం వద్దనే అమ్మ స్మారకమందిరం ఏర్పాటుచేయాలని, ఎంజీఆర్ స్మారకమందిరం పేరునూ భారతరత్న డాక్టర్ పురచ్చి తలైవార్ ఎంజీఆర్ పేరుగా మార్చాలని నిర్ణయించారు. జయలలిత స్మారకమందిరానికి పురచ్చి తలైవి అమ్మ సెల్వి జే జయలలితగా పేరు పెట్టాలని నిర్ణయించారు. అమ్మ జీవితాంతమంతా తమిళనాడు రాష్ట్ర ప్రజల కోసమే పనిచేసిందని, సామాజిక సంక్షేమ, విద్యా, వృద్ధి రంగాల్లో అమ్మ సేవలు ఎనలేనివని కేబినెట్ కొనియాడింది.
Advertisement
Advertisement