హాకీ దిగ్గజం బల్బీర్ సింగ్ సీనియర్
హాకీలో దిగ్గజమంటే అందరికీ గుర్తుకొచ్చేది మేజర్ ధ్యాన్‌చంద్.. భారత హాకీపై అంతగా తనదైన ముద్రవేశారు. అయితే ధ్యాన్‌చంద్ తర్వాత ఆ స్థాయిలో గుర్తింపు పొందిన వారు మరొకరు ఉన్నారు. ఆయనే ట్రిపుల్ ఒలింపియన్ బల్బీర్ సింగ్ సీనియర్. కెప్టెన్‌గా, ఆటగాడిగా, కోచ్‌గా ఇలా అన్నింటా తానేంటో నిరూపించుకున్నారు. లివింగ్ లెజెండ్‌గా అందరి మన్ననలు అందుకుంటున్న బల్బీర్... హాకీలో భవిష్యత్ తరాలకు స్ఫూర్తి ప్రదాత.
భారత హాకీలో బల్బీర్ సింగ్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. సెంటర్ ఫార్వర్డ్‌గా ప్రత్యర్థి పాలిట సింహస్వప్నం. మైదానంలో పాదరసంలా కదులుతూ గోల్స్ వర్షం కురిపించడంలో దిట్ట. ఒలింపిక్స్‌లో మనకు తిరుగులేని రోజుల్లో మువ్వన్నెల జెండా రెపరెపలాడేలా చేయడంలో ఈ పంజాబీదే కీలకపాత్ర. 1928 నుంచి 1956 వరకు వరుసగా ఆరుసార్లు స్వర్ణం సాధిస్తే.. అందులో తాను పాల్గొన్న వరుస మూడు ఒలింపిక్స్‌లోనూ బల్బీర్ భారత్‌ను చాంపియన్‌గా నిలిపారు.
ఒలింపిక్స్ రారాజు
స్వతంత్ర భారతావనిలో మొదటిసారిగా ఒలింపిక్స్‌లో ఇండియాకు 1948లో తొలి బంగారు పతకం దక్కింది. అదికూడా లండన్ ఆతిథ్యమిచ్చిన ఒలింపిక్స్‌లోనే కావడం విశేషం. ఈ విజయంలో బల్బీర్ సింగ్‌ది కీలకపాత్ర. లండన్ ఒలింపిక్స్‌లో బల్బీర్ 8 గోల్స్ చేశారు. గ్రూప్ దశలో అర్జెంటీనాపై 6, ఫైనల్లో గ్రేట్ బ్రిటన్‌పై 2 గోల్స్ చేసి భారత్‌కు బంగారు పతకం అందించారు. ఇక 1952 హెల్సింకి ఒలింపిక్స్‌లోనూ బల్బీర్ అంతకన్నా ఎక్కువ జోరును కనబర్చారు. క్వార్టర్స్, సెమీస్‌తో పాటు ఫైనల్లోనూ పాదరసంలా కదిలి జట్టును విజయపథాన నడిపించారు. మెల్‌బోర్న్ ఆతిథ్యమిచ్చిన 1956 ఒలింపిక్స్‌లో బల్బీర్ సింగ్ కెప్టెన్‌గా తానేంటో నిరూపించుకున్నారు. ఈ ఒలింపిక్స్‌లో ఆయన గ్రూప్ దశలో అద్భుత ఆటతీరును ప్రదర్శించారు. అప్ఘానిస్థాన్‌తో జరిగిన గ్రూప్ మ్యాచ్‌లో భారత్ 14 గోల్స్ చేయగా, అందులో ఆయన 5 గోల్స్ సాధించారు. ఆ తర్వాత సారథిగా జట్టును ముందుండి నడిపించారు. ఇక ఫైనల్లో పాకిస్థాన్‌పై గెలవడం ద్వారా స్వర్ణాన్ని చేజిక్కించుకుంది.
గిన్నిస్ బుక్‌లో గోల్స్
1952 హెల్సింకి ఒలింపిక్స్ ఫైనల్లో బల్బీర్ సింగ్ ప్రత్యర్థి పాలిట సింహస్వప్నమయ్యారు. ఆయన కురిపించిన గోల్స్ వర్షం ఆతిథ్య నెదర్లాండ్స్‌ను, హాకీ అభిమానులను నోరెళ్లబెట్టేలా చేసింది. ఈ ఫైనల్లో హాకీ దిగ్గజం ఒకటి కాదు, రెండు కాదు ఏకంగా ఐదు గోల్స్ సాధించి భారత మువ్వన్నెల జెండా రెపరెపలాడేలా చేశారు. ఫైనల్లో ఓ క్రీడాకారుడు ఐదు గోల్స్ చేయడం అదే తొలిసారి. 62 ఏళ్లుగా ఈ రికార్డు ఆయన పేరిటే కొనసాగుతోంది. ఈ ఘనతే బల్బీర్‌కు గిన్నిస్ బుక్‌లో చోటు దక్కేలా చేసింది.
కోచ్ పాత్రలో...
బల్బీర్ కెప్టెన్‌గా, ఆటగాడిగా మాత్రమే కాదు.. కోచ్‌గానూ మెరిశారు. 1971 ప్రపంచ కప్ హాకీలో భారత జట్టుకు కోచ్‌గా వ్యవహరించారు. అప్పుడు భారత్ కాంస్య పతకం సాధించింది. అంతేకాదు 1975 ప్రపంచకప్‌లో చాంపియన్‌గా నిలిచిన సమయంలో బల్బీర్ జట్టుకు మేనేజర్‌గా ఉన్నారు.
భారతరత్నపై ఆశ
పద్మశ్రీ అవార్డు దక్కించుకున్న క్రీడాకారుల్లో మొదటివారు బల్బీర్. భారత్ స్వాతంత్య్రం సాధించిన తర్వాత వరుసగా మూడుసార్లు బంగారు పతకాలు సాధించడంలో ముఖ్యపాత్ర పోషించినందుకు ఆయనకు ఈ ఘనత దక్కింది. ఇప్పుడు ఆయన లక్ష్యం భారతరత్న. క్రికెట్ దిగ్గజం సచిన్‌కు భారతరత్న దక్కడంతో చాలా మంది క్రీడా దిగ్గజాలు ఇప్పుడు దేశ అత్యున్నత పౌర పురస్కారంపై ఆశలు పెంచుకుంటున్నారు. ఇందులో బల్బీర్ కూడా ఒకరు. ధ్యాన్‌చంద్‌కు భారతరత్న ఇవ్వాలని డిమాండ్లు పెరిగిపోతున్న నేపథ్యంలో తనకూ ఈ పురస్కారం లభిస్తుందని ధీమాగా ఉన్నారు. 90 ఏళ్ల వయసున్న బల్బీర్ తన జీవిత కాలంలో ఈ పురస్కారం అందుకుంటానంటున్నారు.
లివింగ్ లెజెండ్
Published Fri, Sep 12 2014 10:56 PM | Last Updated on Tue, Aug 21 2018 2:34 PM
Advertisement