ఒలింపిక్స్ హాకీలో కొత్త చరిత్ర!
రియో డీ జనీరో: రియో ఒలింపిక్స్లో అర్జెంటీనా పురుషుల హాకీ జట్టు సరికొత్త చరిత్ర సృష్టించింది. ఒలింపిక్స్ పురుషుల హాకీలో తొలి స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకుని కొత్త అధ్యాయాన్ని లిఖించింది. గురువారం జరిగిన తుదిపోరులో అర్జెంటీనా 4-2 తేడాతో బెల్జియంను ఓడించి పసిడిని సొంతం చేసుకుంది. ఇరు జట్ల మధ్య హోరాహోరీగా జరిగిన పోరులో అర్జెంటీనా అత్యంత వ్యూహాత్మకంగా వ్యవహరించి జయకేతనం ఎగురవేసింది. ఆట తొలి అర్ధభాగంలో భాగంగా 10వ నిమిషంలో గోల్ సాధించిన అర్జెంటీనా.. ఆ తరువాత మరింత దూకుడగా ఆడి విజయాన్ని సాధించింది. దీంతో ఒలింపిక్స్ పురుషుల హాకీలో తొలి పతకాన్ని సాధించడమే కాకుండా, స్వర్ణాన్ని కూడా చేజిక్కించుకోవడం విశేషం.
అయితే రజత పతకానికే పరిమితమైన బెల్జియం కూడా ఒలింపిక్స్ లో కొత్త చరిత్రను సృష్టించింది. ఒలింపిక్స్ హాకీలో బెల్జియంకు ఇదే అత్యుత్తమ పతకం. 1920లో కాంస్యాన్ని సాధించిన బెల్జియం.. ఆపై పతకాల వేటలో మాత్రం విఫలమైంది. తాజా రజతంతో 96 సంవత్సరాల ఒలింపిక్స్ హాకీలో పతకాల నిరీక్షణకు బెల్జియం తెరదించింది.