
రజనీకాంత్‌కు భారతరత్న!
- మహారాష్ట్ర ఎమ్మెల్యే ప్రతిపాదన
ముంబై: సూపర్ స్టార్ రజనీకాంత్ తాజా చిత్రం ‘కబాలి’.. భారీ అంచనాలతో విడుదలైన ఈ సినిమాతో దేశమొత్తం రజనీ నామస్మరణలో మునిగిపోయింది. సినిమాకు రివ్యూలు ఎలా వచ్చినా కలెక్షన్ల వర్షం భారీగా కురుస్తూ.. తలైవా స్టామినా ఏమిటో చాటుతోంది. ఈ నేపథ్యంలో మహారాష్ట్ర బీజేపీ ఎమ్మెల్యే అనిల్ గోటే ఓ అరుదైన ప్రతిపాదనను తెరపైకి తెచ్చారు. దేశంలో అత్యున్నత పౌర పురస్కారమైన ‘భారత రత్న’ను రజనీకాంత్‌కు ప్రదానం చేయాలని ఆయన కోరారు.
మహారాష్ట్ర ప్రభుత్వం ప్రకటించే అత్యున్నత పురస్కారం ‘మహారాష్ట్ర భూషణ్’ను రజనీకాంత్‌కు ఇవ్వాలని ఆయన దేవేంద్ర ఫడ్నవిస్ సర్కారుకు ప్రతిపాదించారు. పనిలో పనిగా రజనీకాంత్‌కు ‘భారత రత్న’ ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతూ మహారాష్ట్ర అసెంబ్లీలో తీర్మానం చేయాలని ఆయన కోరారు. రజనీని మహారాష్ట్ర భూమిపుత్రుడిగా అభివర్ణించిన ఎమ్మెల్యే గోటే.. ఆయన అభిమానులకు దేవుడితో సమానమని, తాజా సినిమా సక్సెస్ సినీ పరిశ్రమలో రజనీకున్న స్థానాన్ని చాటుతున్నదని పేర్కొన్నారు.
అసాధారణ కలెక్షన్లతో దూసుకుపోతున్న ‘కబాలి’ ఇప్పటికే రూ. 200 కోట్ల క్లబ్బులో ఎంటరైంది. దక్షిణాదిన ఈ సినిమాకు భారీ వసూళ్లు వస్తుండటంతో ‘కబాలి’ కలెక్షన్లు రూ. 300 కోట్లకు చేరవచ్చునని భావిస్తున్నారు.