తమిళనాట ఆ ఇద్దరు కలిస్తే అద్భుతమే!
- తమిళ రాజకీయ ముఖచిత్రం మారిపోతుంది
- ఆరెస్సెస్ సిద్ధాంతకర్త గురుమూర్తి
న్యూఢిల్లీ: తమిళనాడు రాజకీయాలకు సంబంధించి మాస్టర్‌మైండ్‌గా ఆరెస్సెస్ సిద్ధాంతకర్త స్వామినాథన్ గురుమూర్తిని పరిగణిస్తారు. రజనీకాంత్ సన్నిహిత మిత్రుడిగా, సలహాదారుగా పేరొందిన ఆయన తాజాగా సూపర్‌స్టార్ రాజకీయ ఎంట్రీపై స్పందించారు. 'రజనీ రాజకీయాల్లోకి వస్తున్నారా?' అన్న ప్రశ్నకు తొలిసారిగా సూటిగా సమాధానమిస్తూ.. 'నా అంచనా ప్రకారం రజనీ తన సొంత రాజకీయ పార్టీని పెట్టబోతున్నారు. జయలలిత మృతి తర్వాత రాష్ట్ర రాజకీయాల్లో శూన్యం ఆవరించింది. ఈ శూన్యాన్ని భర్తీ చేయడానికి రజనీ సరైన వ్యక్తి' అని అభిప్రాయపడ్డారు.
రజనీకి బీజేపీ మద్దతునిస్తుందా? అన్న ప్రశ్నకు.. 'రజనీకాంత్‌కు తన లోపాలేమిటో తెలుసని అనుకుంటా. ఆయన, నరేంద్రమోదీ చేతులు కలుపడం నిజంగా అద్భుతమైన విషయం. ద్రవిడ రాజకీయాలతో ముందుకు సాగుతున్న తమిళనాడు రాజకీయ రాజకీయ ముఖచిత్రాన్ని ఇది పూర్తిగా మారిపోతుంది' అని చెప్పారు. బీజేపీ, రజనీకాంత్ చేతులు కలుపుతారన్న గురుమూర్తి వ్యాఖ్యలు ఇటు తమిళనాట, అటు జాతీయ రాజకీయాల్లో కలకలం రేపుతున్నాయి. తమిళ రాజకీయాలను 'ద్రవిడ రహితంగా' (డీ-ద్రవిడనైజ్) మార్చేందుకు రజనీ రాక ఉపయోగపడుతుందని, ఇప్పటికే తమిళ రాజకీయాలు కొంతమేరకు డీ-డ్రవిడనైజ్ అయ్యాయని ఆయన వ్యాఖ్యానించారు.