సాక్షి, పెరంబూరు: తమిళనాడు రాజకీయాలు ఇప్పుడు స్టార్ నటుల చుట్టూ తిరుగుతున్నాయా? అంటే అవుననే సమాధానమే వస్తుంది. అంతే కాదు ఈ స్టార్లతోనూ ఇతర పార్టీలకు చెక్ పెట్టాలని ద్రవిడ పార్టీలు అన్నాడీఎంకే, డీఎంకే పార్టీ నాయకులు వ్యూహ రచన చేసే పనిలో ఉన్నట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో మరో ఏడాదిలో శాసన సభ ఎన్నికలు జరగనున్నాయి. దీంతో ప్రస్తుతం అధికారంలో ఉన్న అన్నాడీఎంకేనే మళ్లీ ఎన్నికల్లో గెలుస్తామనే ధీమాను వ్యక్తం చేస్తోంది. ఇక ప్రతిపక్షంలో ఉన్న డీఎంకే ఈ సారి అధికారంలోకి రావడానికి గట్టిగా ప్రయత్నిస్తోంది. కాగా ప్రస్తుతం ఆ పార్టీతో పొత్తు కలిగి ఉన్న కాంగ్రెస్ పార్టీ ఎలాగైనా ప్రభుత్వాన్ని హస్తగతం చేసుకోవాలని భావిస్తోంది. అందుకు నటుడు విజయ్‌ని పార్టీలో చేర్చుకునే విధంగా పావులను కదుపుతోంది.
ఇక నటుడు కమల్‌హాసన్ సొంతంగా మక్కళ్ నీది మయ్యం పార్టీని ప్రారంభించి ఆ మధ్య జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో ఆశాజనక ఓట్లను సంపాదించుకుని రానున్న శాసనసభ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ప్రజల్లోకి వెళుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో నటుడు రజనీకాంత్ కొత్తగా పార్టీని ప్రారంభించడానికి సిద్ధం అవుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఆయన రానున్న శాసనసభ ఎన్నికలపైనే గురిపెడుతున్నారు. రాష్ట్రంలోని 234 నియోజక వర్గాల్లోనూ పోటీ చేస్తానని రజనీకాంత్ ఆరంభంలోనే వెల్లడించారన్నది గమనార్హం. కాగా ఈయన బీజేపీ మద్దతుదారుడిగా ముద్ర వేసుకున్నారనే ప్రచారం బాగానే జరుగుతోంది. చదవండి: విజయ్ పార్టీని ప్రారంభిస్తే వారికే లాభం..
విజయ్‌కి స్వాగతం
కాగా రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ నటుడు విజయ్‌ని తమ పార్టీలోకి లాగాడానికి ప్రయత్నాలను ఇప్పటికే మొదలెట్టిందనే ప్రచారం జరుగుతోంది. ఇటీవల బిగిల్ చిత్ర ఆడియో ఆవిష్కరణ కార్యక్రమంలో నటుడు విజయ్ అన్నాడీఎంకే ప్రభుత్వంపై విమర్శలు చేశారు. వాటికి అన్నాడీఎంకే నాయకులు గట్టిగానే బదులిచ్చారు. అప్పుడు కాంగ్రెస్ నాయకులు విజయ్‌కి మద్దతుగా నిలిచారు. కాగా ఇటీవల విజయ్ ఇళ్లల్లో ఐటీ సోదాలు జరిగినప్పుడూ కాంగ్రెస్ నాయకులు ఆ సోదాలను ఖండించారు. ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కేఎస్.అళగిరి రజనీకాంత్ విషయంలో రాయితీలు ఇచ్చిన ఆదాయపన్నుశాఖ నటుడు విజయ్‌కు ఒక్క రోజు కూడా సమయం ఇవ్వకుండా సోదాలు నిర్వహించడం ఏమిటని, రజనీకి ఒక న్యాయం, విజయ్‌కు ఒక న్యాయమా అని ప్రశ్నంచారు. చదవండి: రాజకీయాల్లోకి వస్తానని చెప్పలేను..
దీంతో శుక్రవారం నటుడు విజయ్ కాంగ్రెస్ పార్టీలో చేరాలని ఆహ్వానిస్తున్నారా అని ఆ పార్టీ అధ్యక్షుడు కేఎస్.అళగిరిని మీడియా ప్రశ్నంచగా విజయ్ తమ పార్టీలో చేరతానంటే సాదరంగా ఆహ్వానిస్తామన్నారు. అయితే ఆయన్ని పార్టీలో చేరమని కోరలేదని అన్నారు. కాగా 2021లో జరగనున్న శాసనసభ ఎన్నికల్లో నటుడు రజనీకాంత్‌కు పోటీగా విజయ్‌ను దింపడానికి వ్యూహం జరుగుతుందనే ప్రచారం జరుగుతోంది. రజనీకాంత్ త్వరలో పార్టీని ప్రారంభించి రానున్న శాసనసభ ఎన్నికల్లో పోటీకి సిద్ధం అవుతున్నారనే ప్రచారం జరుగుతోంది.ఈయన డీఎంకే, అన్నాడీఎంకే పార్టీలకు సవాల్‌గా మారతారనే భావన వ్యక్తం అవుతోంది.
దీంతో ఆయనకు వ్యతిరేకంగా నటుడు విజయ్‌ను రంగంలోకి దింపితే రాష్ట్రంలో యథాతథంగా ద్రావిడ పార్టీలైన అన్నాడీఎంకే గానీ, డీఎంకే గానీ అధికారాన్ని చేజిక్కించుకోవచ్చుననే వ్యూహం జరుగుతున్నట్లు తెలిస్తోంది. అదే విధంగా రజనీకాంత్‌కు కాషాయ ముద్ర వేసి, నటుడు విజయ్ బీజేపీకి వ్యతిరేకి అని ప్రచారం చేస్తే రజనీకాంత్‌ను సులభంగా ఓడించవచ్చుననే పథకాన్ని రచిస్తున్నట్లు ప్రచారంలో ఉంది. కాగా ఇప్పటికే డీఎంకే వర్గం నటుడు విజయ్‌ను తమ పార్టీలోకి లాగడానికి ప్రయత్నించినట్లు ప్రచారం. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఆ ప్రయత్నాలు చేస్తున్నట్లు టాక్. ఇలాంటి పరిస్థితుల్లో నటుడు విజయ్ ఏ పార్టీ వైపు మొగ్గు చూపుతారా? ఇవన్నీ కాకుండా తనే సొంతంగా పార్టీని పెడతారా? ప్రస్తుతానికి మౌనంగా ఉంటారా? లాంటి ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
విజయ్ రాజకీయాల్లోకి రావడం తథ్యం..
కాగా విజయ్ రాజకీయ రంగప్రవేశం గురించి సందిగ్ధత నెలకొన్న పరిస్థితిలో ఆయన తండ్రి, దర్శకుడు ఎస్‌ఏ.చంద్రశేఖర్ కుమారుడు విజయ్ రాజకీయాల్లోకి రావడం తథ్యం అని ప్రకటించారు. ఆయన శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ విజయ్‌కి వ్యతిరేకంగా కొందరు అసత్య ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. విజయ్ రాజకీయాల్లోకి వచ్చిన తరువాత సినిమాల్లో చెప్పినట్లుగానే ప్రజలకోసం పనిచేస్తారని అన్నారు. ఇంతకుముందు రజనీకాంత్, కమలహాసన్‌లకు మద్దతు తెలిపినందుకు ఇప్పుడు చింతిస్తున్నానని పేర్కొన్నారు. వారు రాజకీయాల్లోకి వస్తే తమిళనాడుకు మంచి జరుగుతుందని భావించానని, అయితే రజనీకాంత్ తమిళ ప్రజలను మోసం చేస్తున్నారని ఇప్పుడు తనకు అనిపిస్తోందన్నారు. తూత్తుక్కుడిలో పోలీసుల తుపాకీ గుళ్లకు బలైనవారిని రజనీకాంత్ సంఘవిద్రోహులుగా చిత్రీకరించి మాట్లాడారని,తమిళ ప్రజలు వ్యతిరేకిస్తున్న పౌరహక్కుల చట్టం బిల్లుకు ఆయన మద్దతు పలికారని, దీన్ని ఎవరూ అంగీకరించరని దర్శకుడు ఎస్‌ఏ.చంద్రశేఖర్ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment