పెరంబూరు: నటుడు విజయ్ రాజకీయ రంగప్రవేశం అంశం మరోసారి తెరపైకి వచ్చింది. కోలీవుడ్‌లో రజనీకాంత్ తర్వాత అంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న నటుడు విజయ్. నిజం చెప్పాలంటే రజనీకాంత్ రెండు దశాబ్దాల క్రింతం నుంచి రాజకీయాల్లోకి వస్తానని అంటున్నా అందుకు కార్యాచరణను రెండేళ్ల క్రితమే ప్రారంభించారు. ఇక అనూహ్యంగా రాజకీయ రంగప్రవేశం చేసిన కమలహాసన్ కూడా రెండేళ్ల క్రితం తీసుకున్న నిర్ణయమే. కానీ విజయ్ మాత్రం వీరిద్దరికంటే ముందే రాజకీయాలపై కన్నేశారు. తన అభిమాన సంఘాలను ప్రజా సంఘాలుగా మార్చారు. అభిమానుల ద్వారా పలు సేవాకార్యక్రమాలను నిర్వహిస్తూ వారి అభిమానాన్ని తన రాజకీయాలకు వాడుకోవాలని ప్రయత్నించారు. విజయ్ తండ్రీ, దర్శకుడు ఎస్‌ఏ.చంద్రశేఖర్ కూడా విజయ్ రాజకీయాల్లోకి రావడం తథ్యం అని బహిరంగంగానే ప్రకటించారు. దీంతో విజయ్ రాజకీయ రంగప్రవేశం దాదాపు ఖాయం అయిపోయిందన్న తరుణంలో అనూహ్యంగా ఆయన సైలెంట్ అయ్యారు. అందుకు కారణం అప్పటి ముఖ్యమంత్రి జయలలిత విజయ్ నటించిన చిత్రాల విడుదల సమయంలో ఇబ్బందులకు గురి చేయడమేనని ప్రచారం కూడా జరిగింది. ఏదేమైనా విజయ్ రాజకీయ రంగప్రవేశం మరుగున పడింది. ఆయన చిత్రాల్లో నటిస్తూ బిజీ అయిపోయారు. అయితే విజయ్‌కు రాజకీయాలపై ఆసక్తి పోలేదని తన చిత్రాల ప్రచార సమయాల్లో బయట పెడుతూనే ఉన్నాయి.
రాజకీయ నాయకులపై విమర్శలు చేయడం, సంఘ విద్రోహులపై హెచ్చరికలు చేయడం వంటి చర్చలతో వార్తల్లో ఉంటున్నారు. ఆ మధ్య సర్కార్ చిత్ర ఆడియో విడుదల వేదికపైనా రాజకీయ పరమైన వ్యాఖ్యలు చేసి చర్చల్లో నిలిచారు. ఇటీవల బిగిల్ చిత్ర ఆడియో ఆవిష్కరణ కార్యక్రమంలోనూ అధికార పార్టిని విమర్శించేలా వ్యాఖ్యలు చేశారు. ఇటీవల ఆయన ఇళ్లపై ఐటీ సోదాలకు రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల ప్రమేయం ఉందనే ఆరోపణలు వస్తున్నాయి. విజయ్ నటిస్తున్న మాస్టర్ చిత్ర షూటింగ్ ప్రాంతంలో ఐటీ అధికారులు ఆయన్ను సుమారు 5 గంటల పాటు విచారించడం, ఆ తరువాత ఇంటిలో రెండు రోజుల పాటు విచారించడం, తాజాగా ఐటీ కార్యాలయానికి విచారణకు హాజరు కావాల్సిందిగా సమన్లు జారీ చేయడం వంటి పరిణామాలతో విజయ్ రాజకీయాల్లోకి వస్తే స్వాగతిస్తామని కొందరు రాజకీయ నాయకులు, సినీ ప్రముఖులు వ్యాఖ్యానించడం జరిగింది. ఆయనకు మద్దతుగా నిలవడం వంటి చర్యలతో విజయ్ రాజకీయ రంగప్రవేశం చేస్తారా? అన్న ఆసక్తికరమైన ప్రచారం జరుగుతోంది. కాగా ఇప్పటికే కమలహాసన్ మక్కళ్ నీది మయ్యం పేరుతో రాజకీయ పార్టీని ప్రారంభించి రానున్న శాసనసభ ఎన్నికల్లో ముఖ్యమంత్రి పీఠంపై కన్నేస్తున్న సంగతి తెలిసిందే.
ఇక రజనీకాంత్ రేపోమాపో రాజకీయ పార్టీని ప్రారంభించడం ఖాయం అనే ప్రచారం జరుగుతోంది. ఆయన అన్నాడీఎంకే, బీజేపీతో పొత్తు పెట్టుకుంటారనే ప్రచారం బాగానే జరుగుతోంది. మరో పక్క అవసరం అయితే కమల్ పార్టీలో పొత్తు ఉంటుందని ఆయనే స్వయంగా ప్రకటించారు. దీంతో ఆయన అసలు పార్టీని పెడతారా? పెడితో ఒంటరిగా ఎన్నికల బరిలోకి దిగుతారా? లేక ఏ పార్టీతో పొత్తు పెట్టుకుంటారు? అన్న అయోమయ పరిస్థితి రాజకీయ వర్గాలతో పాటు ప్రజల్లో నెలకొన్నాయి. అసలు రజనీకాంత్ రాజకీయ పార్టీని పెట్టే సాహసం చేయరనే ప్రచారం కూడా జరుగుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో విజయ్ రాజకీయాల్లోకి వచ్చే అవకాశం లేదనే మాట వినిపిస్తోంది. ఒకవేళ తాను రాజకీయ రంగప్రవేశానికి సిద్ధం అంటే 2006లో విజయ్‌కాంత్ రాజకీయ ప్రవేశంతో డీఎంకే, అన్నాడీఎంకేకు ఏర్పడిన బాధింపే ఇప్పుడూ ఆ పార్టీలకు కలుగుతుందనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. కాగా కమలహాసన్ మక్కళ్ నీది మయ్యం పార్టీ గత లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసి మంచి ఓటు శాతాన్నే రాబట్టుకుందని, అదే విధంగా రజనీకాంత్ పార్టీని ప్రారంభిస్తే ఆయనకు కొంత ఓటు బ్యాంకు ఉంటుందని, అలాంటిది విజయ్ పార్టీని ప్రారంభిస్తే వీరి వల్ల లాభించేది డీఎంకే, అన్నాడీఎంకే పార్టీలేనని కొందరు చర్చించుకుంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment