
కమల్‌తో విజయ్
తమిళసినిమా: కమలహాసన్,రజనీకాంత్‌ల తరువాత రాజకీయ బాట పట్టేది విజయేనా? ఇదే ఇప్పుడు సినీ,రాజకీయ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది. కమల్‌కు విజయ్ కృతజ్ఞతలు తెలపడం దీనికి సంకేతం? అనే చర్చ జరుగుతోంది. కమలహాసన్ ఇటీవల ట్విట్టర్ ద్వారా ప్రేక్షకులకు దగ్గరవుతున్నారు. ప్రశ్నలకు బదులిస్తూ సంతృప్తి పరుస్తున్నారు. ఇటీవల ట్విట్టర్‌లో ఒక అభిమాని నటుడు విజయ్ రాజకీయాల్లోకి వస్తే స్వాగతిస్తారా? అని ప్రశ్నించారు. కమల్ బదులిస్తూ సోదరులందరినీ తాను ఆహ్వానిస్తాననీ, అందులోనూ తనకే కాకుండా అందరికీ ఇష్టమైన సోదరుడు విజయ్‌ని కచ్చితంగా ఆహ్వానిస్తానని పేర్కొన్నారు.
దీనికి స్పందించిన విజయ్ ఫోన్ ద్వారా, వాట్స్‌యాప్‌లోనూ కమలహాసన్‌కు ధన్యవాదాలు తెలిపారు. ఈ క్రమంలో విజయ్ రాజకీయాల్లోకి వస్తారనే ఊహాగానాలు ఊపందుకున్నాయి. నిజానికి విజయ్ ఇంతకు ముందు రాజకీయరంగ ప్రవేశానికి సిద్ధం అయ్యారు. అయితే ఆ సమయంలో వ్యతిరేకతలు, తన చిత్రాలకు ఎదురైన రాజకీయ సమస్యల కారణంగా వెనక్కు తగ్గాల్సి వచ్చింది. తాజాగా కమల్,రజనీలు వచ్చే ఆదరణను చూపి ఆ తరువాత రంగప్రవేశం గురించి ఒక నిర్ణయానికి రావాలని విజయ్ భావిస్తున్నట్లు సమాచారం.