కోల్‌కతా/న్యూఢిల్లీ: సెయింట్ మదర్ థెరిసా స్థాపించిన ‘మిషనరీస్ ఆఫ్ చారిటీ’కి చెందిన భారత్‌లో ఉన్న బ్యాంకు ఖాతాలన్నింటికీ కేంద్ర హోంశాఖ స్తంభింపజేసిందని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సోమవారం వెల్లడించారు. ‘మదర్ థెరిసా నెలకొల్పిన సంస్థ... మిషనరీస్ ఆఫ్ చారిటీ (ఎంఓసీ)కు భారత్‌లో ఉన్న బ్యాంకు ఖాతాలను క్రిస్మస్ రోజున కేంద్ర హోంశాఖ స్తంభింపజేసిందని తెలిసి షాక్ గురయ్యా! 22 వేల మంది రోగులు, ఉద్యోగులకు మందులు, ఆహారం అందకుండా పోయింది.
చట్టమే సర్వోన్నతమైనది... కాకపోతే మానవతాసాయం విషయంలో రాజీపడకూడదు’ అని మమత ట్వీట్ చేయడం ప్రకంపనలు సృష్టించింది. ఎంతోమంది నిరుపేదలు, అభాగ్యుల వైద్యం, సంక్షేమం కోసం పనిచేస్తున్న మిషనరీస్ ఆఫ్ చారిటీ ఖాతాలను స్తంభింపజేశారనే వార్త తీవ్ర కలకలం రేపింది. టీఎంసీతో పాటు సీపీఎం తదితర విపక్షాలు కేంద్ర ప్రభుత్వ చర్యను తీవ్రంగా ఖండించాయి. దాంతో హోంమంత్రిత్వ శాఖ వివరణ ఇచ్చింది.
విదేశాల నుంచి విరాళాల సేకరణకు వీలుగా... ఫారిన్ కంట్రిబ్యూషన్ (రెగ్యులేషన్) యాక్ట్ (ఎఫ్‌సీఆర్‌ఏ)–2011 కింద రిజిస్ట్రేషన్‌ను రెన్యూవల్ చేయాలని మిషనరీస్ ఆఫ్ చారిటీ సంస్థ పెట్టుకున్న దరఖాస్తును ఈనెల 25న తిరస్కరించామని తెలిపింది. ఈ చట్టం కింద రిజిస్ట్రేషన్‌కు అర్హమైన నిబంధనలను మిషనరీస్ ఆఫ్ చారిటీ సంతృప్తిపరచడం లేదని, పైగా ఈ సంస్థపై తమకు రాతపూర్వకంగా కొంత ప్రతికూల సమాచారం అందిందని పేర్కొంది. తాము బ్యాంకు ఖాతాలను స్తంభింపజేయలేదని వివరణ ఇచ్చింది.
అయితే ఈ ప్రతికూల సమాచారమేమిటి? ఏయే నిబంధనలను మిషనరీస్ ఆఫ్ చారిటీ ఉల్లంఘించదనే వివరాలను కేంద్ర హోంమంత్రిత్వ శాఖ బయటపెట్టలేదు. ‘ఎప్‌సీఆర్‌ఏ కింద మిషనరీస్ ఆఫ్ చారిటీ రిజిస్ట్రేషన్ గడువు ఈ ఏడాది అక్టోబరు 31తోనే ముగిసింది. దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్న ఇతర సంస్థలతో పాటు మిషనరీస్ ఆఫ్ చారిటీకి కూడా గడువును డిసెంబరు 31 దాకా పొడిగించాం’ అవి హోంశాఖ వివరించింది. ఎంఓసీయే తమ విదేశీ నిధుల ఖాతాలను స్తంభింపజేయాలని కోరినట్లు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తమకు తెలిపిందని పేర్కొంది. ఎఫ్‌సీఆర్‌ఏ రిజిస్ట్రేషన్ రెన్యూవల్ నిరాకరణ నిర్ణయంపై పునఃపరిశీలన కోసం ఎంఓసీ నుంచి తమకు ఎలాంటి విజ్ఞప్తి అందలేదని హోంశాఖ తెలిపింది.
మేమే లావాదేవీలు నిలిపివేశాం: ఎంఓసీ
విదేశీ నిధుల జమయ్యే బ్యాంకు ఖాతాల్లో లావాదేవీలను నిలిపివేయాలని దేశంలోని తమ ప్రాంతీయ కేంద్రాలను కోరినట్లు మిషనరీస్ ఆప్ చారిటీ సోమవారం రాత్రి ఒక ప్రకటనను విడుదల చేసింది. రిజిస్ట్రేషన్ రెన్యూవల్ అంశం పరిష్కారమయ్యే వరకు ఆ ఖాతాలను వాడొద్దని చెప్పామని తెలిపింది. ‘ఎఫ్‌సీఆర్‌ఏ కింద మిషనరీస్ ఆఫ్ చారిటీ రిజిస్ట్రేషన్‌ను రద్దు చేయడం, సస్పెండ్ చేయడం గాని జరగలేదని మేము స్పష్టం చేయదలచుకున్నాం. మా బ్యాంకు ఖాతాలను స్తంభింపజేయాలని హోంశాఖ ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేదు. మా రిజిస్ట్రేషన్ రెన్యూవల్ దరఖాస్తుకు ఆమోదం లభించలేదని మాత్రమే మాకు సమాచారమిచ్చింది.
మావైపు నుంచి ఎలాంటి ఉల్లంఘనలు జరగకూడదనే ఉద్దేశంతో సమస్య పరిష్కారమయ్యే వరకు విదేశీ నిధులు జమయ్యే ఖాతాల్లో లావాదేవీలను నిలిపివేయాలని మా కేంద్రాలను కోరాం’ అని ఎంఓసీ సూపీరియర్ జనరల్ సిస్టర్ ఎం.ప్రేమ సంతకంతో విడుదలైన ప్రకటన తెలిపింది. అయితే హోంశాఖ చెప్పినట్లుగా ఖాతాలను స్తంభింపజేయాలని ఎంఓసీయే ఎస్‌బీఐని కోరిందనే అంశంపై... ఈ ప్రకటనలో ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు. మిషనరీస్ ఆఫ్ చారిటీని మదర్ థెరిసా కోల్‌కతా కేంద్రంగా 1950లో స్థాపించారు. రోమన్ క్యాథలిక్ మతాధిపతుల శాశ్వత కమిటీయే ఈ మిషనరీస్ ఆఫ్ చారిటీ. దీని తరఫున దేశ విదేశాల్లో ఎన్నో సేవా కార్యక్రమాలు, ఆసుపత్రులు, శరణాలయాలు నడుస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment