దయామయి
అధికార మందిరాలలో ఆమెకు అఖండ గౌరవ మర్యాదలు లభించాయి. కానీ, ఆమె ఉద్యమం మాత్రం ఖండఖండాలలోని మురికివాడలు, నిరుపేద వీధులు మాత్రమే. తన వ్యవస్థకు చెందిన ఐదు వేల మంది సిస్టర్స్, బ్రదర్స్ సాయంతో ఆమె ఇటుక ఇటుక వంతున పేర్చుకుంటూ వచ్చి, తన విశ్వవ్యవస్థను నిర్మించారు. ఒంటరితనం, ఆకలి, వేదనలను బాపే తన మహోద్యమానికి చేయూతనివ్వడానికి ముందుకు వచ్చిన కోట్లాది సాధారణ ప్రజానీకాన్ని కలుపుకొని ముందుకు తీసుకువెళ్లే సామర్థ్యాన్ని ఆమె ప్రదర్శించారు.
1997లో అంతిమ శ్వాస విడిచే నాటికి, 123 కు పైగా దేశాలలో పని చేస్తున్న బహుళ జాతి వ్యవస్థను ఆమె నిర్మించారు. నిరాశ్రయులు, చ్యుతులు, అనాథలు, ఆకలితో, మృత్యవుతో పోరాడుతున్న వారు ఆమె ప్రత్యేక పరిధిలోకి వచ్చారు. ఈ క్రమంలో ఆమె తన కాలపు ప్రధాన అంతరాత్మ ప్రబోధకులలో ఒకరిగా అవతరించారు. ప్రపంచంలో అత్యున్నతస్థాయి పురస్కారం అయిన నోబెల్ శాంతి బహుమతికి 1979 లో ఆమెను ఎంపిక చేశారనే సమాచారాన్ని అందుకున్నప్పుడు ఆమె మొట్టమొదటిగా చేసిన వ్యాఖ్య : ‘‘నేను అందుకు అర్హురాలను కాను’’ అని! కేవలం పేదల పేరు మీద తాను ఆ అవార్డును అందుకోగలనని ఆమె ఆ బహుమతి నిర్వాహకులకు రాసిన జాబులో తెలిపారు.
ఏకాకులు, దీనులు, అనాథలు, వెలికి గురైన కుష్టు రోగ పీడితులు అందరూ ఆమె నుంచి, ఆమె సహచరులైన సిస్టర్స్ నుంచి ఆదరపూర్వకమైన కరుణను పొందారు. మానవునిలో క్రీస్తును చూస్తూ, ఎలాంటి ఆధిక్య భావనా లేకుండా మదర్ థెరెసా అభాగ్యుల మీద అపారమైన కరుణను కురిపించారు.
కేవలం నచ్చిన భావాలనే వాదాలుగా ఉపయోగించే హిందువుగా నాకు మదర్ థెరెసా ప్రతి క్షణం క్రీస్తు స్పృహలోనే ఉంటారనే సంగతి అర్థం కావడానికి చాలామంది కన్నా ఎక్కువ సమయం పట్టింది. ‘‘విశ్వాసులం కావడమే మన విధి తప్ప, విజేతలు కావడం కాదు’’ అని ఆమె ఒకసారి తన తత్వాన్ని నాకు అరటి పండు ఒలిచి పెట్టినంత‡ సరళమైన మాటలతో వివరించారు. విశ్వాసానికి ఉదాహరణగా ఆమె జీవించారు.
– నవీన్ చావ్లా, మదర్ థెరెసా జీవిత చరిత్ర రచయిత
Comments
Please login to add a commentAdd a comment