
అపశ్రుతి అవసరమా?
నోబెల్ బహుమతిని పుచ్చుకున్నప్పుడు మదర్ థెరిస్సాని అడిగారట: ప్రపంచ శాంతి కోసం ఏం చెయ్యాలి? ఆమె సమాధానం: ‘‘మీ యింటికి వెళ్లి మీ కుటుంబాన్ని ప్రేమించండి!!’’ ప్రేమ మీ పక్కన ఉన్న వ్యక్తితో పంచుకోవడంతో ప్రారంభంకావాలి.
నేను నూటికి నూరుపాళ్లూ హిందువును. సరిగ్గా 67 సంవ త్సరాల కిందట కెనేడియన్ బాప్టిస్ట్ మిషన్ స్కూలు (సీబీ ఎం హైస్కూలు, విశాఖప ట్నం)లో చదువుకున్నాను. మాకు బైబిలు చెప్పే టీచరు పేరు ఇప్పటికీ గుర్తుంది - దైవాదీనం మేష్టారు. రోజూ ప్రార్థనలు చేసేవాళ్లం. ‘ఏసు హల్లెలూయ, హోసన్న రాజు గెల్చిలేచివచ్చెన్’ పాడిన గుర్తు. ఒక యాత్రికుడుగా వాటికన్‌కి వెళ్లాను. వారణాశికి ఇద్దరిని చూడటానికే వెళ్లాను. కాశీవిశ్వేశ్వరుడు. బిస్మిల్లాఖాన్. ఆయన ఇంటికి వెదుక్కుని వెళ్లి నేనూ మావిడా పాదాభివందనం చేశాం. మా కుటుంబ పురోహితుడు గోరంట్ల లక్ష్మీనారాయణ శాస్త్రి గారు మాకు ఫొటోలు తీశారు. నాకు మతమౌఢ్యం లేదని నిరూపించుకోడానికే ఈ సాక్ష్యాలు.
ఆర్‌ఎస్‌ఎస్ అధిపతి మోహన్ భగవత్‌గారు మదర్ థెరిస్సా లక్ష్యం మత మార్పిడిని ప్రోత్సహించడమేన న్నారు ఈ మధ్య. ఇది బొత్తిగా అనౌచిత్యం. అనావ శ్యకం. కొందరు మహానుభావుల సేవల్ని ‘మతం’ స్థాయికి దిగజార్చడం అన్యాయం.
తనది కాని దేశంలో తను ఎరగని కుష్టురోగుల కురుపుల్ని శుభ్రం చేసి, కట్లు కట్టి, హెచ్‌ఐవీ రోగుల అవసానానికి ఉపశమనాన్ని కల్పించి, గుడ్డివాళ్లకి, నిరా శ్రయులకి, వృద్ధులకి, తాగుబోతులకి, పేదలకి, వర దల్లో, కరువుల్లో నిరాశ్రయులయిన వారికి, అభం శుభం తెలియని పుట్టురోగులకీ-ప్రేమనీ, ఆదరణనీ పంచిన ‘అమ్మ’-450 దేశాలకు ఈ సేవలను విస్తరించింది.
రాజకీయ సిద్ధాంతాలు, కులాలకు అతీతంగా అమ్మని ప్రపంచం అక్కున చేర్చుకుంది. కలకత్తాలో కమ్యూనిస్టుల ఊరేగింపు జరుగుతున్నప్పుడు, అమ్మ అటునుంచి వెళ్తూంటే కమ్యూనిస్టు కార్యకర్తలు ఊరేగిం పులోంచి బయటకి వచ్చి ఆమె పాదాలకు నమస్కరించి మళ్లీ ఊరేగింపులో చేరడం సామాన్యమైన దృశ్యం. మానవత్వానికి సిద్ధాంతపరమైన ఎల్లలు లేవని నిరూ పణ అయిన అరుదయిన సందర్భమది.
ఒకరోజు మదర్‌కు రోడ్డు మీద ఒక ముష్టివాడు తారసపడ్డాడు. ‘‘ప్రతీవారూ నీకేదో యిస్తారమ్మా. ఇవా ళ నేనూ యిస్తాను. నాకున్నదంతా యిస్తాను’’ అన్నా డు. ఏమిటది? ఆ రోజు అతని చేతిలో ఓ చిన్న నాణెం పడింది. ‘‘పేదలకు ఇవ్వండి మదర్’’ అంటూ ఆమె చేతిలో పెట్టాడు. మదర్ చలించిపోయింది. పక్కన ఉన్న సిస్టర్‌తో అంది. ‘‘ఈ రోజు ఈ ముష్టివాడు నాకు నోబెల్ బహుమతికన్న గొప్ప బహుమతిని యిచ్చాడు. ఎందు కంటే తనకున్నదంతా సమర్పించుకున్నాడు. ఈ రాత్రి అతనికి ఈ నాణెం తప్ప మరేదీ ఎవరూ యిచ్చి వుం డరు. ఆకలితో నిద్రపోయి ఉంటాడు. సాటి పేదవాడి ఆకలిని తీర్చడానికి తను ఆకలిని ఆహ్వానించడం ఈ లోకంలో గొప్ప త్యాగం’’.
ఓసారి పన్నెండుమంది అంగవైకల్యం ఉన్న -స్పాస్టిక్ పసివారిని ఆమె దత్తత తీసుకున్నారు. తామే మిటో, తమ లోపమేమిటో తెలియని నిస్సహాయులు ఆ బిడ్డలు. వరసగా కూర్చున్న అందర్నీ బుగ్గలు నిమిరి అక్కున చేర్చుకున్న ఆ తల్లిని టీవీలో చూస్తూ నేను ఏడ్చేశాను. ఓ ప్రేమమూర్తి ఆదరణ వారికి దక్కిందని ఆ పసివారికి తెలియదు. ఈ ప్రపంచంలో తాము సేద దీర్చుకోగల స్థలం మరొకటి లేదని వారికి తెలీదు. ప్రేమ ఎదుటి వారికి ఎరుక పరిచి పంచే ఆనందం కాదు. ఎదుటి వ్యక్తి ప్రమేయం లేకుండా ఆవరించే ఆర్ద్రత.
ఇంకా అపూర్వమైన అనూహ్యమైన సంఘటన. 1982లో ఇజ్రాయెల్ సైన్యం, పాలస్తీనా గెరిల్లాలు ఒకరి నొకరు మారణహోమం చేసుకుంటూంటే అమ్మ రెండు పక్షాల మధ్య ధైర్యంగా నిలిచి బాంబులతో కుప్పకూలిన ఓ ఆసుపత్రిలో యిరుక్కున్న 37 మంది పసివారిని కాపా డి బయటకు తెచ్చారు. మత మౌఢ్యంతో నిప్పులు కక్కి, ఒకరినొకరు చంపుకునే రెండు దేశాల శక్తులు ఓ మాన వత్వపు మధ్యవర్తిత్వానికి తలవంచిన అపూర్వమైన క్షణమది.
నోబెల్ బహుమతిని పుచ్చుకున్నప్పుడు ఆవిడని అడిగారట: ప్రపంచ శాంతిని వర్ధిల్లజేయాలంటే ఏం చెయ్యాలి?
ఆమె సమాధానం: ‘‘మీ యింటికి వెళ్లి మీ కుటుం బాన్ని ప్రేమించండి!!’’ ప్రేమ మీ సమక్షంలో మీ పక్కన ఉన్న వ్యక్తితో పంచుకోవడంతో ప్రారంభం కావాలి. ఓ గొప్ప సత్యాన్ని జీవితమంతా ఆచరించి నిరూపించిన తల్లి ఆమె. భారతరత్న. నోబెల్ బహుమతి గ్రహీత. ప్రపంచంలో ప్రతీ దేశం తమ అత్యున్నత పురస్కారాన్ని ఇచ్చి తన కృతజ్ఞతను తెలుపుకుంది.
కన్నీరు అంతర్జాతీయ భాష. మతం దాన్ని అన్వ యించే ప్రాంతీయమైన వైద్యం. ప్రపంచంలో సర్వాంత ర్యామియైన దుఃఖానికి అంతే విస్తృతమైన చికిత్సను చేసిన ఒకే ఒక దేవదూత మదర్. కాగా, మానవత్వానికి మతం లేదు. మానవ సేవకు మతం లేదు. మహనీ యతకు మతం లేదు.
- గొల్లపూడి మారుతీరావు