నోబుల్ మెమోరియల్ వాల్ ప్రారంభం
Published Sat, Nov 9 2013 11:10 PM | Last Updated on Sat, Sep 2 2017 12:28 AM
సాక్షి, న్యూఢిల్లీ: స్వీడన్ ఎంబసీ, ఢిల్లీమెట్రోరైలు కార్పోరేషన్ సంయుక్త ఆధ్వర్యంలో నోబుల్ మెమోరియల్ వాల్ పేరిట ఎగ్జిబిషన్‌ను ఏర్పాటు చేశారు. రాజీవ్‌చౌక్ మెట్రోస్టేషన్‌లో ఏర్పాటుచేసిన ఈ ప్రదర్శనను శనివారం డీఎంఆర్‌సీ ఎండీ మంగూసింగ్, స్వీడన్ రాయబార కార్యాలయం అధికారి శ్యాండ్‌బెర్గ్‌థ్యాంక్‌డ్ ప్రారంభించారు. శనివారం నుంచి ఈనెల 15 వరకు వారం రోజులపాటు కొనసాగనున్న ఈ ప్రదర్శన ముఖ్య ఉద్దేశం భారతీయ ఆధ్యాత్మిక సాహిత్యానికి తగిన ప్రాచుర్యం కల్పించడంతోపాటు రవీంద్రనాథ్ ఠాగూర్ రచనలకు మరింత ప్రచారం కల్పించడమేనని నిర్వాహకులు తెలిపారు.నోబుల్ మొమోరియల్ వీక్ సందర్భంగా ఈ ప్రదర్శనను మరికొన్ని మెట్రోస్టేషన్లలో ఏర్పాటు చేయనున్నారు.
డీఎంఆర్‌సీ అధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని చేపట్టడం ఎంతో గర్వంగా ఉందని మంగూసింగ్ పేర్కొన్నారు. ఠాగూర్‌కి సంబంధించిన పలు అంశాలు యువత తెలుసుకునేందుకు ఈ ఎగ్జిబిషన్ ఎంతో ఉపకరిస్తుందన్నారు. భారతదేశ కీర్తిని ప్రపంచవ్యాప్తం చేసిన మహానుభావుడికి సంబంధించిన ఎగ్జిబిషన్ ఏర్పాటులో పాలుపంచుకోవడం ఎంతో సంతోషంగా ఉందని శ్యాండ్‌బర్గ్ పేర్కొన్నారు. సాహిత్యంలో నోబుల్‌ప్రైజ్ అందుకున్న మొట్టమొదటి నాన్‌యూరోపియన్ రవీంద్రనాథ్ ఠాగూర్ అని గుర్తు చేసుకున్నారు. వాల్ ఎగ్జిబిషన్‌లో భాగంగా ఏటా ఒక్కో నోబుల్ అవార్డు గ్రహీతపై ప్రదర్శన ఏర్పాటు చేస్తున్నామని డీఎం ఆర్‌సీ అధికారులు తెలిపారు. గతంలో సీవీరామన్, డా. హర్‌గోవింద్ ఖురానా, మదర్‌థెరిస్సా, సుబ్రహ్మణ్య చంద్రశేఖర్, అమర్త్యసేన్ తదితరులు సమాజానికి చేసిన సేవలపై అవగాహన కల్పిస్తున్నామన్నారు.
Advertisement
Advertisement