దేవుడి నిరీక్షణ!
దైవికం -
మనిషి తనను ఎలా అర్థం చేసుకోవాలని దేవుడు అనుకుంటున్నాడో, మదర్ థెరిస్సా దేవుడి గురించి మాట్లాడిన ప్రతి మాటలోనూ, ఆమె చేసిన ప్రతి సేవలోనూ పరోక్షంగా మనకు వ్యక్తమౌతున్నట్లుగా ఉంటుంది. థెరిస్సా మరణించి నేటికి పదిహేడేళ్లు. ఇన్నేళ్లలోనూ ప్రపంచం ఆధ్యాత్మికంగా మునుపటి బలంతోనే ఉన్నదంటే థెరిస్సా తన సేవలతో, సాంత్వన వచనాలతో మనిషిని దేవుడికి చేరువగా తీసుకెళ్లేందుకు చేసిన ప్రయత్నాలే కారణం అనుకోవచ్చు. ఇప్పటికీ, ఎప్పటికీ, దేశాల మధ్య యుద్ధాల్లో మదర్ ప్రవచనం ఒక శాంతి శతఘ్నిలా గర్జిస్తూనే ఉంటుంది. ద్వేషాల మధ్య సాగుతున్న మనిషి మనుగడలో మదర్ సేవలు జ్ఞాపకాల లేపనాలై మానవ హృదయాలను మృదువుగా స్పృశిస్తూనే ఉంటాయి.
ఓసారి మదర్‌ని ఎవరో అడిగారు, ‘‘ఇంతగా శాంతిని ప్రబోధిస్తున్నారు కదా, యుద్ధ వ్యతిరేక ప్రదర్శనల్లో మీరెందుకు ప్రత్యక్షంగా పాల్గొనరు?’’ అని. అందుకు మదర్ సమాధానం : ‘‘నేనెప్పటికీ అలా పాల్గొనను. శాంతి అనుకూల ప్రదర్శన జరపండి, వచ్చి చేరుతాను’’.
ఆకలితో అలమటించే వారికంటే కూడా ప్రేమ కోసం పరితపించి పోతున్నవారు ఈ లోకంలో ఎక్కువ మంది ఉన్నారని మదర్ నమ్మారు. వీళ్లందరికోసం మనం గొప్ప పనులేమీ చేయనవసరం లేదు కానీ, మనకు చేతనైన పనినే గొప్ప ప్రేమతో చేస్తే చాలునని చెప్పారు. సాటి మనిషిపై చూపే ప్రేమ.. దేవుడిని సంతోషపెడుతుందని అన్నారు. ఆధ్యాత్మిక గ్రంథాలలోని సారమంతా మదర్ చిరునవ్వులో కనిపిస్తుంది! ఆమె కంటి వెలుగై ప్రసరిస్తుంది.
‘నా’ అని ఆమె చెప్పుకునే ప్రతి మాటా యావత్ మానవాళి తరఫున దేవుడికి నివేదిస్తున్నట్లు ఉంటుంది కానీ, దేవుని తరఫున ప్రవచిస్తున్నట్లు కనిపించదు. ‘‘స్వర్గం కచ్చితంగా ఇలా ఉంటుందని నాకు తెలీదు. కానీ ఒక సంగతి చెప్పగలను. మనం చనిపోయి, దేవుని దగ్గరకు వెళ్లినప్పుడు ‘నీ జీవితంలో నువ్వెన్ని మంచి పనులు చేశావని ఆయన అడగడు. నువ్వా పనులను ఎంత ప్రేమగా చేశావు?’ అని మాత్రమే అడుగుతాడు’’ అంటారు మదర్. పెట్టే ముద్ద ఎంత ప్రేమగా పెడుతున్నాం? కట్టే కట్టు ఎంత ప్రేమగా కడుతున్నాం? ఇచ్చే రూపాయి ఎంత ప్రేమగా ఇస్తున్నాం అన్నదే ముఖ్యమని మదర్ భావన.
కష్టాలన్నవి దేవుడు సృష్టించినవి కావని చెబుతూ, ‘‘నేను తట్టుకోలేని బాధను దేవుడు నాకు ఇవ్వడని తెలుసు. అయినా నా మీద ఆయన మరీ అంత నమ్మకం (తట్టుకోగలదని) పెట్టుకోకూడదని నా ఆశ’’ అని నవ్వుతూ అంటారు మదర్. ఆమె ఉద్దేశం ఏమిటంటే, దేవుడు మరీ మనం తట్టుకోలేని పరీక్షలేవీ పెట్టడనీ, ఒక వేళ పెట్టినా, ఆ పరీక్ష కూడా మనం తట్టుకుని నిలబడేందుకే తోడ్పడుతుందని! ఇదే మాటను బైబిల్‌లో అపొస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో ఇలా చెప్తాడు.
‘‘సాధారణముగా మనుష్యులకు కలుగు శోధన తప్ప మరి ఏదియు మీకు సంభవింపలేదు. దేవుడు నమ్మదగినవాడు; మీరు సహింప గలిగినంతకంటే ఎక్కువగా ఆయన మిమ్మును శోధింపబడనియ్యడు. అంతేకాదు, సహింపగలుగుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకొను మార్గమును కలుగజేయును (10:13).
అవసరంలో మీ దగ్గరకు వచ్చినవారెవరైనా, వెళ్లేటప్పుడు వచ్చినప్పటికంటే మరింత సంతోషంగా, మరింత మెరుగ్గా ఉండాలని మదర్ చెప్తారు. ఎలాగంటే, మనలో దేవుడి కరుణ (ఆ వచ్చిన మనిషి పట్ల) వ్యక్తం అవ్వాలట. మన ముఖంలో, మన కనులలో, మన చిరునవ్వులో కారుణ్యం ప్రతిఫలించాలట.
‘‘దేవుని కారుణ్యం, ప్రేమ.. జీవితాంతం నీ ద్వారా చుట్టుపక్కల వారికి విస్తరించాలి. అందుకు కొన్ని మాటలు అవసరం అయితే కావచ్చు. అయితే ఆ కొన్నిటిని మించి ఒక్కమాటైనా ఎక్కువ మాట్లాడకు’’ అంటారు మదర్. అంటే ప్రేమ, కారుణ్యం మాటల్లో కాక, చేతల్లో వ్యక్తం కావాలని! ఇంతలా మనిషిని మనిషి ప్రేమించడం సాధ్యమేనా?
‘‘సాధ్యం కాకపోవచ్చు. స్వార్థపరులు ఉంటారు. అయినప్పటికీ వారిని క్షమించు. నీలోని కారుణ్యాన్ని చూసి, లేని ఉద్దేశాలను నీకు అంటగడతారు. అయినప్పటికీ వారి పట్ల దయగా ఉండు. నువ్వు నిజాయితీగా ఉండడం చూసి నిన్ను మోసగించేవారు బయల్దేరుతారు. అయినప్పటికీ నువ్వు నిజాయితీగా ఉండు. నువ్వు సంతోషంగా ఉండడం చూసి అసూయ చెందేవారు ఉంటారు.
అయినప్పటికీ సంతోషంగా ఉండు. ఇవాళ నువ్వు చేసిన మంచి పని, రేపు ఎవ్వరికీ గుర్తుండకపోవచ్చు. అయినప్పటికీ మంచే చెయ్యి. ప్రపంచానికి నువ్వెంత ఇవ్వగలవో అంతా ఇవ్వు. అది సరిపోకపోవచ్చు. అయినప్పటికీ ఇచ్చేందుకే ప్రయత్నించు. చివరికి నువ్వూ దేవుడే మిగులుతారు. నువ్వూ వాళ్లూ కాదు’’ అని చెప్తారు మదర్.
మనిషికి, దేవుడికి అనుసంధానమైన ది మదర్ థెరిస్సా జీవితం. మదర్ చూపిన దారిలో వెళితే.. దారి చివర దేవుడు మనకోసం నిరీక్షిస్తూ కనిపించినా ఆశ్చర్యం లేదు.
- మాధవ్ శింగరాజు