నేడే థెరిసాకు సెయింట్‌హుడ్ | Sainthood to mother teresa | Sakshi
Sakshi News home page

నేడే థెరిసాకు సెయింట్‌హుడ్

Published Sun, Sep 4 2016 2:28 AM | Last Updated on Wed, Aug 8 2018 6:12 PM

నేడే థెరిసాకు సెయింట్‌హుడ్ - Sakshi

నేడే థెరిసాకు సెయింట్‌హుడ్

- వాటికన్ సిటీకి భారత్ తరఫున సుష్మ బృందం
- లక్షమంది హాజరయ్యే అవకాశం
 
 వాటికన్ సిటీ: భారతరత్న, నోబెల్ శాంతి బహుమతి విజేత మదర్ థెరిసాకు ఆదివారం వాటికన్ సిటీలో ‘సెయింట్‌హుడ్’ బహూకరించనున్నారు. రోమన్ కేథలిక్ చర్చి పోప్ ఫ్రాన్సిస్ ఈ గొప్ప బిరుదును ఇవ్వనున్నారు. ప్రపంచవ్యాప్తంగా దాదాపు లక్షకు పైగా థెరిసా అభిమానులు ఈ కార్యక్రమానికి హాజరుకానున్నారు. ఈ మహత్కార్యక్రమానికి భారత్ తరపున విదేశాంగ మంత్రి సుష్మస్వరాజ్ నేతృత్వంలో 12 మంది భారతీయుల బృందం వెళ్లింది.

 థెరీసా మహిమలు
 బ్రెయిన్ ఇన్‌ఫెక్షన్‌తో బాధపడుతున్న తన భర్త కోలుకోవటానికి థెరిసాయే కారణమని ఈ కార్యక్రమానికి హాజరయ్యేందుకు వచ్చిన ఓ బ్రెజిల్ మహిళ వెల్లడించింది. ‘నా భర్త ఆండ్రినోస్‌కు మెదడులో ఇన్‌ఫెక్షన్ సోకింది. మందులతో ఇది తగ్గే అవకాశం లేదని వైద్యులు చెప్పారు. కానీ ఓరోజు మదర్ థెరిసా నాకు కలలో కనిపించింది. ఆరోజునుంచి ఆమె చల్లని చూపులతో నాభర్త ఆరోగ్యం క్రమక్రమంగా మెరుగైంది. ఎవరిపైనైనా మదర్ థెరిసా చల్లని చూపులుంటాయి. థెరిసాకు సెయింట్‌హుడ్ బహుకరణ వింతేమీ కాదు’ అని చెప్పింది. అంతకుముందు 1998లోనూ కోల్‌కతాలో అండాశయ సమస్యతో బాధపడుతున్న ఓ మహిళకు థెరిసా పటం నుంచి వచ్చిన ఓ దివ్యజోతి స్పృశించింది. ఆ తర్వాత ఆ మహిళ వ్యాధి నయమైంది. ఈ రెండు ఉదాహరణల ఆధారంగానే థెరీసాకు సెయింట్‌హుడ్ బహుకరించనున్నారు. థెరిసాకు సెయింట్‌హుడ్ బహుకరించటం భారతీయులకు గర్వకారణమని రాష్ట్రపతి ప్రణబ్ అన్నారు.

 సెయింట్‌హుడ్ ఎలా నిర్ధారిస్తారు?
 నిర్యాణం తర్వాతా ఎవరైనా మదర్, ఫాదర్‌లు తమను కొలిచిన వారికి అనారోగ్యాన్ని నయం చేయటం, సమస్యలనుంచి గట్టెక్కించటం చేస్తే వారికి ఈ అరుదైన గౌరవాన్ని అందిస్తారు. ఒక అద్భుతం చేసినట్లు గుర్తిస్తే పవిత్రమూర్తిగా (బీటిఫైడ్), 2 అద్భుతాలు జరిగితే దేవతామూర్తిగా (సెయింట్)గా గుర్తిస్తారు. సాక్ష్యాలు సేకరించి వాటిని ధృవీకరించుకున్నాకే పేరును ప్రకటిస్తారు.
 
 థెరిసా గురించి క్లుప్తంగా..
 జననం: 1910 ఆగస్టు 26
 జన్మస్థలం: మెసడోనియా రాజధాని స్కోప్జె
 తల్లిదండ్రులు: నికోలా బొజాక్షియు, డ్రేన్
 అసలు పేరు: ఆగ్నెస్ గోన్షా బొజాక్షియు
 థెరిసాగా పేరు మార్పు: 1929లో భారత్‌కు వచ్చాక
 ఉద్యోగం: కలకత్తాలోని సెయింట్ మేరీస్ ఉన్నత పాఠశాలలో 1931-48 మధ్య ఉపాధ్యాయురాలు
 సొంత చారిటీ సంస్థ: ద మిషనరీస్ ఆఫ్ చారిటీ-1950 అక్టోబర్ 7న ప్రారంభం
 పురస్కారాలు: మెగసెసే(1962), నోబెల్ బహుమతి (1979), భారత రత్న (1980)
 మరణం: కలకత్తాలో 1997 సెప్టెంబర్ 5

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement