రాష్ట్రపతి పదవి రేసులో లేను: అద్వానీ
న్యూఢిల్లీ: రాష్ట్రపతి పదవిపై బీజేపీ కురువృద్ధుడు ఎల్‌కే అద్వానీ క్లారిటీ ఇచ్చారు. శుక్రవారం ఆయన పార్లమెంట్ వెలుపల విలేకర్లతో మాట్లాడుతూ రాష్ట్రపతి పదవి రేసులో తాను లేనని స్పష్టం చేశారు. కాగా ప్రస్తుత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ పదవీ కాలం జూలై 24తో ముగుస్తుంది. ఈ నేపథ్యంలో ప్రణబ్‌ముఖర్జీ తర్వాత రాష్ట్రపతి పదవి... ఎవరిని వరించనున్నదనే అంశంపై జోరుగా ఊహాగానాలు సాగుతున్నాయి.
గత కొంతకాలంగా ఈ పదవికి సంబంధించి అద్వానీ పేరుతో పాటు బీజేపీ సీనియర్ నేత మురళీమనోహర్ జోషి, కేంద్ర మంత్రి సుష్మా స్వరాజ్, బీజేపీ అనుబంధ సంస్థ ఆర్‌ఎస్‌ఎస్ అధిపతి మోహన్ భాగవత్ పేర్లు ప్రముఖంగా వినిపించాయి. అయితే దీనిపై మోహన్ భగవత్ కూడా గతంలోనే స్పష్టత ఇచ్చారు. తాను రాష్ట్రపతి పదవి రేసులో లేనని, ఇలాంటి వార్తలన్నీ వినోదం కోసం సృష్టించినవే అంటూ ఆగ్రహం కూడా వ్యక్తం చేశారు.
కాగా పార్టీలో మోస్ట్ సీనియర్ నేత అయిన అద్వానీకి గురుదక్షిణగా రాష్ట్రపతి పదవి ఇస్తామని సోమనాథ్ జ్యోతిర్లింగం సాక్షిగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హామీ ఇచ్చినట్లు వార్తలు వెలువడిన విషయం తెలిసిందే. ఇదే విషయాన్ని మోదీ ఇటీవల గుజరాత్‌లో పర్యటించినప్పుడు చెప్పారు. తనకు అద్వానీ గురువు అని, ఆయనకు సముచిత స్థానం కల్పించి గురుదక్షిణ తీర్చుకోవాల్సిన సమయం ఆసన్నమైందని అన్నారు. దీంతో రాష్ట్రపతిగా అద్వానీని చేస్తారనే ప్రచారం జోరుగా జరిగింది. అయితే తాజాగా అద్వానీ కూడా తాను ప్రెసిడెంట్ రేస్‌లో లేనంటూ ఆ వదంతులకు బ్రేక్ వేశారు. ఈ నేపథ్యంలో రాష్ట్రపతి అభ‍్యర్థి ఎవరనే దానిపై ఆసక్తి నెలకొంది.