బీజేపీపై సేన ‘పోస్టర్’ దాడి
♦ ఠాక్రేకు మోదీ వంగి నమస్కరిస్తున్న
♦ పోస్టర్ దాదర్‌లో ప్రత్యక్షం
సాక్షి, ముంబై: ఆరోపణలు, ప్రత్యారోపణలతో బీజేపీని ఇరుకున పెట్టిన మిత్రపక్షం శివసేన బుధవారం పోస్టర్ దాడికి దిగింది. సేన అధినేత దివంగ త బాల్ ఠాక్రేకు ప్రధాని మోదీ వంగి నమస్కరిస్తున్న పాత ఫొటో ముద్రించిన పోస్టర్‌ను అంటించి కొత్త వివాదానికి తెరతీసింది. దాదర్‌లోని సేనా భవన్ వద్ద పార్టీ ముంబై యూనిట్ ఓ పోస్టర్ ఏర్పాటు చేసింది. ‘గర్వంతో ఉన్న మీ శిరస్సులు ఒకప్పుడు బాల్ ఠాక్రే ముందు మోకరిల్లడం మరచిపోయారా?’ అని బీజేపీ నేతలను ప్రశ్నిస్తున్న రీతిలో పోస్టర్‌లో రాశారు.
మాజీ ప్రధాని వాజ్‌పేయి మొదలుకుని ప్రస్తుత ప్రధాని మోదీ, బీజేపీ నేత అద్వానీ, రాజ్‌నాథ్, గోపీనాథ్ ముండే, రాష్ర్టపతి ప్రణబ్ ముఖర్జీ సహా ఎన్సీపీ అధినేత పవార్‌లు ఠాక్రేను ఆయనింట్లో కలసిన ఫొటోలు పోస్టర్‌లో ఉన్నాయి. పోస్టర్లను తాము వేయలేదని, కార్యకర్తల పని కావొచ్చని ఉద్ధవ్ ఠాక్రే సన్నిహితులు అన్నారు. కాగా, రాష్ట్రపతి ప్రణబ్ ఫొటోను పోస్టర్‌పై ముద్రించడంపై కాంగ్రెస్ మండిపడింది. రాష్ర్టపతి, ప్రధానులను కించపరిచినందుకు సేనపై బీజేపీ చర్య తీసుకోవాలని మహారాష్ట్ర అసెంబ్లీ ప్రతిపక్షనేత రాధాకృష్ణ విఖే పాటిల్ డిమాండ్ చేశారు.