ఆ కూటమితో అధోగతి: నరేంద్ర మోడీ
కోల్‌కతా ప్రచారసభలో ధ్వజం
వామపక్షాలు, మూడో కూటమిపై తీవ్ర విమర్శలు
తూర్పు ప్రాంతాన్ని నాశనం చేశాయి
అలాంటి వారిని దేశం నుంచి బహిష్కరించాలి
ప్రధాని అవకుండా ప్రణబ్‌ను గాంధీ కుటుంబం అడ్డుకుంది
కోల్‌కతా/బెంగళూరు: పశ్చిమబెంగాల్లో ప్రచారానికి తొలిసారి అడుగుపెట్టిన భారతీయ జనతా పార్టీ ప్రధాని అభ్యర్థి నరేంద్రమోడీ వామపక్షాలు, మూడోకూటమిని లక్ష్యంగా చేసుకుని తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. వారికి అధికారమిస్తే దేశాన్ని అధమస్థాయి (థర్డ్ రేట్)కి దిగజారుస్తారన్నారు. బుధవారం కోల్‌కతాలోని బ్రిగేడ్ పరేడ్ మైదానంలో జరిగిన భారీ బహిరంగ సభలో మాట్లాడిన ఆయన బెంగాలీ భాషలో భావోద్వేగాన్ని రగిలించే ప్రయత్నం చేశారు. ప్రధాని కావడానికి ప్రణబ్ ముఖర్జీకి అన్ని అర్హతలు ఉన్నాయని, అయినా 1984, 2004లో ఆయనకు పదవి దక్కకుండా గాంధీ కుటుంబం అడ్డుకుందన్నారు.
ఇక ఢిల్లీలో కాంగ్రెస్, బీజేపీకి వ్యతిరేకంగా 11 పార్టీలు చేతులు కలుపుతున్న నేపథ్యంలో వామపక్షాలు, మూడోకూటమిపై ధ్వజమెత్తుతూ.. దేశ తూర్పు ప్రాంతాన్ని పాలించడం ద్వారా ఆ ప్రాంతాన్ని నాశనం చేశాయన్నారు. పశ్చిమప్రాంతంలో వారి ఉనికి లేకపోవడం వల్ల ఆ ప్రాంతం అభివృద్ధి చెందిందన్నారు. లౌకికవాదం పేరుతో ముస్లింలను తప్పుదోవపట్టిస్తూ ఆ పార్టీలు ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తుంటాయని విమర్శించారు. అలాంటి పార్టీలను దేశం నుంచి బహిష్కరించాలన్నారు. ఇక బెంగాలీలు ప్రపంచానికి ఆదర్శంగా నిలిచారంటూ పొగడ్తల్లో ముంచెత్తారు. స్వామి వివేకానంద, రవీంద్రనాథ్ ఠాగూర్, సుభాష్ చంద్రబోస్ సూక్తుల్ని ఉటంకిస్తూ ప్రసంగించారు. కొద్దిసేపు బెంగాలీలో మాట్లాడి సభికుల్ని అలరించారు.
కేంద్రంలో బీజేపీ.. రాష్ట్రంలో టీఎంసీ..
ఎన్నికల అనంతరం పరిణామాలను దృష్టిలో పెట్టుకుని ఫైర్ బ్రాండ్ సీఎం మమతా బెనర్జీ పాలనపై మాత్రం సానుకూలంగా వ్యాఖ్యానించారు. తృణమూ ల్ అధ్యక్షురాలు మమత రాష్ట్రంలో సీఎంగా ఉంటారని.. బెంగాల్లోని 42 లోక్‌సభ సీట్లలో బీజేపీ అభ్యర్థుల్ని గెలిపించి తనకు కేంద్రంలో అధికారమివ్వాలని మోడీ కోరారు. అప్పుడు మూడంచెల విధానంలాగా తనపైన ప్రణబ్‌దాదా పర్యవేక్షణ ఉంటుందంటూ బెంగాల్ ప్రజల్ని ఆకట్టుకునే యత్నం చేశారు.
ఈ కరుణ అప్పుడేమైంది: లెఫ్ట్‌ఫ్రంట్
ప్రణబ్‌ను ప్రధాని కాకుండా గాంధీ కుటుంబం అడ్డుకుందంటూ మోడీ చేసిన వ్యాఖ్యలపై కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి గులాం నబీ ఆజాద్ మండిపడ్డారు. బెంగళూరులోని ఒక సదస్సులో పాల్గొనడానికి వచ్చిన ఆయన తమ పార్టీ అంతర్గత విషయాలు మోడీకి అనవసరమన్నారు. బెంగాల్ లెఫ్ట్ ఫ్రంట్ చైర్మన్ బిమన్‌బోస్ మాట్లాడుతూ.. రాష్ట్రపతి ఎన్నికల్లో ప్రణబ్‌కు పోటీగా అభ్యర్థిని నిలబెట్టినపుడు ఆ కరుణ ఎక్కడకుపోయిందంటూ ప్రశ్నించారు.