నేడే నరేంద్రమోడీ ప్రమాణం
దేశ14వ ప్రధానిగా ప్రమాణ స్వీకారం రాష్ట్రపతి భవన్ ప్రాంగణంలో సాయంత్రం 6 గంటలకు..
న్యూఢిల్లీ: స్వతంత్ర భారతదేశ 14వ ప్రధానమంత్రిగా బీజేపీ సీనియర్ నేత నరేంద్రభాయి దామోదరదాస్ మోడీ(63) ఈ రోజు(సోమవారం) ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. రాష్ట్రపతి భవన్ ప్రాంగణంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వేదికపై సాయంత్రం ఆరు గంటలకు నరేంద్ర మోడీచే రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ప్రమాణస్వీకారం చేయిస్తారు. బంగ్లాదేశ్ మినహా ‘సార్క్’ దేశాల అధినేతలు, మాజీ రాష్ట్రపతులు ప్రతిభాపాటిల్, ఏపీజే అబ్దుల్ కలాం, మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్, కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ, ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ, పలు రాష్ట్రాల గవర్నర్లు, ముఖ్యమంత్రులు, ఎన్‌డీఏ మిత్రపక్షాల నేతలు, విదేశీ రాయబారులు, ఉన్నతాధికారులు సహా 4 వేల మంది ఆహూతుల సమక్షంలో మోడీ ప్రధానమంత్రిగా ప్రమాణం చేస్తారు. అంతకుముందు సోమవారం ఉదయం 7 గంటలకు మహాత్మాగాంధీ సమాధి ‘రాజ్‌ఘాట్’ను నరేంద్రమోడీ సందర్శించి, మహాత్ముడికి నివాళులర్పిస్తారు.
40 మందితో మోడీ టీం
అధికారికంగా ప్రకటించనప్పటికీ.. మోడీ టీంలో 40 మంది ఉండొచ్చని తెలుస్తోంది. వారిలో 16 మందికి కేబినెట్ హోదా ఇచ్చే అవకాశముందని పార్టీ వర్గాల సమాచారం. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన బీజేపీ సీనియర్ నేత వెంకయ్యనాయుడు, తెలంగాణ నుంచి బీజేపీ సీనియర్ నేత బండారు దత్తాత్రేయకు కేబినెట్ హోదా లభించే అవకాశముందన్న వార్తలు ఢిల్లీ వర్గాల్లో వినిపిస్తున్నాయి. వీరిలో వెంకయ్యనాయుడుకు వ్యవసాయ శాఖ కేటాయించారని తెలుస్తోంది. ఎన్‌డీఏ మిత్రపక్షమైన టీడీపీ ఎంపీ అశోక్ గజపతి రాజుకు బెర్త్ ఖరారైంది. కాగా, కేంద్ర మంత్రివర్గ కూర్పుపై నరేంద్రమోడీ, బీజేపీ అధ్యక్షుడు రాజ్‌నాథ్‌సింగ్, ఆరెస్సెస్, బీజేపీ సీనియర్ నేతల కసరత్తు ఆదివారం కూడా కొనసాగింది. అయితే, మంత్రివర్గంలో ఎవరుండబోతున్నారన్న విషయాన్ని వారు అత్యంత రహస్యంగా ఉంచుతున్నారు. మంత్రివర్గ సభ్యుల జాబితాను సోమవారం ఉదయం రాష్ట్రపతి భవన్ అధికారులకు అందించే అవకాశముంది. ప్రభుత్వంలో టీమ్ మోడీలో ఎవరుంటారనే విషయంలో పార్టీ వర్గాలు గోప్యత పాటిస్తున్నప్పటికీ.. పార్టీలోని పలువురు సీనియర్లకు బెర్త్‌లు ఖాయమనే వార్త పార్టీ వర్గాల్లో వినిపిస్తోంది. వారి మంత్రిత్వ శాఖలు కూడా నిర్ణయమైపోయాయని అంటున్నారు. వారిలో రాజ్‌నాథ్ సింగ్‌కు హోం శాఖ, అరుణ్ జైట్లీకి ఆర్థిక శాఖ, సుష్మాస్వరాజ్‌కు రక్షణ, లేదా విదేశాంగ శాఖను ఖాయం చేసినట్లు సమాచారం. మరో సీనియర్ నేత అరుణ్ శౌరీకి మొదట్లో విదేశాంగ శాఖ ఇస్తారన్న ప్రచారం జరిగింది. అయితే, ఇప్పుడు శౌరీని ప్రభుత్వ సలహాదారుగా కానీ, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడిగా కానీ నియమించే అవకాశముందని తెలుస్తోంది.
మానవ వనరుల అభివృద్ధిశాఖను మురళీమనోహర్ జోషీకి ఇవ్వనున్నట్టు సమాచారం. హన్స్‌రాజ్ అహిర్‌కు బొగ్గుశాఖ, నితిన్ గడ్కరీకి రవాణా శాఖ దక్కనున్నట్టు తెలుస్తోంది. ఇప్పటి వరకు వేర్వేరుగా ఉన్న రైల్వే, విమానయాన, షిప్పింగ్ శాఖలను రవాణా మంత్రిత్వశాఖలో అనుసంధానం చేసినట్టు సమాచారం. రవిశంకర్ ప్రసాద్‌కు న్యాయశాఖ, అధికార ప్రతినిధి పీయుష్ గోయల్‌కు వాణిజ్యం, స్మృతి ఇరానీకి సమాచార, ప్రసార శాఖ కేటాయించి నట్టు పార్టీ వర్గాల అనధికార సమాచారం. సుమిత్రా మహా జన్ లేదా కరియా ముండాకు లోక్‌సభ స్పీకర్ వదవి వరించనుంది. ఇంకా కేబినెట్‌లో అరుణ్‌శౌరి, అనంతకుమార్, కల్రాజ్‌మిశ్రా, వీకే సింగ్, సంతోష్ గాంగ్‌వార్, మేనకా గాంధీ, ఉమాభారతి, డాక్టర్ హర్షవర్ధన్, మనోజ్ సిన్హా, రాంవిలాస్ పాశ్వాన్, గోపినాథ్‌ముండే, ఉపేంద్ర కుశ్వాహా, దిలీప్‌గాంధీ, ఫగ్గన్ సింగ్, కులస్తే, థావర్‌చంద్ గెహ్లాట్, అనురాగ్‌ఠాకుర్, పి.రాధాకృష్ణన్, ముక్తార్ అబ్బాస్ నక్వీ, శాంతాకుమార్, రాజీ వ్ ప్రతాప్ రూడీ, షానవాజ్ హుస్సేన్‌లకు చోటు దక్కనుంది. అయితే, మోడీ మంత్రివర్గంలో పార్టీ అగ్రనేత ఎల్‌కే అద్వానీకి చోటు కల్పించడం లేదని పార్టీ వర్గాలు తెలిపాయి.
మెరుగైన పాలన కోసం..
మెరుగైన పాలన కోసం ప్రభుత్వ వ్యవస్థలో కీలక మార్పులకు మోడీ సిద్ధమయ్యారు. చిన్న ప్రభుత్వంతో నాణ్యమైన పాలన అందించేలా చర్యలు తీసుకోవాలనుకుంటున్నారు. పరస్పర సంబంధం ఉన్న వివిధ మంత్రిత్వ శాఖలు, విభాగాలను విలీనం చేసి ఒకే కేబినెట్ మంత్రికి వాటి బాధ్యతలు అప్పగించే విధంగా ప్రభుత్వంలో మార్పులకు మోడీ ప్రయత్నిస్తున్నారని శనివారం రాత్రి మోడీ సెక్రటేరియట్ ప్రకటన విడుదల చేసింది. ప్రభుత్వంలోని పై స్థాయిల్లో సూక్ష్మ వ్యవస్థ, కింది స్థాయిల్లో విస్తృత వ్యవస్థ ఉండాలని మోడీ కోరుకుంటున్నారని అందులో పేర్కొన్నారు.