గుజరాత్ సీఎంగా ఆనందీబెన్
తొలి మహిళా ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం
- 20 మందితో మంత్రివర్గం, నాలుగు కొత్త ముఖాలు
- కార్యక్రమానికి హాజరైన మోడీ, బీజేపీ అగ్రనేతలు
గాంధీనగర్: గుజరాత్ తొలి మహిళా సీఎంగా ఆనందీబెన్ పటేల్ గురువారం ప్రమాణ స్వీకారం చేశారు. ఆమెతో పాటు ఆరుగురు కేబినెట్ మంత్రులు, 14 మంది సహాయ మంత్రులు కూడా ప్రమాణం చేశారు. గవర్నర్ కమలా బేణీవాల్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి బీజేపీ అగ్రనేతలంతా హాజరయ్యారు. ఎల్‌కే అద్వానీ, రాజ్‌నాథ్‌సింగ్, మురళీమనోహర్ జోషి, సుష్మా స్వరాజ్, వెంకయ్యనాయుడు, నితిన్ గడ్కరీ, బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులతో పాటు కాబోయే ప్రధాని నరేంద్ర మోడీ కూడా పాల్గొన్నారు. వరుసగా 12 ఏళ్లు గుజరాత్ సీఎంగా ఉన్న మోడీ.. ప్రధాని కాబోతున్న నేపథ్యంలో తన పదవికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే.
ఆయన స్థానంలో గుజరాత్ బీజేపీ శాసనసభాపక్ష నేతగా మోడీకి సన్నిహితురాలు, ఆయన మంత్రివర్గంలో రెవెన్యూ మంత్రిగా పనిచేసిన ఆనందీబెన్ బుధవారం ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. 73 ఏళ్ల ఆనందీబెన్ గతంలో ఉపాధ్యాయురాలిగా పని చేశారు. ఆ తర్వాత రాజకీయాల్లోకి ప్రవేశించి మోడీ కేబినెట్‌లో సుదీర్ఘకాలం మంత్రిగా కొనసాగారు. తాజాగా ముఖ్యమంత్రి పదవి చేపట్టారు.
బీజేపీ తనకు సీఎంగా అవకాశమివ్వడం వల్ల గుజరాత్‌లోని ప్రతి మహిళ కూడా తమను తాము సీఎంగా భావించుకుంటున్నారని ప్రమాణ స్వీకారం అనంతరం ఆనందీబెన్ మీడియాతో వ్యాఖ్యానించారు. ప్రజలకు సేవ చేసే అవకాశం తనకు దక్కిందని, సీఎంగా అన్ని బాధ్యతలను సక్రమంగా నిర్వర్తిస్తానని ఆమె తెలిపారు. ఆనందీబెన్ కూతురు అనార్, భర్త మఫత్‌లాల్ కూడా మీడియాతో మాట్లాడుతూ తమకు గర్వంగా ఉందని చెప్పారు. కాగా, మోడీ హయాంలో సహాయ మంత్రులుగా ఉన్న ముగ్గురికి ఈసారి అవకాశమివ్వలేదు.