anandiben
-
'బెన్ రాజీనామా అందింది'
-
బెన్ రాజీనామా అందింది: అమిత్ షా
అహ్మదాబాద్ : గుజరాత్ ముఖ్యమంత్రి ఆనంది బెన్ రాజీనామా లేఖ అందినట్లు బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా తెలిపారు. బెన్ రాజీనామాపై పార్టీ పార్లమెంటరీ బోర్డు సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని ఆయన సోమవారమిక్కడ తెలిపారు. కాగా ఆనంది బెన్ తన పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. 75 ఏళ్ళ వయసు నిండినవారు పదివిలో కొనసాగకూడదన్న విషయంపై తానీ నిర్ణయం తీసుకున్నట్లు ఆమె ఫేస్ బుక్ ద్వారా ప్రకటించారు. తనకు నిర్ణీత వయసు దాటిన వెంటనే బాధ్యతలనుంచీ తప్పించాల్సిందిగా పార్టీని కోరినట్లు ఆమె వెల్లడించారు. తనపై పార్టీ ఎంతో నమ్మకం ఉంచి.. బాధ్యతలను అప్పగించినందుకు ఎంతో కృతజ్ఞురాలినన్నారు. డెబ్బయ్ అయిదేళ్లు నిండిన వారు పదవిలో కొనసాగకూడదన్న పార్టీ నిర్ణయాన్ని తాను శిరసా వహిస్తున్నానని, అందుకే పదవినుంచీ తప్పుకొనేందుకు అంగీకరించమంటూ రాజీనామా పత్రాన్ని పార్టీకి అందించినట్లు ఆమె తెలిపారు. ఆనంది బెన్ పటేల్ తన రాజీనామా లేఖను రాష్ట్ర బిజేపీ ప్రెసిడెంట్ విజయ్ రూపానీకి అందించానని, వారు అందుకు అంగీకరించినట్లు ఆమె తెలిపారు. నరేంద్రమోదీ ప్రధాని బాధ్యతలు స్వీకరించిన అనంతరం.. గుజరాత్ మొదటి మహిళా సీఎంగా తాను బాధ్యతలు స్వీకరించినట్లు ఆనంది బెన్ పటేల్ తాను గుజరాతీలో రాసిన పోస్ట్ లో వివరించారు. -
గుజరాత్ సీఎం కోసం రూ.100 కోట్లతో జెట్ విమానం!
గాంధీనగర్: గుజరాత్ ముఖ్యమంత్రి ఆనందీబెన్ పటేల్ కోసం ఆ రాష్ట్ర ప్రభుత్వం రూ.100 కోట్లతో కొత్త జెట్ విమానాన్ని కొనుగోలు చేయనుంది. ప్రస్తుతం గుజరాత్ సీఎం కోసం 9 సీట్ల ‘సూపర్ కింగ్ ఎయిర్ బీచ్‌క్రాఫ్ట్ 200’ను ఉపయోగిస్తున్నారు. అయితే దాని 15 ఏళ్ల జీవితకాలం వచ్చే డిసెంబరుతో ముగియనున్న నేపథ్యంలో కొత్త విమానాన్ని కొనుగోలు చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది. కొత్తగా 12-15 సీట్ల సామర్థ్యం, ఆధునిక సాంకేతికతలు, ప్రమాణాలు ఉన్న విమానాన్ని కొనుగోలు చేయాలని అత్యున్నతస్థాయి సాంకేతిక కమిటీ సిఫారసు చేసింది. జెట్ కొనుగోలు కోసం గ్లోబల్ టెండర్లను ఆహ్వానిస్తూ గుజరాత్ సర్కారు త్వరలో ప్రకటనలు ఇవ్వనుంది. కాగా, బీచ్క్రాఫ్ట్ను 1999లో అప్పటి సీఎం కేశూభాయ్ పటేల్ హయాంలో రూ.19.12 కోట్లకు కొనుగోలు చేశారు. అప్పట్లో ఆ విమానం కొనుగోలుకు అనుసరించిన విధానాన్ని కాగ్, ప్రజాపద్దుల సంఘం తీవ్రంగా తప్పుపట్టాయి. -
అధికార పీఠంపై ఐరన్ లేడీ
ఆనందీబెన్... గుజరాత్ మొట్టమొదటి మహిళా ముఖ్యమంత్రి. నరేంద్రమోడీకి అత్యంత సన్నిహితురాలు. ఆ రాష్ట్ర ప్రజలు ఆమెను ‘ఐరన్ లేడీ’ అని పిలుస్తారు. బాల్యం నుంచి ఎన్నో అవార్డులందుకున్న ఘనత ఆమెది. ఆనందీబెన్‌కు రంగురంగుల చీరలంటే చాలా ఇష్టం. నుదుటి మీద ఎర్రటి బొట్టుతో హుందాగా కనిపించే ఆమెను చూస్తే ఎవరూ ఏడు పదులు నిండిన వ్యక్తి అనుకోరు. సామాన్య ప్రజానీకాన్ని ఆకర్షించే చరిష్మా ఆమెలో లేదంటారు కొందరు. కొద్దిగా పెడసరంగా ఉంటారని చెవులు కొరుక్కొనేవారూ లేకపోలేదు. ప్రభుత్వం తరపున గుజరాత్ రాష్ర్ట అభివృద్ధికి కృషి చేశారనే విషయాన్ని మాత్రం అందరూ అంగీకరిస్తారు. పటేల్ కుటుంబాలలో అందరికీ సహజంగా ఉండే సహనగుణం, పట్టిన పట్టు వదలని దృఢచిత్తం ఆనందీబెన్లో పుష్కలంగా ఉంది. మూడు దశాబ్దాల పాటు ఉపాధ్యాయ వృత్తిలో ఉన్న ఆనందీబెన్ పార్టీలో చేరిన నాలుగు సంవత్సరాలకు బిజెపి తర ఫున గుజరాత్ శాసనసభకు ఎన్నికయ్యారు. మోడీ గుజరాత్ బిజెపి ప్రధాన కార్యదర్శిగా ఉన్నప్పుడు, ఆమె రాజ్యసభ సభ్యులయ్యారు. విద్య, స్త్రీ -శిశు సంక్షేమ శాఖల మంత్రిగా పనిచేశారు. మోడీ ఆధ్వర్యంలో ఆమె బాధ్యతలు రెట్టింపయ్యాయి. ఇప్పుడు ముఖ్యమంత్రి అయ్యేవరకూ, వివిధ శాఖలలో పనిచేసి సత్తా చాటారు. ఆర్థిక, రోడ్లు - భవనాలు, ఉపద్రవాల నివారణ, పట్టణాభివృద్ధి శాఖ వంటి పలు శాఖలలో పనిచేశారు. ఏదైనా పని మోడీ ద్వారా జరగాలంటే, ఆనందీబెన్‌ను అడిగేవారంటే... ఆమె ఎంతటి ప్రాముఖ్యం సంతరించుకున్నారో అర్థం చేసుకోవచ్చు. పదహారు సంవత్సరాలు నిరంతరాయంగా మంత్రిగా చేసిన అనుభవం ఆమెది. బాల్యం నుంచి ఆనందీబెన్ పురుషాధిపత్యానికి వ్యతిరేకం. ఆమె పాఠశాలలో చేరినప్పుడు ఆ క్లాసులో ఆమె ఒక్కతే ఆడపిల్ల. 1960లో కాలేజీలో చేరినప్పుడు కూడా ఆమె ఒక్కతే మహిళా విద్యార్థి. మోడీ సూచనల మేరకు ఆమె జిల్లాలలో విస్తృతంగా పర్యటించి, కలెక్టర్లను కలిసి స్థానిక సమస్యల గురించి తెలుసుకున్నారు. ఎన్నో సమస్యలను పరిష్కరించారు. ఇప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రిగా కూడా ఆమె మునుపటిలానే... భ్రూణ హత్యలు, స్త్రీ విద్య, రైతుల కష్టనష్టాల లాంటి కీలక అంశాలపై దృష్టి సారిస్తారని గుజరాతీయుల ఆశ. మునుపటి ప్రభుత్వంలాగానే, తాను కూడా రాష్ట్రంలో పెట్టుబడులకు, ఆర్థిక పురోగతికీ అనుకూలమనే ముద్రను వేసుకుంటూ, ఆరు కోట్ల జనాభా ఉన్న గుజరాత్‌కు... త్వరితగతిన పురోగమిస్తున్న రాష్ట్రమనే కీర్తికిరీటాన్ని నిలుపుతారని గుజరాతీయులు ఆశిస్తున్నారు. నరేంద్రమోడీకి కుడి భుజం మాత్రమే కాదు ఎడమ భుజం కూడా ఆమే అంటారు స్కూల్ టీచర్‌గా పని చేస్తున్నప్పుడు, సర్దార్ సరోవర్‌లో దూకి ఇద్దరు అమ్మాయిలను కాపాడారు ఆనందికి నవ్వడం తెలియదని చాలామంది అంటుంటే అందుకు ఆమె ‘ఒకరు పనిచేస్తున్నారా లేదా అన్నది వారి ముఖంలో ఉండే చిరునవ్వుని బట్టి కాదు, వారు చేసే పనిని బట్టి గుర్తించాలి’ అంటారు. స్త్రీ సంక్షేమం కోసం మహిళా వికాస్ గృహ్‌లో చేరి, సుమారు 50 మంది వితంతువులకు వృత్తి విద్య నేర్పారు విద్యామంత్రిగా ఉన్న రోజుల్లో టీచర్ల బదిలీలలో లంచాన్ని పూర్తిగా నిరోధించారు. వికలాంగుల కోసం ప్రత్యేక పాఠశాలలు ఏర్పాటుచేశారు. -
గుజరాత్ సీఎంగా ఆనందీబెన్
తొలి మహిళా ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం - 20 మందితో మంత్రివర్గం, నాలుగు కొత్త ముఖాలు - కార్యక్రమానికి హాజరైన మోడీ, బీజేపీ అగ్రనేతలు గాంధీనగర్: గుజరాత్ తొలి మహిళా సీఎంగా ఆనందీబెన్ పటేల్ గురువారం ప్రమాణ స్వీకారం చేశారు. ఆమెతో పాటు ఆరుగురు కేబినెట్ మంత్రులు, 14 మంది సహాయ మంత్రులు కూడా ప్రమాణం చేశారు. గవర్నర్ కమలా బేణీవాల్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి బీజేపీ అగ్రనేతలంతా హాజరయ్యారు. ఎల్కే అద్వానీ, రాజ్‌నాథ్‌సింగ్, మురళీమనోహర్ జోషి, సుష్మా స్వరాజ్, వెంకయ్యనాయుడు, నితిన్ గడ్కరీ, బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులతో పాటు కాబోయే ప్రధాని నరేంద్ర మోడీ కూడా పాల్గొన్నారు. వరుసగా 12 ఏళ్లు గుజరాత్ సీఎంగా ఉన్న మోడీ.. ప్రధాని కాబోతున్న నేపథ్యంలో తన పదవికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఆయన స్థానంలో గుజరాత్ బీజేపీ శాసనసభాపక్ష నేతగా మోడీకి సన్నిహితురాలు, ఆయన మంత్రివర్గంలో రెవెన్యూ మంత్రిగా పనిచేసిన ఆనందీబెన్ బుధవారం ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. 73 ఏళ్ల ఆనందీబెన్ గతంలో ఉపాధ్యాయురాలిగా పని చేశారు. ఆ తర్వాత రాజకీయాల్లోకి ప్రవేశించి మోడీ కేబినెట్లో సుదీర్ఘకాలం మంత్రిగా కొనసాగారు. తాజాగా ముఖ్యమంత్రి పదవి చేపట్టారు. బీజేపీ తనకు సీఎంగా అవకాశమివ్వడం వల్ల గుజరాత్‌లోని ప్రతి మహిళ కూడా తమను తాము సీఎంగా భావించుకుంటున్నారని ప్రమాణ స్వీకారం అనంతరం ఆనందీబెన్ మీడియాతో వ్యాఖ్యానించారు. ప్రజలకు సేవ చేసే అవకాశం తనకు దక్కిందని, సీఎంగా అన్ని బాధ్యతలను సక్రమంగా నిర్వర్తిస్తానని ఆమె తెలిపారు. ఆనందీబెన్ కూతురు అనార్, భర్త మఫత్‌లాల్ కూడా మీడియాతో మాట్లాడుతూ తమకు గర్వంగా ఉందని చెప్పారు. కాగా, మోడీ హయాంలో సహాయ మంత్రులుగా ఉన్న ముగ్గురికి ఈసారి అవకాశమివ్వలేదు. -
గుజరాత్‌కు తొలి మహిళా సీఎంగా ప్రమాణం
-
గుజరాత్‌కు తొలి మహిళా సీఎంగా ప్రమాణం
అహ్మదాబాద్ : గుజరాత్ కొత్త ముఖ్యమంత్రిగా ఆనందిబెన్ గురువారం ప్రమాణ స్వీకారం చేశారు. నరేంద్ర మోడీ సమక్షంలో ఆమె గుజరాత్ రాష్ట్ర తొలి మహిళా ముఖ్యమంత్రిగా ప్రమాణం చేశారు. గుజరాత్ గవర్నర్ కమలా బేనీవాలా ఈరోజు మధ్యాహ్నం రాజ్‌భవన్‌లో ఆనందీ బెన్‌తో ప్రమాణస్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి బీజేపీ అగ్రనేతలు అద్వానీ, రాజ్‌నాథ్, గడ్కరీతో పాటు పలువురు హాజరయ్యారు. సామాజిక కార్యక్రమాలలో పాల్గొనడంతోపాటు ఆమె అనేక సహసోపేతమైన పనులు చేశారు. దాంతో ఆమెకు గుజరాత్ ఉక్కు మహిళగా పేరొచ్చింది. మోడీ ప్రధాన మంత్రి అయితే కేబినెట్లో సీనియర్ మంత్రి అయిన ఆనంది బెన్ ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉందని ముందు నుంచి ప్రచారం జరుగుతోంది. ఆనంది బెన్ గతంలో విద్యా, రెవెన్యూ, మహిళా, శిశు సంక్షేమ తదితర కీలక శాఖలను సమర్థవంతంగా నిర్వహించారు. ఆమె గుజరాత్ మెహసాన జిల్లాలోని ఓ కుగ్రామంలో రైతు కుటుంబంలో 1941లో జన్మించారు. 1965లో భర్త మఫత్ లాల్ పటేల్‌తో కలిసి అహ్మదాబాద్‌లో స్థిరపడిన ఆమె అంచెలంచెలుగా ఎదిగారు. ఎంఎస్సి,బిఇడి చదివి, టీచరుగా పనిచేస్తూ మోడీ ప్రోత్సాహంతో ఆనంది బెన్ రాజకీయాల్లో వచ్చారు. బిజేపీ మహిళా మోర్చా అధ్యక్షురాలిగా పని చేశారు. 1994లో రాజ్యసభ వెళ్లారు. 1994 నుంచి ఎమ్మెల్యేగా ఎంపికవుతూ వచ్చారు. గుజరాత్లో నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందిన మహిళా నేత ఆనంది బెన్ ఒక్కరే.