గుజరాత్ సీఎం కోసం రూ.100 కోట్లతో జెట్ విమానం!
గాంధీనగర్: గుజరాత్ ముఖ్యమంత్రి ఆనందీబెన్ పటేల్ కోసం ఆ రాష్ట్ర ప్రభుత్వం రూ.100 కోట్లతో కొత్త జెట్ విమానాన్ని కొనుగోలు చేయనుంది. ప్రస్తుతం గుజరాత్ సీఎం కోసం 9 సీట్ల ‘సూపర్ కింగ్ ఎయిర్ బీచ్‌క్రాఫ్ట్ 200’ను ఉపయోగిస్తున్నారు. అయితే దాని 15 ఏళ్ల జీవితకాలం వచ్చే డిసెంబరుతో ముగియనున్న నేపథ్యంలో కొత్త విమానాన్ని కొనుగోలు చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది. కొత్తగా 12-15 సీట్ల సామర్థ్యం, ఆధునిక సాంకేతికతలు, ప్రమాణాలు ఉన్న విమానాన్ని కొనుగోలు చేయాలని అత్యున్నతస్థాయి సాంకేతిక కమిటీ సిఫారసు చేసింది.
జెట్ కొనుగోలు కోసం గ్లోబల్ టెండర్లను ఆహ్వానిస్తూ గుజరాత్ సర్కారు త్వరలో ప్రకటనలు ఇవ్వనుంది. కాగా, బీచ్‌క్రాఫ్ట్‌ను 1999లో అప్పటి సీఎం కేశూభాయ్ పటేల్ హయాంలో రూ.19.12 కోట్లకు కొనుగోలు చేశారు. అప్పట్లో ఆ విమానం కొనుగోలుకు అనుసరించిన విధానాన్ని కాగ్, ప్రజాపద్దుల సంఘం తీవ్రంగా తప్పుపట్టాయి.