jet plane
-
దడ పుట్టించిన చేజింగ్
వాషింగ్టన్: అమెరికా రాజధాని వాషింగ్టన్లో ఓ చిన్న విమానాన్ని జెట్ విమానం వెంబడించడం కలకలం రేపింది. అసాధారణ వేగంతో ప్రయాణిస్తూ యుద్ధ విమానం నుంచి వెలువడిన సోనిక్ శబ్ధం వాషింగ్టన్ వాసుల గుండెల్లో దడ పుట్టించింది. ఆదివారం మధ్యాహ్నం ఈ ఘటన చోటుచేసుకుంది. ఏవియేషన్ విభాగం సమాచారం ప్రకారం.. ఆ సెస్నాసైటేషన్ విమానం టెన్నెస్సీలోని ఎలిజెబెత్టన్ నుంచి బయలుదేరింది. లాంగ్ ఐల్యాండ్‌లోని మెక్ ఆర్థర్ ఎయిర్‌పోర్టుకు చేరుకోవాల్సి ఉంది. అయితే అనూహ్యంగా, న్యూయార్క్‌లోని లాంగ్ ఐలాండ్ మీదుగా, సరాసరి వాషింగ్టన్ డీసీ వైపుగా వచ్చింది. దేశ రాజధానిలోని అత్యంత భద్రత కలిగిన నిషిద్ధ ప్రాంతాల మీదుగా అది వెళ్లడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. రేడియో సిగ్నళ్లకు పైలట్ స్పందించకపోవడంతో వెంటనే ఎఫ్–16 జెట్ విమానాన్ని పంపారు. అది సోనిక్ శబ్ధంతో ప్రయాణిస్తూ దూసుకెళ్లింది. ఆ శబ్దం వాషింగ్టన్‌తోపాటు, మేరీల్యాండ్, వర్జీనియాలోని కొన్ని ప్రాంతాల వారికి సైతం వినిపించింది. సదరు విమానం పైలట్ దృష్టిలో పడేందుకు ఫైటర్ జెట్ ఎఫ్–16 విమానం మంటలను సైతం వదులుతూ వెళ్లింది. భూమిపైని వారి భద్రతను, సదరు విమానం భద్రతను దృష్టిలో ఉంచుకునే ఈ మేరకు చర్యలు తీసుకున్నామని అధికారులు తెలిపారు. మధ్యాహ్నం 3.30 గంటల సమయంలో వర్జీనియాలోని మౌంట్ మొంటెబెల్లోకు సమీపంలోని పర్వత ప్రాంతంలో చివరికి చిన్న విమానం కుప్పకూలింది. విమానం మండిపోయిందని, అందులో వారెవరూ ప్రాణాలతో బయటపడలేదని అధికారులు తెలిపారు. చివరి క్షణంలో అది నిమిషానికి 30 వేల అడుగుల చొప్పున వేగంగా నేలవైపుగా దూసుకొచ్చిందని ఫ్లైట్ ట్రాకింగ్ రికార్డులు చెబుతున్నాయి. పర్వత ప్రాంతంలో విమానం కూలిన చోటుకు కాలినడకన చేరుకునేందుకు పోలీసులకు దాదాపు నాలుగు గంటలు పట్టింది. ఫ్లోరిడాకు చెందిన ఎన్కోర్ మోటార్స్ పేరిట ఆ విమానం రిజిస్టరై ఉంది. ఈ కంపెనీ నిర్వాహకుడు జాన్ రంపెల్ మాట్లాడుతూ..ఆ విమానంలో పైలట్‌తోపాటు తన కూతురు, రెండేళ్ల మనవరాలు, ఆయా ఉన్నారన్నారు. వీరు నార్త్ కరోలినా నుంచి ఈస్ట్ హాంప్టన్‌కు వస్తున్నారన్నారు. విమానంలో సాంకేతిక లోపం ఉన్నట్లు తనకు తెలియదన్నారు. ఈ ఘటనపై దర్యాప్తు జరుగుతోంది. ఇది 1999 నాటి ఘటనను గుర్తుకు తెచ్చింది. అప్పట్లో లీయర్జెట్ విమానం సాంకేతిక లోపం తలెత్తి అడ్డదిడ్డంగా తిరుగుతూ సౌత్ డకోటా ప్రాంతంలో కూలిపోయింది. అందులోని ఆరుగురూ చనిపోయారు. -
షాకింగ్ ఘటన: విమాన చక్రంలో మనిషి మృతదేహం
గాంబియా నుంచి బ్రిటన్‌కు వెళ్లిన జెట్ విమానంలో ఒక షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. విమానం వీల్ బేలో చనిపోయిన వ్యక్తి మృతదేహాన్ని కనుగొన్నారు. టీయూఐ ఎయిర్వేస్ నడుపుతున్న జెట్ విమానంలో గుర్తు తెలియని ఒక నల్లజాతీయుడు మృతదేహాన్ని అధికారులు గుర్తించారు. డిసెంబర్5, 2022న గాంబియా రాజధాని బంజుల్ నుంచి లండన్‌లోని గాట్విక్ మిమానాశ్రయానికి విమానం బయలుదేరింది. సరిగ్గా ఎయిర్‌పోర్ట్‌లో ల్యాండ్ అయినప్పుడే ఈ దిగ్బ్రాంతికర ఘటనను గుర్తించారు అధికారులు. ఈ మేరకు బ్రిటన్ మెట్రో పోలీసులు గాంబియా ప్రభుత్వానికి ఈ సమాచారం అందించారు. ఎలాంటి గుర్తింపు పత్రాలు లేకుండా ఒక అపరిచిత వ్యక్తి విమానం వీల్ బేలో మృతి చెంది ఉన్నట్లు తెలిపారు. ఈ మృతదేహాన్ని విమానం నుంచి తొలగించి వర్థింగ్ ఆస్పత్రికి తరలించినట్లు తెలిపారు. గాంబియన్ అధికారులు బ్రిటన్ పోలీసులకు సహకరించడమే కాకుండా మృతదేహానికి డీఎన్ఏ పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఈ మేరకు యూకే పోలీసులు ఈ ఘటనపై దర్యాప్తు ప్రారంభించారు. ఇలాంటి ఘటనలు మొదటిసారి కాదు. 2019లో ఆమ్స్టర్డామ్లోని పోలీసులు కెన్యా నుండి వచ్చిన కార్గో విమానం ముక్కు చక్రంలో ఒక వ్యక్తి అక్రమంగా ప్రవేశించి మరణించాడు. (చదవండి: కారుతో ఢీకొట్టి చంపినందుకు.. రూ 90 లక్షలు జరిమానా) -
అది ఎయిర్‌ఫోర్స్ మిస్సైల్ శకలం
విడవలూరు: శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా పెదపాళెం తీరంలో శనివారం బయటపడింది జెట్ విమాన శకలం కాదని, ఎయిర్‌ఫోర్స్ మిస్సైల్ అని మెరైన్ అధికారులు నిర్థారించారు. ఇస్కపల్లి మెరైన్ సీఐ పెంచలరెడ్డి, ఎస్ఐలు రసూల్ సాహెబ్, మహేంద్రలు ఆదివారం శకలాలను పరిశీలించారు. సీఐ పెంచలరెడ్డి మాట్లాడుతూ..‘ఇది గుంటూరు జిల్లా సూర్యలంక తీరం నుంచి గతంలో ఎయిర్‌ఫోర్స్ అధికారులు ప్రయోగించిన మిస్సైల్’ అని చెప్పారు. దీన్ని సముద్రంపై ఎంత ఎత్తులో గాలి ఉంటుందో తెలుసుకునేందుకు ఉపయోగిస్తారని తెలిపారు. ఇలాంటివి 3 ప్రయోగించగా, ఇప్పటికి 2 లభించాయని, తాజాగా విడవలూరు మండల తీర ప్రాంతంలో మరొకటి లభించిందన్నారు. దీన్ని ఇస్కపల్లి మెరైన్ పోలీస్‌స్టేషన్‌కు తరలించి మెరైన్ అధికారులకు సమాచారమిచ్చామని, త్వరలోనే వారు దీనిని తీసుకువెళతారని చెప్పారు. -
ఇక ప్రైవేట్ జెట్లు...!
సంపన్న భారతీయులు, కంపెనీలు ఇక ’ప్రైవేట్ విమానాలు’ సొంతం చేసుకునే అవకాశం కలగబోతోంది. అదీకూడా ఈ విమానాల నిర్వహణ, వాటి మరమ్మతుల బాధ్యత లేకుండానే... ప్రైవేట్ జెట్లకు యజమానిగా ఒకరుంటే వాటిని మరొకరు ఆపరేటర్ రూపంలో నిర్వహించే వీలు కల్పించే ప్రతిపాదనకు దేశీయ విమానయానశాఖ తుదిరూపునిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ ప్రతిపాదనలు అమల్లోకి వస్తే ఓ కంపెనీ లేదా ప్రైవేట్‌వ్యక్తి విమానాన్ని కొనుగోలు చేసి దాని నిర్వహణ బాధ్యతలను మరో ఎయిర్‌క్రాఫ్ట్ మేనేజ్మెంట్ కంపెనీకి అప్పగించవచ్చు. ఈ రెండుకంపెనీలు, వ్యక్తుల మధ్య కుదిరిన ఒప్పందం మేరకు విమానాల నిర్వహణ, ఆదాయ,వ్యయాలు ఏ మేరకు భరించాలన్నది ఖరారు చేస్తారు. ప్రస్తుతమున్న నియమ,నిబంధనల ›ప్రకారమైతే ఓ ప్రైవేట్ వ్యాపారవేత్త విమానాన్ని ఆపరేట్ చేయాలంటే ప్రభుత్వపరంగా ఉన్న నియంత్రణలు పాటించాల్సిన అవసరముంది. ఈ విమానాలను నడిపేందుకు అవసరమైన ఫ్లయిట్ సెఫిటీ ఇన్చార్జీ మొదలుకుని ఇతర విమాన సిబ్బంది నియామకం వరకు అన్నీ నిబంధనలను పాటించాల్సి ఉంటుంది. ఇలాంటి విమానాలను ప్రైవేట్ కంపెనీలు నడపడానికి ’నాన్ షెడ్యూల్డ్ ఆపరేటర్’ కేటగిరి కింద విడిగా రిజిష్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. మనదేశంలో ఎయిర్‌క్రాఫ్ట్ మేనేజ్మెంట్ కంపెనీలు లేని కారణంగా తమ విమానాల నిర్వహణకు నాన్ షెడ్యూల్్డ ఆపరేటర్ కంపెనీలపై ప్రైవేట్ యజమానులు ఆధారపడాల్సి వస్తోంది. ప్రస్తుతం అమెరికా, ఐరోపాలలో ప్రైవేట్ జెట్ల నిర్వహణకు అనుసరిస్తున్న పద్ధతినే మనదేశంలోనూ అమలు చేసే ఆలోచనలో కేంద్ర ప్రభుత్వం ఉన్నట్టు సమాచారం. ఈ తరహా పద్ధతిని ఇక్కడ అమలు చేసేందుకు చేపట్టాల్సిన చర్యలపై ఆర్థికశాఖతో పాటు కేంద్ర విమానయానశాఖ అధికారులు దృష్టి పెట్టినట్టు తెలుస్తోంది. ప్రైవేట్ విమానాల నిర్వహణ వ్యయం తలకు మించిన భారంగా మారిన కారణంగా వ్యాపారవేత్తలు వెనకడుగు వేస్తున్నారని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. తాము విమానం కొనుగోలు చేశాక దాని బాధ్యతలు చూసేందుకు విడిగా ఎయిర్‌క్రాఫ్ట్ మేనేజ్మెంట్ కంపెనీ ఉంటే చాలా మంది వ్యాపారవేత్తలు ముందుకు వస్తారని పేర్కొన్నాయి. ’భారత్‌లో ఎయిర్‌క్రాఫ్ట్ మేనేజ్మెంట్ కంపెనీల ఆలోచన అనేది పెద్దగా పుంజుకోలేదు. ఓ ప్రైవేట్ యజమాని విమానాన్ని కొనుగోలు చేసి విమానాల నిర్వహణ కంపెనీకి దానిని అప్పగించే పద్ధతి ఇక్కడా అమల్లోకి వస్తే మాత్రం ప్రస్తుతమున్న పరిస్థితిలో మార్పు వస్తుంది. ఈ కంపెనీలు విమానాలు నడిపేందుకు అవసరమైన అన్ని బాధ్యతలు తీసుకోవడం వల్ల యజమానులకు సమస్య ఉండదు’ అని బిజినెస్ ఎవియేషన్ ఆపరేటర్ అసోసియేషన్ ఎండీ ఆర్కే బాలి చెబుతున్నారు. జీఎస్టీ తగ్గించాలి... ప్రస్తుతం విమానాన్ని దిగుమతి చేసుకునే వ్యాపారవేత్తలు కస్టమ్‌్స సుంకాలతో పాటు 28 శాతం వస్తు,సేవా పన్ను (జీఎస్టీ) చెల్లించాలి. నాన్ షెడ్యూల్్డ ఆపరేటర్లు కస్టమ్‌్స పన్నులతో పాటు జీఎస్టీ కింద 18 శాతం పన్నులు చెల్లిస్తున్నారు. ప్రైవేట్ వ్యాపారవేత్తలకు కూడా జీఎస్టీ పన్నును 18 శాతానికి తగ్గిస్తే మరింత మంది వ్యాపారవేత్తలు నేరుగా విమానాలు దిగుమతి చేసుకోవడానికి ముందుకు వస్తారని విశ్లేషకులు పేర్కొన్నారు. ఇది దేశీయ విమానయానరంగ వ్యాపారం పెరిగేందుకు దోహదపడుతుందని అంటున్నారు. -
గుజరాత్ సీఎం కోసం రూ.100 కోట్లతో జెట్ విమానం!
గాంధీనగర్: గుజరాత్ ముఖ్యమంత్రి ఆనందీబెన్ పటేల్ కోసం ఆ రాష్ట్ర ప్రభుత్వం రూ.100 కోట్లతో కొత్త జెట్ విమానాన్ని కొనుగోలు చేయనుంది. ప్రస్తుతం గుజరాత్ సీఎం కోసం 9 సీట్ల ‘సూపర్ కింగ్ ఎయిర్ బీచ్‌క్రాఫ్ట్ 200’ను ఉపయోగిస్తున్నారు. అయితే దాని 15 ఏళ్ల జీవితకాలం వచ్చే డిసెంబరుతో ముగియనున్న నేపథ్యంలో కొత్త విమానాన్ని కొనుగోలు చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది. కొత్తగా 12-15 సీట్ల సామర్థ్యం, ఆధునిక సాంకేతికతలు, ప్రమాణాలు ఉన్న విమానాన్ని కొనుగోలు చేయాలని అత్యున్నతస్థాయి సాంకేతిక కమిటీ సిఫారసు చేసింది. జెట్ కొనుగోలు కోసం గ్లోబల్ టెండర్లను ఆహ్వానిస్తూ గుజరాత్ సర్కారు త్వరలో ప్రకటనలు ఇవ్వనుంది. కాగా, బీచ్క్రాఫ్ట్ను 1999లో అప్పటి సీఎం కేశూభాయ్ పటేల్ హయాంలో రూ.19.12 కోట్లకు కొనుగోలు చేశారు. అప్పట్లో ఆ విమానం కొనుగోలుకు అనుసరించిన విధానాన్ని కాగ్, ప్రజాపద్దుల సంఘం తీవ్రంగా తప్పుపట్టాయి. -
ఆ విమానం హిందూమహాసముద్రంలోనే కూలిందా?
పది రోజులకు పైగా కనిపించకుండా పోయిన మలేషియన్ ఎయిర్‌లైన్స్ విమానం హిందూ మహాసముద్రంలో ఉందన్న తాజా వాదన ఒకటి తెరమీదకు వచ్చింది. 239 మందితో కౌలాలంపూర్ నుంచి బీజింగ్‌కు బయల్దేరిన ఈ విమానంలో ఐదుగురు భారతీయులు కూడా ఉన్న విషయం తెలిసిందే. వీరి క్షేమ సమాచారం ఏదీ ఇంతవరకు అందకపోవడంతో ప్రయాణికుల బంధుమిత్రులు తీవ్రంగా ఆందోళన చెందుతున్నారు. ఈనెల 8వ తేదీన బయల్దేరిన ఈ విమానం ఇప్పుడు బహుశా హిందూ మహా సముద్రంలో దక్షిణ దిశగా ఉండొచ్చని ఈ కేసు దర్యాప్తు చేస్తున్న మలేషియన్ అధికార వర్గాలు ఇప్పుడు భావిస్తున్నాయి. అది దక్షిణ దిశగానే వెళ్లిందని, ఇండోనేసియాకు దక్షిణ దిశ నుంచి ఆస్ట్రేలియాకు పశ్చిమదిశగా హిందూ మహాసముద్రంలో కూలిపోయి ఉండొచ్చని ఆ వర్గాలు చెబుతున్నాయి. ఒకవేళ ఆసియా వైపు వెళ్తే మాత్రం అత్యంత శక్తిమంతమైన భారత్, చైనా రాడార్ల దృష్టిని కన్నుగప్పి ప్రయాణం చేసే అవకాశం లేనే లేదని దర్యాప్తు అధికారులు గట్టిగా చెబుతున్నారు. చైనా సరిహద్దుల్లో అత్యంత శక్తిమంతమైన సైనిక రాడార్లున్నాయి. పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ ఆఫ్ చైనా ఆధీనంలో ఇవి పనిచేస్తాయి. అలాగే, భారత్-పాకిస్థాన్ మధ్య సరిహద్దు కూడా అత్యంత సున్నితమైనది కావడంతో అక్కడ సైతం సైనిక పర్యవేక్షణ చాలా పటిష్ఠంగా ఉంటుంది. ఇటువైపు నుంచి ఒక జెట్ విమానం వెళ్లడం, దాన్ని ఏ దేశం వాళ్లూ గుర్తించలేకపోవడం అనేది అసాధ్యమేనని ఇంటెలిజెన్స్ మాజీ అధికారి ఒకరు స్పష్టం చేశారు. పైపెచ్చు, విమానం నుంచి ఏ సిగ్నల్ వెళ్లినా.. దాన్ని కచ్చితంగా గుర్తించే పరిజ్ఞానం ఉందని, అందువల్ల అది హిందూ మహాసముద్రంలో కూలిపోయే ఉండొచ్చని ఆయన అభిప్రాయపడ్డారు.