
బెన్ రాజీనామా అందింది: అమిత్ షా
అహ్మదాబాద్ : గుజరాత్ ముఖ్యమంత్రి ఆనంది బెన్ రాజీనామా లేఖ అందినట్లు బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా తెలిపారు. బెన్ రాజీనామాపై పార్టీ పార్లమెంటరీ బోర్డు సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని ఆయన సోమవారమిక్కడ తెలిపారు.
కాగా ఆనంది బెన్ తన పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. 75 ఏళ్ళ వయసు నిండినవారు పదివిలో కొనసాగకూడదన్న విషయంపై తానీ నిర్ణయం తీసుకున్నట్లు ఆమె ఫేస్ బుక్ ద్వారా ప్రకటించారు. తనకు నిర్ణీత వయసు దాటిన వెంటనే బాధ్యతలనుంచీ తప్పించాల్సిందిగా పార్టీని కోరినట్లు ఆమె వెల్లడించారు. తనపై పార్టీ ఎంతో నమ్మకం ఉంచి.. బాధ్యతలను అప్పగించినందుకు ఎంతో కృతజ్ఞురాలినన్నారు. డెబ్బయ్ అయిదేళ్లు నిండిన వారు పదవిలో కొనసాగకూడదన్న పార్టీ నిర్ణయాన్ని తాను శిరసా వహిస్తున్నానని, అందుకే పదవినుంచీ తప్పుకొనేందుకు అంగీకరించమంటూ రాజీనామా పత్రాన్ని పార్టీకి అందించినట్లు ఆమె తెలిపారు.
ఆనంది బెన్ పటేల్ తన రాజీనామా లేఖను రాష్ట్ర బిజేపీ ప్రెసిడెంట్ విజయ్ రూపానీకి అందించానని, వారు అందుకు అంగీకరించినట్లు ఆమె తెలిపారు. నరేంద్రమోదీ ప్రధాని బాధ్యతలు స్వీకరించిన అనంతరం.. గుజరాత్ మొదటి మహిళా సీఎంగా తాను బాధ్యతలు స్వీకరించినట్లు ఆనంది బెన్ పటేల్ తాను గుజరాతీలో రాసిన పోస్ట్ లో వివరించారు.