
బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా
పశ్చిమ బెంగాల్ ప్రజలు ఆదేశిస్తే రాజీనామా పత్రాలు వెంటనే సమర్పిస్తా. శిరస్సు వంచి పదవి నుంచి తప్పుకుంటా
బసీర్‌హట్/శాంతిపూర్: పశ్చిమ బెంగాల్ ప్రజలు ఆదేశిస్తే తన పదవికి రాజీనామా చేసేందుకు సిద్ధంగా ఉన్నానని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా స్పష్టం చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో అధికార తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోవడం ఖాయమని, మే 2న సీఎం మమతా బెనర్జీ గద్దె దిగడం తథ్యమని పునరుద్ఘాటించారు. కూచ్‌బెహార్ జిల్లాలో సీఐఎస్‌ఎఫ్ కాల్పులకు బాధ్యత వహిస్తూ అమిత్ షా రాజీనామా చేయాలని మమతా బెనర్జీ డిమాండ్ చేసిన సంగతి తెలిసిందే. దీనిపై అమిత్ షా ప్రతిస్పందించారు. ఆయన ఆదివారం ఉత్తర 24 పరగణాల జిల్లాలోని బసీర్‌హట్‌లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ‘‘నేను రాజీనామా చేయాలని దీదీ అన్నారు. పశ్చిమ బెంగాల్ ప్రజలు ఆదేశిస్తే రాజీనామా పత్రాలు వెంటనే సమర్పిస్తా. శిరస్సు వంచి పదవి నుంచి తప్పుకుంటా. మే 2న మమతా బెనర్జీ కచ్చితంగా గద్దె దిగాల్సి ఉంటుంది’’ అని పేర్కొన్నారు.
బెంగాల్‌లోకి అక్రమంగా వలస వచ్చిన వారిని బుజ్జగించేందుకు దీదీ ప్రయత్నిస్తున్నారని, అందుకే పౌరసత్వ సవరణ చట్టాన్ని వ్యతిరేకిస్తున్నారని విమర్శించారు. అక్రమ వలసదారులు ఒకవైపు ప్రభుత్వ పథకాలతో ప్రయోజనం పొందుతూ మరోవైపు సమాజంలో అలజడి సృష్టిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్రమ వలసదారులకు వత్తాసు పలుకుతున్నవారికి రాష్ట్రాన్ని పాలించే హక్కు లేదన్నారు. బెంగాల్‌లో బీజేపీ అధికారంలోకి రాగానే అక్రమ వలసలను అరికడతామన్నారు. పౌరసత్వ సవరణ చట్టాన్ని వ్యతిరేకిస్తూ బెంగాల్ అసెంబ్లీలో గతంలో చేసిన తీర్మానాన్ని వెనక్కి తీసుకుంటామన్నారు. ‘ముఖ్యమంత్రి కాందీశీకుల సంక్షేమ నిధి’ని ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. కాందీశీకులకు ఒక్కొక్కరికి ప్రతిఏటా రూ.10 వేల చొప్పున ఇస్తామని ప్రకటించారు.
మమత రెచ్చగొట్టడం వల్లే కాల్పులు
కేంద్ర భద్రతా బలగాలపై తిరగబడాలని మమతా బెనర్జీ ప్రజలను రెచ్చగొట్టారని, అందుకే కూచ్‌బెహార్ జిల్లాలో కాల్పులు జరిగాయని అమిత్ షా ఆరోపించారు. మరణాల విషయంలోనూ ఆమె బుజ్జగింపు రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. ఆయన ఆదివారం నాడియా జిల్లాలోని శాంతిపూర్‌లో రోడ్ షోలో పాల్గొన్న అనంతరం విలేకరులతో మాట్లాడారు. మమతా బెనర్జీ రెచ్చగొట్టడం వల్ల ప్రజలు సీఐఎస్‌ఎఫ్ జవాన్లపై దాడికి దిగారని, ఆత్మరక్షణ కోసం జవాన్లు కాల్పులు జరపాల్సి వచ్చిందని చెప్పారు. కూచ్‌బెహార్ జిల్లాలో అధికార తృణమూల్ కాంగ్రెస్ కార్యకర్తల దాడిలో ఆనంద బర్మన్ అనే బీజేపీ కార్యకర్త చనిపోయాడని అన్నారు. అతడి మృతి పట్ల మమత సంతాపం తెలపడం లేదని తప్పుపట్టారు. అతడు తృణమూల్ కాంగ్రెస్‌ను వ్యతిరేకించే రాజ్‌బోంగ్‌శీ వర్గానికి చెందినవాడు కావడమే ఇందుకు కారణమని అమిత్ షా పేర్కొన్నారు.