
జైపూర్: రాజస్తాన్ ప్రభుత్వం అవినీతి, అక్రమాల రహస్యాలన్నీ రెడ్ డైరీలో ఉన్నాయని, దీనిపై సీఎం అశోక్ గెహ్లాట్ రాజీనామా చేయాలని కేంద్ర హోం మంత్రి అమిత్ షా డిమాండ్ చేశారు. గంగాపూర్‌లో శనివారం జరిగిన ‘సహకార కిసాన్ సమ్మేళన్’ను ఉద్దేశించి మంత్రి మాట్లాడారు. ఆయన ప్రసంగం ప్రారంభించగానే కొందరు నినాదాలు ప్రారంభించారు.
వారినుద్దేశించి మంత్రి మాట్లాడుతూ..‘నినాదాలు చేసేందుకు కొందరిని పంపించినంత మాత్రాన ఒరిగేదేమీ ఉండదని గెహ్లాట్‌కు చెప్పాలనుకుంటున్నా. ఆయనకు సిగ్గుంటే, రెడ్ డైరీ వ్యవహారంపై రాజీనామా చేసి, ఎన్నికలకు వెళ్లి ఉండేవారు’అని వ్యాఖ్యానించారు. 2020లో కాంగ్రెస్ నేత ధర్మేంద్ర రాథోడ్ ఇంటిపై ఆదాయపన్ను శాఖ అధికారులు జరిపిన దాడుల్లో ‘రెడ్ డైరీ’దొరికింది. దాన్లో సీఎం గెహ్లాట్ ఆర్థిక లావాదేవీల వివరాలన్నీ ఉన్నట్లు మంత్రివర్గం నుంచి బర్తరఫ్ అయిన రాజేంద్ర గూధా చేసిన ఆరోపణలను అమిత్ షా తన ప్రసంగంలో ప్రస్తావించారు.
Comments
Please login to add a commentAdd a comment