బీజేపీలో తారాస్థాయికి చేరిన చర్చలు
న్యూఢిల్లీ : ప్రధాని అభ్యర్థిగా నరేంద్ర మోడీని ప్రకటించడంపై బీజేపీలో చర్చలు తారాస్థాయికి చేరాయి. మోడీ అభ్యర్థిత్వం ఆపార్టీకి బిగ్ ఫ్రైడ్ అయ్యింది. సాయంత్రం జరిగే బీజేపీ పార్లమెంటరీ బోర్డు సమావేశంలో మోడీ పేరును అధికారికంగా ప్రకటించవచ్చనే సంకేతాలు జోరుగా వినిపిస్తున్నాయి. మోడీ అభ్యర్థిత్వత్వాన్ని బీజేపీ సీనియర్ నేతలు అద్వానీ, సుష్మాస్వరాజ్ వ్యతిరేకిస్తున్నారు. నాలుగు రాష్ట్రాల ఎన్నికలు జరిగేంత వరకూ ఆగాలని మోడీని వ్యతిరేకిస్తున్న బీజేపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో బీజేపీ నిర్ణయం ఎలా ఉంటుందన్నది అందరిలో ఆసక్తిని నింపుతోంది.
మోడీ అభ్యర్థిత్వాన్ని గట్టిగా వ్యతిరేకిస్తున్న అగ్రనేతలు అద్వానీ, సుష్మాస్వరాజ్, మురళీ మనోహర్ జోషీలకు నచ్చచెప్పడానికి పార్టీ జాతీయాధ్యక్షుడు రాజ్‌నాధ్‌సింగ్‌తో పాటు సీనియర్ నేతలు అరుణ్‌జైట్లీ, వెంకయ్యనాయుడు, నితిన్‌గడ్కరీలు ఇప్పటికే పలుమార్లు ప్రయత్నించారు. ఈ ముగ్గురిలో జోషీ కాస్త మెత్తబడ్డారు. పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉంటానని స్పష్టం చేశారు.
అద్వానీ, సుష్మా మాత్రం ఇంకా అంగీకరించడం లేదు. పార్లమెంటరీ బోర్డు భేటీకీ గైర్హాజరు కావాలని తొలుత భావించిన సుష్మా చివరకు మనసు మార్చుకుని అంబాలా పర్యటనను వాయిదా వేసుకున్నట్లు తెలుస్తోంది. చివరగా అద్వానీ ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా మోడీని ప్రధాని అభ్యర్థిగా ప్రకటించాలని పార్టీ భావిస్తున్నట్లు సమాచారం.