ఢిల్లీలో ఎంపీ బిజీబిజీ
నిజామాబాద్ ఎంపీ కవిత దేశ రాజధానిలో బిజీగా ఉన్నారు. ప్రధానితోపాటు, మంత్రులను కలిసి అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలని కోరుతున్నారు.
నిజామాబాద్ అర్బన్,న్యూస్‌లైన్ : తొలిసారిగా నిజామాబాద్ తొలి మహిళా ఎంపీగా ఎన్నికైన కల్వకుంట్ల కవిత ఇందూరు అభివృద్ధిపై ప్రత్యేక దృష్టిసారించారు. నిజామాబాద్ పార్లమెంట్ పరిధి అభివృద్ధి దిశలో నడిపించేందుకు ఆమె ప్రత్యేక కార్యాచరణ రూపొం దించుకున్నారు. ఇందులో భాగంగానే ఢిల్లీలో అభివృద్ధి పనులపై బిజీబిజీగా ఉన్నారు. రాష్ట్రపతి, ప్రధానమంత్రులను కలుస్తూ అభివృద్ధి పనుల కోసం కృషిచేస్తున్నారు. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని కలిశారు. నర్మ్ కింద 75 పనుల అనుమతి కోరారు. మెడికల్ కళాశాలకు రెండవ సం వత్సరం అనుమతి వచ్చేలా కోరారు.
ఇందుకు సంబంధించి జిల్లా కలెక్టర్‌తో సమీక్షించారు. నిజామాబాద్‌లో మాస్టర్ ప్లాన్ పనులకు శ్రీకారం చుట్టారు. ఇందుకు పనుల మంజూరు కోరారు. ఈ పనులను టెండర్ల ప్రకారం నిర్వహించాలన్నారు. జిల్లాలో ఏర్పాటు చేయనున్న కేంద్రీయ విద్యాలయాలను త్వరగా చేపట్టాలని, వీటి పనులు సత్వరమే పూర్తి చేయాలని కోరారు. జిల్లాలోని గల్ఫ్‌బాధితుల సమస్యల పరిష్కారం కోసం ఈనెల 9న కేంద్ర మంత్రి సుష్మా స్వరాజ్‌ను కలువనున్నారు.
అలాగే జిల్లాలో పసుపుబోర్డును త్వరగా ఏర్పాటు చేసి రైతులను ఆదుకోవాలని కోరుతూ ప్రధాన మంత్రి నరేంద్రమోడీకి వినతిపత్రం సమర్పించనున్నారు. బోధన్‌లోని ఓ ప్రైవేట్ భవనాన్ని అద్దెకు తీసుకొని కేంద్రీయ విద్యాలయం ఏర్పాటుచేయాలని జిల్లా కలెక్టర్‌కు సూచించారు. గతంలో ఎంసీఐ లెవనెత్తిన సమస్యలను నివేదిక రూపంలో తనకు అందించాలని కలెక్టర్‌ను ఆదేశించారు.
అలాగే ఢిల్లీలో కళాశాలకు అనుమతి వచ్చేలా ఎంసీఐని సంప్రదించనున్నారు. మెడికల్ కళాశాల అనుమతి వచ్చేలా కోరి నిధులు కూడా మంజురయ్యేలా కృషి చేయనున్నారు. ఇవేకాకుండా జిల్లాలో అపరిష్కృతంగా ఉన్న సమస్యలను పరిష్కరించేందుకు ప్రయత్నిస్తున్నారు.