రెండు చేతులు... వేయి బాధ్యతలు... అలుపెరుగని అమృతమూర్తి | toda international mothers day | Sakshi
Sakshi News home page

రెండు చేతులు... వేయి బాధ్యతలు... అలుపెరుగని అమృతమూర్తి

Published Sat, May 10 2014 10:14 PM | Last Updated on Sat, Sep 2 2017 7:11 AM

రెండు చేతులు...  వేయి బాధ్యతలు... అలుపెరుగని అమృతమూర్తి

రెండు చేతులు... వేయి బాధ్యతలు... అలుపెరుగని అమృతమూర్తి

నేడు  అంతర్జాతీయ మాతృదినోత్సవం
ఈ ప్రపంచం విశాలమైనదా? అమ్మ హృదయం విశాలమైనదా? అని అడిగితే వచ్చే సమాధానం ఒక్కటే! అమ్మ హృదయం అని! అవును మరి! ఈ ధరిత్రికి ఉన్న ఓర్పు ఈ ప్రపంచంలో ఒక్క అమ్మకు తప్ప మరెవరికి ఉంది? అందుకే తల్లి ... పుడమితో సమానం. ప్రపంచంలో నాగరక, ఆటవిక జాతులన్నింటిలోనూ తల్లికి ప్రత్యేక స్థానం ఉంది. ఈ ప్రపంచానికి భావితరాలను అందించే వ్యక్తి ఆమే కదా!

నవ మాసాలూ మోసి బిడ్డను కనడం మహిళకు మరో జన్మ అంటారు. ఎందరో మహిళలు పసిగుడ్డుకు జన్మనిచ్చే క్రమంలో ప్రాణాలు కోల్పోయారు. అయినా అమ్మ ఆ భారాన్ని మోస్తూనే వస్తోంది. భవిష్యత్తులోనూ దాన్ని ఓ భారం అనుకోకుండా మోస్తూనే ఉంటుంది. ఓ పసిగుడ్డుకు ప్రాణం పోయడానికి ఎంత శ్రమపడాల్సి ఉంటుందో తెలిసినా ఆ తల్లి ఈ ప్రపంచానికి ఒక తరాన్ని అందించడానికి తన ప్రాణాలను పణంగా పెడుతూనే ఉంది. అందువల్లనే అమ్మకు అత్యున్నత స్థానం లభించింది.

అమ్మగా అనేక పనులు
ఆడపిల్లగా పుట్టిన క్షణం నుండి ఓ కుటుంబంలో ఆమె ప్రయాణం ఆరంభమై, కూతురుగా, చెల్లిగా, అక్కగా, అమ్మగా, వదినగా, అత్తగా, ఆడపడుచుగా, అమ్మమ్మగా, ఎంతోమందికి స్ఫూర్తిగా నిలిచి తాను ఒక్కటిగా, అందరికీ అవసరమైన వ్యక్తిగా కుటుంబంలో, సమాజంలో నిలుస్తుంది.

ఓ టీచర్‌గా....
బిడ్డ పుట్టిన తర్వాత చనుబాలు ఇవ్వడంతో తల్లి తన బిడ్డకు ఒక గురువుగా మారుతుంది. ఆ బిడ్డ ప్రతి కదలికలోనూ తల్లి మార్గదర్శకత్వం ఉంటుంది. ఎలా నడవాలి,  ఎలా నడుచుకోవాలి, ఎలా మాట్లాడాలి, ఎలా వ్యవహరించాలి, ఎలా జీవించాలి, జీవితపు ఆఖరు క్షణాలను  హుందాగా ఎలా ఆహ్వానిం చాలి... అన్నీ తల్లే నేర్పిస్తుంది. అక్షరాలు మొదలుకొని జీవితపు ఆఖరి మజిలీ వరకు తల్లి నేర్పిన పాఠాలే మనిషిని ముందుకు నడిపిస్తాయి.

రామకృష్ణ పరమహంస తన భార్యలో కూడా తల్లిని దర్శించిన మహనీయుడు. ఆయన అంతటి గొప్ప వ్యక్తి కావడానికి స్ఫూర్తి ఆయన తల్లే. అలాగే వివేకానందుని జీవితం కూడా. తల్లి నేర్పిన జీవిత పాఠాలే ప్రపంచానికి ఆయన ఆదర్శమూర్తి కావడానికి కారణం. ఇక గాంధీ మహాత్ముని గురించి ప్రత్యేకంగా  చెప్పాల్సిందేముంది? ఆయన స్వయంగా తన ఆత్మకథలో అమ్మ గురించి ఎన్నో సందర్భాలలో చెప్పుకున్నాడు. ప్రపంచానికే ఆదర్శమూర్తులైన ఆ వ్యక్తుల తల్లులు ఇంకెంత గొప్ప ఆదర్శమూర్తులో ఆలోచించండి?

ఒక గృహిణిగా...
ప్రతి తల్లీ ఒక మంచి ఐఏఎస్ ఆఫీసరనే చెప్పాలి. కలెక్టర్ ఒక జిల్లాలోని అన్ని శాఖలను ఎలా సమన్వయం చేసి నడుపుతాడో ఒక తల్లి కూడా ఇంటిలో ఉండే అన్ని శాఖలను, వ్యవహారాలను సమన్వయం చేసి ముందుకు నడుపుతుంది. ఇంటికి సంబంధించిన ఆర్థిక వ్యవహారాలు చూస్తుంది. పిల్లల మధ్యన గొడవలు రాకుండా, ఇంట్లోని వ్యక్తుల మధ్య శాంతి సామరస్యాలు నెలకొల్పడంలో చొరవ తీసుకుంటుంది. రోజువారీ కార్యక్రమాలు, ఆదాయం - వ్యయం, బంధుమిత్ర వర్గం, క్రమశిక్షణ, ఇంటి నిర్వహణ, జనన మరణాలు... ఒకటేమిటి! ఎన్ని విభాగాలో? అన్నింటినీ నేర్పుతో నిర్వహిస్తుంది. ఖర్చు చేయడంలో, పొదుపు చేయడంలో ఆమెకు సాటి మరొకరు లేరు.

అనునిత్యం ఆమె ఇంటి గురించే ఆలోచిస్తుంది. జీవితంలో ఉన్నతస్థాయికి చేరుకున్న చాలామంది ‘నేను ఈ స్థాయికి రావడానికి నా భార్య కృషి ఎంతో ఉంది’ అని చెబుతుంటారు. అందులో సందేహమేమీ లేదు. వ్యాపార సామ్రాట్టులుగా ప్రపంచంలో పేరు తెచ్చుకున్న అంబానీల తల్లినే తీసుకోండి. కొడుకులు కోట్లాది రూపాయల వ్యాపారాలకు అధిపతులైనా, తగవులు వచ్చినప్పుడు తల్లి మాత్రమే తీర్పు చెబుతుంది. ఎలాంటి ఆడంబరాలకూ పోకుండా సహజత్వానికి దగ్గరగా ఉండే మహిళ ప్రపంచాన్ని ఏలే కొడుకులను తీర్చిదిద్దుతుంది. పెపైచ్చు, అందులో తన గొప్పదనం ఏమీ లేదని ఎంతో వినమ్రంగా చెబుతుంది.

ఒక మనిషి - అనేక కోణాలు
జడ్జిగా ఎన్నో తీర్పులు చెప్పే కొడుకు ఇంటికి వచ్చి ఒకానొక కేసులో తీర్పు ఎలా ఉండాలో తల్లిని సలహా అడుగుతాడు. దినమంతా కలెక్టరుగా ఎన్నో శాఖల పనులను చక్కబెట్టి ఇంటికి వచ్చి తల్లిని సలహాలు అడుగుతాడు. బజార్లో పోట్లాడి ఇంటికి వచ్చిన కొడుక్కి బుద్ధి నేర్పుతుంది తల్లి. ఇంటి బయటి గొడవలను తన మాటలతో సద్దుమణిగేట్లు చేస్తుంది. తన పిల్లలే కాదు తాను ఉంటున్న వీధిలోని పిల్లల భవిష్యత్తు కూడా బాగుండాలనే విశాలహృదయం గల ప్రత్యక్ష దేవత తల్లి.

వయసు పెరిగే కొద్దీ బాధ్యతలు పెరిగి ఆమె పరిధి మరింత విస్తృతమవుతుంది. కొడుకులు, కూతుళ్లకు కుటుంబాలను ఏర్పరుస్తుంది. అమ్మమ్మగా, నానమ్మగా మనుమలను కంటికి రెప్పలా కాపాడుతుంది. ఏ మాత్రం స్వార్థం లేకుండా తన శక్తియుక్తులనన్నింటినీ తన వారి కోసం ధారపోసి తనువు చాలిస్తుంది

స్ఫూర్తి ప్రదాత
వేల ఏళ్ళ నుండీ చరిత్రను గమనిస్తే ఒక విషయం కనిపిస్తుంది. ఎంతోమంది రాజులు తమ రాజ్య పరిపాలనలో తల్లినే ఆదర్శంగా తీసుకున్న నిదర్శనాలెన్నో కనబడతాయి. విజయనగర సామ్రాజ్యాధీశుడైన శ్రీకృష్ణదేవరాయలు, మరాఠా మహారాజు శివాజీ ఇందుకు నిదర్శనాలు. శివాజీ ప్రతి పనిలో తల్లిని సంప్రదించేవాడు.

గాంధీజీ నేటియుగంలో మహాత్ముడు అయ్యాడంటే అది ఆయన తల్లి గొప్పదనం. ఎన్నో కంపెనీలకు అధిపతులుగా ఉన్న ఎందరో పారిశ్రామిక వేత్తల జీవితాలలో స్ఫూర్తి నింపింది వారి అమ్మ అనడంలో సందేహం లేదు. ఎందరో రాష్ట్రస్థాయి, జాతీయస్థాయి నాయకులు, అధికారులు తమ ఉన్నతిలో తమ తల్లి పాత్ర ఎంతో ఉందని అనేక సందర్భాలలో చెబుతూనే ఉన్నారు.

తల్లిని కళ్ళెదుట కనిపించే దైవంగా కొలిచే కొడుకులు ఉన్నారు. కొన్ని చోట్ల తల్లికి గుడి కట్టిన కొడుకులూ ఉన్నారు. తల్లి గొప్పతనాన్ని కమనీయంగా మలిచిన సినిమాలు చాలానే వచ్చాయి.అందరూ అమ్మ గొప్పతనాన్ని గుర్తిస్తున్నారా అంటే సందేహమే. నవమాసాలూ మోసి, కని పెంచిన అమ్మను వార్ధక్యంలో పట్టించుకోకుండా, వదిలేసిన సంతానమూ లేకపోలేదు. ఇలాంటి నేపథ్యంలో ‘మదర్స్ డే’ మరింత ప్రాముఖ్యం సంతరించుకుంటోంది.

మాతృదినోత్సవం
అమ్మ పాత్రను గుర్తించిన ప్రపంచం ఆమె కోసం ఒక రోజును కేటాయించి ఆ రోజున అందరూ ఆమె గొప్పతనాన్ని స్మరించుకొనేలా చేస్తోంది. ప్రపంచ చరిత్రను చూస్తే మాతృదినోత్సవాన్ని ఒక వేడుకగా జరుపుకోవడం 1914లో మొదలైంది. అమెరికాకు చెందిన అన్నా జార్విస్ అనే మహిళ మాతృదినోత్సవాన్ని నిర్వహించడానికి ఆద్యురాలు. ఆమె 1908లోనే ఈ సంప్రదాయానికి శ్రీకారం చుట్టారు. ఆమె తల్లి మే 9న చనిపోయింది. ఆ తేదీయే ఇప్పుడు అమెరికాలో అధికారిక మాతృదినోత్సవంగా స్థిరపడింది.

ప్రపంచ చరిత్ర లోతుల్లోకి వెళితే భారతీయ సమాజంతో పాటు గ్రీకులు, రోమన్‌లు సైతం ‘అమ్మ దేవత’ గా రియా, సైబిలిలను కొలిచేవారు. క్రైస్తవులు పూర్వకాలంలో అమ్మ దినోత్సవాన్ని ‘ఆదివారం అమ్మ’ గా ఆదివారం నాడు వేడుక జరుపుకునేవారు. బ్రిటన్, కొన్ని ఐరోపా దేశాలలో మే నెలలో నాలుగో ఆదివారాన్ని మాతృదినోత్సవంగా జరుపుకొంటున్నారు.

పుతలీబాయి
గాంధీజీ పుతలీబాయికి నాలుగో కొడుకు. కరమ్‌చంద్ గాంధీతో పెళ్లి నాటికి ఆమె వయసు కేవలం 13 సంవత్సరాలే. వయసు చిన్నదే అయినా ఆమె తన పిల్లలనే కాక మిగతా పిల్లలనందరినీ తన పిల్లలుగానే భావించేది. ప్రేమానురాగాలను పంచేది. చిన్న కొడుకైన గాంధీజీ అంటే పుతలీబాయికి ఎనలేని ప్రేమ. చిన్నప్పటి నుండే తల్లి ప్రేమను గాంధీజీ అర్థం చేసుకున్నాడు. తల్లి దగ్గరే అనేక విషయాలు నేర్చుకున్నాడు. ‘అబద్ధం చెప్పకూడదు. సత్యమే పలకాలి’ అనేవి ఆయన ఆయుధాలు.

పుతలీబాయి భారత, భాగవత కథలు చక్కగా చెప్పేది. తల్లిదండ్రులను జీవితాంతం కావడిలో పెట్టి మోసిన శ్రవణ కుమారుడి కథ గాంధీజీకి ఎంతో ఇష్టం. అందుకే గాంధీజీ కూడా తల్లిదండ్రుల పట్ల గౌరవభావంతో ఉండేవాడు. పుతలీబాయి ఆచార వ్యవహారాలు పాటించేది. దైవ ప్రార్థన చేసేది. బీదపిల్లలకు సాయం చేసేది. నిరాడంబరత, ఓర్పు, సహనం, క్షమ వంటివి గాంధీజీకి తల్లి నుండే అలవడ్డాయి. ఆమె వల్లే గాంధీజీ అంత గొప్పవాడయ్యాడు.
 
మేరీ మాత
మేరీమాత జీసస్‌కు తల్లి. జీసస్‌ను దేవుని బిడ్డగా భావిస్తారు. భగవంతుని ప్రేరణతోనే కొడుకుగా మేరీ గర్భం నుండి జీసస్ ఉద్భవించాడు. అప్పటికి ఆమె యవ్వనంలో ఉంది. ఆమె తల్లిదండ్రులు జోచిమ్, అన్నే మేరీలకు దేవుడన్నా, జూవిష్ మతమన్నా  ఎంతో అభిమానం. అందరికీ ఆమె ఓ సాధారణ ఆడపిల్ల అనే తెలుసు. భగవంతుడు దేవదూత గాబ్రియేలును తన దూతగా నజరేత్ పట్టణానికి పంపించాడు. అతడు భగవంతుని ఆశయాన్ని  ఆమెకు వినిపించాడు.

అలా మేరీ, ఆమె భర్త జోసేఫ్‌లకు జీసస్ జన్మించాడు. ఆ భార్యాభర్తలిద్దరూ ఎన్నో ఏళ్ళు నజరేత్ పట్టణంలోనే ఉన్నారు. చిన్నప్పటి నుండే జీసస్‌కు భగవంతుని పట్ల ప్రేమను ఆమె పురికొల్పింది. తదనంతరం జీసస్ భగవంతుని బిడ్డగా అందరి మన్ననలు పొందాడు. భగవంతుని కోసం ప్రాణాలను అర్పించాడు. తన కొడుకు చనిపోయాడన్న బాధ ఆమెలో ఎప్పుడూ లేదు. భగవంతుని కోసం ప్రాణాలను ఇచ్చిన గొప్పవాడుగానే భావించింది. అందుకే ఆమె క్రైస్తవ మత ప్రజలందరికీ తల్లిగా మారిపోయింది.
 
 
భువనేశ్వరీదేవి
వివేకానందుడు ప్రపంచమంతటా గుర్తింపు తెచ్చుకొనేలా ఎదగడానికి కారణం అతని తల్లి భువనేశ్వరీదేవి. చిన్నప్పుడే భర్త చనిపోవడంతో ఇంటి బరువు బాధ్యతలను ఆమె తన మీద వేసుకుంది. చిన్నతనంలోనే వివేకానందుడికి పురాణ కథలు చెప్పింది. ఆమె చెప్పిన విషయాలు వివేకానందుని మనసులో నాటుకుపోయాయి. దేశ గౌరవాన్ని మరింత ఇనుమడింప చేయడానికి ఏం చేయాలో అతనికి అర్థమైంది.

అతడు శ్రీరామకృష్ణ పరమహంసను కలవడంతో అది మరింత బలపడింది. తల్లి ఏనాడూ దేనికీ అతనికి అడ్డు చెప్పలేదు. వివేకానందుడు భవిష్యత్తులో ఎంతో గొప్ప వ్యక్తి అవుతాడన్న విషయాన్ని అతని చిన్నతనంలోనే ఆమె గమనించింది. అందుకే అన్ని సందర్భాలలో సరైన మార్గదర్శకత్వం చేసింది. ‘‘నేను నా తల్లికి ఎంతో రుణపడి ఉన్నా. విపత్కర పరిస్థితుల్లోనూ ఆమె ప్రశాంతంగా ఉండేది. సమస్యనెలా ఎదుర్కోవాలో ఆమెకు బాగా తెలుసు. ఈ లక్షణాలన్నీ నేను నా తల్లి నుండే పుణికిపుచ్చుకున్నా’’ అని వివేకానందుడు చెప్పారు.
 
 
మదర్ థెరిసా

1910 ఆగస్టు 26న యుగొస్లేవియాలో జన్మించిన మదర్ థెరిసా ఇప్పుడు విశ్వమాతగా కొనియాడబడుతోంది. ఆమెకు ఎనిమిదేళ్ళ వయసులోనే తండ్రి చనిపోయాడు. తల్లి ఆమెను తమ మత ఆచారాల ప్రకారం పెంచింది. పన్నెండేళ్ళ వయసులోనే ఆమె సన్యసించాలని నిర్ణయించుకుంది. కానీ తల్లి అప్పుడు ఒప్పుకోలేదు. చివరికి పద్ధెనిమిదేళ్ళ వయసులో 1928 ఆగస్టు 15న ఆమె లొరెటో మిషనరీలో సన్యాసినిగా చేరిపోయింది. 1929లో ఆమె భారతదేశానికి వచ్చింది. అనాథ పసిపిల్లలకు తల్లిగా ఎంతో సేవ చేసింది. కులం, మతం పక్కన పెట్టి ఆమె కలకత్తా నగరంలో రోగులకు, వితంతువులకు, అనాథలకు చేసిన సేవ జగమెరిగినదే.

1943లో కలరా వచ్చినప్పుడు ఎందరికో వైద్య సేవలు అందించింది. 1946లో ఆమె రైలులో ప్రయాణిస్తుండగా దేవుని వాక్యాలను విన్నది. ఇక అప్పటి నుండి ఆమె తన పూర్తి జీవితాన్ని దీనుల కోసం అంకితం చేసింది. కలకత్తాలో పాఠశాలలు, వైద్య సౌకర్యాలు, అనాథ గృహాలు ప్రారంభించింది. తన సేవను భగవంతుని సేవగా భావించింది. ఏ సందర్భంలోనూ ఇతరులను చూసి అసహ్యించుకోలేదు. విపత్కర పరిస్థితులలోనూ ప్రశాంతంగా ఉండడం ఆమె స్వభావంగా మారింది. భారత పౌరసత్వం పొందింది. మొత్తం ప్రపంచ దేశాల నుండి ప్రశంసలు పొందింది. ఎన్నో దేశాలు ఆమెకు అత్యున్నత పురస్కారాలు ఇచ్చి గౌరవించాయి .

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement