గాంధీబాబుకు మదర్ థెరిసా పురస్కారం
-
గిరిజన ప్రాంతాల్లో చేసిన సేవలకు దక్కిన గౌరవం
-
హర్షం వ్యక్తం చేస్తున్న మండల ప్రజలు
వీఆర్‌పురం :
పేద గిరిజనులకు విద్యా, వైద్య సేవలందిస్తున్న ఏఎస్‌డీఎస్ స్వచ్ఛంద సంస్థ డైరెక్టర్ వి.గాంధీబాబుకు మదర్ థెరిసా పురస్కారం లభించింది. మదర్ థెరిసా జయంతిని పురస్కరించుకుని హైదరాబాద్ హెల్త్‌కేర్ ఇంటర్‌నేషల్ సంస్థ విద్యా, వైద్య విభాగాల్లో ఉత్తమ సేవలందించిన ప్రముఖులను గుర్తించి ఏటా ఈ పురస్కారాలు ఇస్తున్నది. ఇటీవల కాలంలో ఏజెన్సీ ప్రాంతంలో గిరిజన, వలస ఆదివాసీయుల గ్రామాల్లో పోషకాహారంతో బాధ పడుతున్న మూడు వేల మంది బాల బాలికలను పౌష్టికాహార కేంద్రాల్లో చేర్పించి మెరుగైన వైద్యం అందజేశారు. గర్భిణులకు, చిన్నారులకు తన సంస్థ సొంత మెడికల్ యూనిట్ల ద్వారా 89 వైద్య శిబిరాలు నిర్వహించి 5478 మందికి సేవలందించారు. అలాగే పలుగ్రామాల్లో చేతి పంపులు, బావులు ఏర్పాటు చేశారు. ఆయన సేవలను గుర్తించి గాంధీబాబును మదర్ థెరిసా పురస్కారానికి ఎంపికచేశారు. గురువారం రాత్రి హైదరాబాద్‌లో జరిగిన కార్యక్రమంలో ఆయన అవార్డు అందుకున్నారు. అవార్డు రావడం పట్ల మండల ప్రజలు, రాజకీయ నాయకులు, సంస్థ సిబ్బంది ఆయనకు అభినందనలు తెలిపారు.