పలమనేరు : చేయూత లేదని అనాథలు బాధపడకూడదు.. ఆదరణ లేదని వృద్ధులు శోకించకూడదు..విద్య, వైద్య సదుపాయాలు లేక నిరుపేదలు అవస్థలపాలు కాకూడదు. సమాజంలో ప్రతి మూల ఓ వివక్ష కాని ఓ సమస్య కాని విష వృక్షంలా మారి మనిషి జీవితాన్ని కుదిపేస్తోంది. అలాంటి వారి జీవితాల్లో మార్పు తీసుకురావాలన్న మహోన్నత ఆశయం కోసం ఓ యువతి తపిస్తోంది. వారి సమస్యలే ఆమెకు స్ఫూర్తి..వారికి సేవ చేయడమే ఆమె లక్ష్యం..విద్యార్థి దశలోనే తనకు చేతనైన సాయం చేస్తూ సమా జ సేవలో ముందున్న ఆమె దృక్పథం నేటి యువతరానికి ఆదర్శం. పలమనేరు మదర్‌థెరీసా ఇంజినీరింగ్ కళాశాలలో బీటెక్ పూర్తి చేసి బంగారు పతకాన్ని సాధించి, ప్రస్తుతం ఐఏఎస్ కోచింగ్ తీసుకుంటున్న రోహిత మనగతం ఆమె మాటల్లోనే..
కుటుంబం, చదువు
నా పేరు రోహిత.. మాది గంగవరం సమీపంలోని మబ్బువాళ్లపేట. నాన్న వెంకటేశ్వర్లు ఏసీటీఓగా పనిచేస్తున్నారు. అమ్మ హేమలత గృహిణి. అన్నయ్య రిత్విక్ రోబోటెక్ ఆటోమేషన్‌లో యూఎస్‌లో జాబ్ చేస్తున్నాడు. నా ప్రాథమిక విద్య యూనివర్సల్‌లో, ఇంటర్ శ్రీవాణిలో సాగింది. ఇంటర్ ఎంపీసీలో 97.3 శాతం మార్కులు సాధించా. విట్, ఎస్‌ఆర్‌ఎం, సస్త్ర యూనివర్సిటీల్లో ఫ్రీ సీటు వచ్చింది. కానీ బీటెక్(సివిల్) ఇక్కడి మథర్ థెరీసాలో చదివా. బీటెక్ 86.01 మార్కులు సాధించి జేఎన్‌టీయూలో టాపర్‌గా గోల్డ్‌మెడల్‌ను పొందా. రాష్ట్ర ప్రభుత్వ ప్రతిభ అవార్డులు పొందాను. ఏటా కేంద్ర ప్రభుత్వ స్కాలర్‌షిప్ వస్తోంది.
పోటీల్లో గెలిచి..పేదలకు పంచి
కాలేజీలో ఉన్న దాదాపు 20 ఇతర యూనివర్సిటీలు, కాలేజీల్లో జరిగే పవర్ పాయింట్ ప్రజెంటేషన్, ఇతర కాంపిటీషన్స్‌కు వెళ్లాను. దాదాపు అన్నింటిలోనూ మొదటి బహుమతి గెలుచుకున్నా. అందులో ఇచ్చే క్యాష్ ప్రైజ్‌ను పలమనేరులోని వృద్ధాశ్రమానికి, గ్రామంలోని నిరుపేదలకు ఇచ్చేదానిని. మా తల్లిదండ్రులు కూడా నాకు అండదండగా ఉండేవారు.
ప్రాక్టికల్ నాలెడ్జ్ ముఖ్యం
గంటలకొద్దీ చదవడం ముఖ్యం కాదు. సబ్జెక్ట్‌పై ప్రాక్టికల్‌గా పట్టు సాధించాలి. ఇందు కోసం నెట్, యూట్యూబ్ లాంటివి ఎంతో ఉపయోగం. అందుకే నేను బీటెక్‌లో సివిల్ ఇంజినీరింగ్ తీసుకున్నా. సింథెటిక్ పెయింటింగ్, సెల్ఫ్ హీలింగ్ కాంక్రీట్ అంశాలపై పేపర్ ప్రజెంటేషన్ చేస్తూ జేఎన్‌టీయూ, సౌత్ ఇండియా ఇంజినీరింగ్ యూనివర్సిటీల్లో టాపర్‌గా నిలిచా.
అందుకోసమే ఐఏఎస్ చదువుతున్నా..
2015లో జిల్లాకు వరదలు వచ్చాయి. కాని కొద్ది రోజులకే మా నియోజకవర్గంలో ప్రజలు మళ్లీ నీటి కోసం అవస్థలు పడ్డారు. నీటిని నిల్వ చేసేందుకు చెక్ డ్యామ్‌లు, చెరువులు లేకపోవడమే ఇందుకు కారణమనిపించింది. దీంతో ఐదు పంచాయతీల్లో దాదాపు 300 ఎకరాలకు నీరు అందించేలా ఓ ప్రాజెక్టును తయారు చేశాను. ఇందు కోసం సంబంధిత అధికారులను సంప్రదించి నెలల పాటు శ్రమించి అన్ని వివరాలతో ప్రాజెక్టు సిద్ధం చేసి అధికారులకు 2017 జూన్‌లో అందజేశా. కానీ నేటికీ ప్రభుత్వం నుంచి స్పందన రాలేదు. మంచి చేయాలని ఆశ ఉంటే చాలదు అధికారం కూడా కావాలని అప్పుడే అనిపించింది. కలెక్టర్ అయితే నేను అనుకున్నది చేయగలనని అనిపించింది. అందుకోసమే ఐఏఎస్ చదువుతున్నా..
సంక్పలం
నేను చిన్నప్పటి నుంచి గ్రామీణ వాతావరణంలో పెరిగా. నాకు ప్రజలు కష్టాలు బాగా తెలుసు. మా నాన్నకు వ్యవసాయమంటే ఇష్టం కావడం వల్ల నాకు కూడా పొలం పనులంటే ఆసక్తి. కూలి పనులకొచ్చేవారి జీవితాల్లో కష్టాలను చూశా. విద్య, వైద్య సదుపాయాలు లేక నిరుపేదలు అవస్థలపాలు కాకూడదని అనిపించింది. వృద్ధులు, అనాథల అవస్థలను చూశా. వారికి ఏదో ఒక రకంగా సాయం చేయాలనిపించేది.
Comments
Please login to add a commentAdd a comment