మదర్ థెరిసా చీరకు మేధో హక్కు
కోల్‌కతా: అందరికీ చిరపరిచితమైన నీలి అంచు తెల్ల చీర... జీవితాంతం మదర్ థెరిసా ధరించిన ఆ తరహా చీరకు మేధో హక్కును మిషనరీస్ ఆఫ్ చారిటీస్ సొంతం చేసుకుంది. ఏడాది క్రితమే కేంద్ర ప్రభుత్వానికి చెందిన ‘ద ట్రేడ్ మార్క్స్ రిజిస్ట్రీ’ ఈ గుర్తింపును జారీ చేసిందని మేధో హక్కుల న్యాయవాది బిస్వజిత్ సర్కార్ ఆదివారం తెలిపారు.
మదర్ థెరిసాను పునీతగా ప్రకటించిన 2016, సెప్టెంబర్ 4నే మిషనరీస్ ఆఫ్ చారిటీస్‌కు ఈ ఘనత దక్కిందని, ఆ సంస్థకు ప్రచారమంటే ఇష్టలేకపోవడంతో విషయం బయటకు రాలేదన్నారు. అయితే ప్రపంచవ్యాప్తంగా చాలామంది ఆ డిజైన్‌ను వ్యాపార ధోరణి కోసం వాడుతున్నారని, అలా చేయకుండా ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ఈ విషయం బయటపెడుతున్నామని సర్కార్ చెప్పారు. చీర ట్రేడ్‌మార్క్ ధ్రువీకరణ కోసం డిసెంబర్ 12, 2013న దరఖాస్తు చేసుకున్నారని, దాదాపు మూడేళ్ల పరిశీలన అనంతరం మే«ధో హక్కును కేటాయించారని తెలిపారు.