సూపర్‌డ్రైతో రిలయన్స్‌ జత | Reliance Retail to buy UK-based Superdry South Asia IP assets for Rs 402 Cr | Sakshi
Sakshi News home page

సూపర్‌డ్రైతో రిలయన్స్‌ జత

Oct 5 2023 6:29 AM | Updated on Oct 5 2023 6:29 AM

Reliance Retail to buy UK-based Superdry South Asia IP assets for Rs 402 Cr - Sakshi

న్యూఢిల్లీ: దక్షిణాసియా మేధో హక్కుల(ఐపీ ఆస్తులు) విక్రయానికి రిలయన్స్‌ రిటైల్‌తో ఒప్పందం కుదుర్చుకున్నట్లు యూకే ఫ్యాషన్‌ రిటైలర్‌ సూపర్‌డ్రై తాజాగా పేర్కొంది. ఇందుకు భాగస్వామ్య సంస్థ(జేవీ) ద్వారా రిలయన్స్‌ రిటైల్‌ 4 కోట్ల పౌండ్లు(రూ. 402 కోట్లు) వెచి్చంచనున్నట్లు వెల్లడించింది. ప్రధానంగా స్వెట్‌షర్టులు, హుడీస్, జాకెట్స్‌ తదితర ఫ్యాషన్‌ ప్రొడక్టులను రూపొందిస్తున్న సూపర్‌డ్రై.. జేవీలో 24 శాతం వాటాను పొందనుంది.

మిగిలిన 76 శాతం వాటా రిలయన్స్‌ రిటైల్‌ చేతిలో ఉంటుంది. ఒప్పందం ప్రకారం సూపర్‌డ్రై బ్రాండ్‌ ఐపీ ఆస్తులు కొత్తగా ఏర్పాటు చేయనున్న జేవీకి శాశ్వతంగా బదిలీకానున్నాయి. రిలయన్స్‌ బ్రాండ్స్‌ హోల్డింగ్‌ యూకేతో ఐపీ జేవీ ఏర్పాటుకు ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్లు సూపర్‌డ్రై పీఎల్‌సీ.. లండన్‌ స్టాక్‌ ఎక్సే్ఛంజీకి తెలియజేసింది. తద్వారా భారత్, శ్రీలంక, బంగ్లాదేశ్‌లలో సూపర్‌డ్రై బ్రాండుసహా.. సంబంధిత ట్రేడ్‌మార్క్‌లను జేవీకి బదిలీ చేయనున్నట్లు వెల్లడించింది.

నిధుల ఆవశ్యకత: సూపర్‌డ్రై ఇటీవల హోల్‌సేల్‌ కస్టమర్ల నుంచి బలహీన ఆర్డర్ల కారణంగా స్టాక్‌ నిల్వలు, లిక్విడిటీ తదితర అంశాలలో సవాళ్లు ఎదుర్కొంటోంది. దీంతో జేవీకి తెరతీసింది. దీంతో స్థూలంగా 3.04 కోట్ల పౌండ్ల నగదు లభించనుందని అంచనా వేస్తోంది. కాగా.. తాజా ఒప్పందంతో రిలయన్స్‌ దక్షిణాసియాలోని మూడు దేశాలలో కార్యకలాపాలు చేపట్టనున్నట్లు సూపర్‌డ్రై తెలియజేసింది. జేవీలో సూపర్‌డ్రై వాటాను కొనసాగించడంతోపాటు.. తమ నైపుణ్యం ద్వారా బ్రాండ్‌ డెవలప్‌మెంట్, డిజైన్, మార్కెటింగ్‌లలో మద్దతిస్తుందని రిలయన్స్‌ బ్రాండ్స్‌ ఎండీ దర్శన్‌ మెహతా చెప్పారు. భారత్‌ భారీ అవకాశాల మార్కెట్‌కాగా.. రిలయన్స్‌తో పటిష్ట బంధమున్నట్లు సూపర్‌డ్రై వ్యవస్థాపకుడు, సీఈవో జూలియన్‌ డంకెర్టన్‌ పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement