అందమైన లోకం | special story to France Education Minister najat belkacem | Sakshi
Sakshi News home page

అందమైన లోకం

Published Sun, Mar 12 2017 11:42 PM | Last Updated on Thu, Jul 11 2019 5:07 PM

అందమైన లోకం - Sakshi

అందమైన లోకం

ఫ్రాన్స్‌ విద్యాశాఖమంత్రి  నాజత్‌ బెలాసెమ్‌

చిన్నప్పుడు వాళ్లమ్మ చెప్పింది. లోకం అందమైనది కాదు... క్రూరం అయినదని... మనకిష్టమైనదే అయినా... కష్టమైనదని... ... అందుకే చదువుకొమ్మని. ఇప్పుడు నాజత్‌ అదే చెబుతోంది. ‘ఆడపిల్లల్ని చదివించండి... ప్రపంచం అందంగా మారుతుంది’ అని. ఒక అందమైన లోకానికి మహిళలు వేస్తున్న రహదారుల్లో ఒక రహదారి... నాజత్‌ కె నామ్‌ పర్‌. నాజత్‌కి అంకితం.

‘స్వేచ్ఛ’... ‘సమత్వం’... ‘సౌభ్రాత్రం’.. ఇవి అందరికీ తెలిసిన మూడు మాటలు. ఇవే పదాలు ఒకప్పటి ఫ్రెంచ్‌ విప్లవానికి బీజాక్షరాలు. 1789 నాటి ఆ విప్లవాన్ని శాసించిన మంత్రాలు. ఆ విప్లవ కాలంలో రక్తస్నానం చేసిన ఆ మూడు పదాలు మళ్లీ ఇప్పుడు ‘లిప్‌స్టిక్‌ పూసిన’ ఆమె పెదాల నుంచి ఒక్కసారిగా విరబూశాయి. అందరి దృష్టినీ ఆకర్షించాయి.ఆమె.. ప్రస్తుత ఫ్రెంచ్‌ అధ్యక్షుడు హోలాండ్‌ ప్రభుత్వంలో విద్య, పరిశోధన శాఖ మంత్రి. ఆ శాఖను చేజిక్కించుకున్న తొలి మహిళ.

ఆ శాఖను చూస్తున్న అతి పిన్న వయస్కురాలు. అంతేకాదు, ఫ్రాన్స్‌ మంత్రిమండలిలలో తొలిసారిగా మంత్రి అయిన ముస్లిం మహిళ.. నాజత్‌ బెలాసెమ్‌. నాజత్‌ బెలాసెమ్‌ పుట్టుకతో ఫ్రెంచ్‌ జాతీయురాలు కానేకాదు!మొరాకో నుంచి వలస వచ్చిన ఓ కుటుంబ సభ్యురాలు. మరో విశేషం కూడా ఉంది. ఆమె ఈ సంగతిని పట్టించుకుంటారో లేదో గానీ, ఇప్పుడున్న ప్రపంచ మహిళా రాజకీయవేత్తలలో ఆమె మహోన్నత సౌందర్యరాశి అని ఎన్నో పత్రికలూ, దేశాలూ ఎలుగెత్తి చాటుతున్నాయి.

కాపరి కుటుంబం!
ఎంతో ఆధునికమైన అలంకరణతో ఉండే ఖరీదైన కార్యాలయంలో నాజత్‌ ఇప్పుడు కనిపిస్తున్నారు. కానీ 1980 నాటి పరిస్థితిని విస్మరించడం బహుశా ఆమెకు అత్యంత కష్టమైన పనులలో ఒకటి కావచ్చు. ఆమె మంత్రి అయిన తరువాత కూడా తన తొలినాటి జ్ఞాపకాలు రెండేనని చెప్పారు. మొదటిది– ఇంటికి సమీపంలోని బావి నుంచి నీళ్లు మోసుకొచ్చే  తన అక్కయ్య ఫాతిమాకు సాయపడినప్పటి దృశ్యం. ఎర్రమట్టి గోడలతో ఉన్న ఇంటికి ఇద్దరు నీళ్లు తెచ్చేవారు. రెండు– గొర్రెలను కాస్తున్న తన తాతయ్యకు సాయపడిన సమయాలు.నిజమే, నాజత్‌ 1977లో ఒక గొర్రెల కాపరుల కుటుంబంలో పుట్టింది. ఒకవైపు ఎడారి, కొండలు; మరోవైపు అట్లాంటిక్‌ సముద్రం, మధ్యదరా సాగరం ఉండే మొరాకో (ఉత్తర ఆఫ్రికా) దేశంలో మారుమూల గ్రామంలో ఆ కుటుంబం ఉండేది. తండ్రి అహ్మద్‌. నిర్మాణ రంగ కార్మికుడు. వారి ఊరి పేరు నాదర్‌. ఉప్పు నీటి సరస్సుల మ«ధ్యన ఉంది. నాదర్‌ అంటే దీపస్తంభం (లైట్‌హౌస్‌). ప్రవాసుల జీవితాలు, శరణార్థుల జీవితాలు పరమ దుర్భరంగా మారిపోతున్న కాలంలో ఆ నాదర్‌ నుంచి వచ్చిన నాజత్‌ జీవితం ఈ కాలం మీద ప్రసరిస్తున్న లైట్‌హౌస్‌ వెలుగేననిపిస్తుంది. ఆమె నానమ్మ స్పెయిన్‌ నుంచి వచ్చింది. అమ్మమ్మది అల్జీరియా. 1982లో అహ్మద్‌  కుటుంబం ఉత్తర ఫ్రాన్స్‌లోని అమియన్స్‌ నగరానికి వలస వచ్చింది. తరువాత అహ్మద్‌ మరో ఐదుగురు పిల్లలకు తండ్రి అయ్యాడు. అయినా ఆమె తను వలస వచ్చిన నేలనే తన నేలగా చేసుకోగలిగింది. ఆశ్రయం ఇచ్చిన దేశపు మంత్రి మండలి సభ్యురాలైంది. ఇదే ప్రపంచాన్ని విస్మయ పరుస్తున్నది.

నిబంధనల పెంపకం
నాజత్‌ ఈ స్థాయికి చేరడం, అంత వేగంగా ఎదగడం నల్లేరు మీద నడకలా మాత్రం సాగలేదు. ఏడుగురు పిల్లలు. అందులో రెండవ సంతానం నాజత్‌. ఆమె మాత్రమే తానొక రాజకీయవేత్తను కావాలని కలగన్నది.  ఒక కాందిశీక కుటుంబం ఆమెది. తాను ముస్లిం. అయినా ఫ్రాన్స్‌లో రాజకీయంగా ఎదగాలని ఆశించింది. మామూలుగా చెప్పాలంటే ఒక జన్మలో సాకారమయ్యే కల అనిపించదు. అలాంటి కలను సాకారం చేయడానికే అడుగులు వేసింది. ముస్లిం మతాచారాలను పాటించడం లేదని నాజత్‌ మంత్రి అయిన తరువాత బాహాటంగా చెప్పుకోగలుగుతున్నారు కానీ ఆమె తండ్రి ఆ మతాచారాలతోనే పిల్లలను పెంచారు. నాజత్, ఆమె అక్క ఫాతిమాలు పాఠశాలకు వెళ్లినప్పుడు, తరువాత కళాశాలల్లో చేరినప్పుడు తండ్రి చేసిన హెచ్చరిక ఒక్కటే– మగ పిల్లలతో మాట్లాడరాదు. ఒక వయసు వచ్చిన తరువాత మరింత తీవ్రంగా అమలు చేసిన నిబంధన– నైట్‌క్లబ్‌ల కేసి చూడకూడదు.

ఫ్రెంచ్‌ నైట్‌క్లబ్‌ల బాగోతం తెలిసిన వాళ్లు ఎవరైనా ఆ ఆంక్షను సమర్థించకుండా ఉండరు. ప్రపంచ ఫ్యాషన్లకు రాజధాని వంటి ఫ్రాన్స్‌ దేశంలో యువతులను యువకులతో మాట్లాడవద్దంటే అది సాధ్యమయ్యేదేనా? చదువు మానేస్తే సాధ్యమే. కానీ నాజత్‌ తల్లి మమ్మాకు పిల్లలు చదువుకుని సొంత కాళ్ల మీద నిలబడాలన్న కోరిక బలంగా ఉండేది. నాజత్‌ రాజకీయ రంగాన్ని ఎన్నుకున్నా, ఆమె అక్క ఫాతిమా మాత్రం న్యాయశాస్త్రం చదవి, ఆ దేశంలోనే న్యాయవాదిగా స్థిరపడింది.

తొలి అవరోధం
‘నువ్వు రాజనీతి శాస్త్రం చదివి ఉద్ధరించేదేదీ ఉండదు’ అని ముందే నిరాశ పరుద్దామని చూశాడొక అధ్యాపకుడు. ప్రాథమిక విద్యను పూర్తి చేసి పారిస్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ పొలిటికల్‌ స్టడీస్‌ సంస్థలో చేరాలనుకున్నప్పుడు నాజత్‌కు ఎదురైన మొదటి అనుభవం అదే. అయినా ఆమె చేరారు. 2002లో అక్కడ దిగ్విజయంగా చదువు పూర్తి చేసి పట్టా అందుకున్నారు. ఇక్కడ ఉండగానే నాజత్‌కు బోరిస్‌ వాల్లౌడ్‌తో పరిచయం ఏర్పడి, ప్రేమగా మారింది. ఆ ఇద్దరు మూడేళ్ల తరువాత పెళ్లి చేసుకున్నారు– రహస్యంగా. ఈ మధ్యలోనే నాజత్‌ సోషలిస్టు పార్టీలో చేరి హక్కుల కార్యకర్తగా, రచయితగా ఆవిర్భవించారు. నిజానికి ప్రాథమిక విద్య పూర్తి కాకుండానే ఆమె ఫ్రెంచ్‌ భాషలో అనర్గళంగా మాట్లాడడం, రాయడం కూడా నేర్చుకున్నారామె.

హోల్లాండ్‌ అధ్యక్షుడైన తరువాత మొదట మహిళా హక్కుల మంత్రిత్వ శాఖను నిర్వహిస్తూనే, ప్రభుత్వ అధికార ప్రతినిధిగా కూడా బాధ్యతలు నిర్వర్తించారు. ఇది 2012లో జరిగింది. మరో రెండు సంవత్సరాలకు ఆమె విద్య, పరిశోధన శాఖ మంత్రి అయ్యారు. అప్పుడు నాజత్‌ ఎవరో అందరికీ గుర్తుకు వచ్చింది. ఆమె ఎక్కడ నుంచి వచ్చిందో కూడా జ్ఞప్తికి తెచ్చుకున్నారు. నాజత్‌ మతం, దానితో ఫ్రాన్స్‌కు ఉన్న వైమనస్యం – అన్నీ తవ్వితీశారు.

అందంపై కామెంట్స్‌!
నాజత్‌ మతం, మూలాలు గుర్తుకు వచ్చిన వారికి అదే సమయంలో ఆమె అందం కూడా కనిపించింది. ‘అసలు ఈవిడ విద్యా సంస్కరణల గురించి ఫ్రెంచ్‌ నేషనల్‌ అసెంబ్లీలో వెల్లువెత్తుతున్న ప్రశ్నల నుంచి తప్పించుకోవడానికి తన అందాన్ని కవచంగా చేసుకుంటున్నారు. లోనెక్‌తో ఉండే నల్లటి డ్రెస్‌ వేసుకురావడంలోని అంతరార్థం కూడా అదే. లిప్‌స్టిక్‌ పూసిన పెదవుల మీద నుంచి దరహాసాలు చిందిస్తూ జవాబులు చెప్పకుండా తప్పించుకుంటున్నారు. ఆనీహాల్‌ అనే సినిమాలో ఊడీ ఆలెన్‌ లోదుస్తు అంచును ప్రదర్శించినట్టే, నాజత్‌ కూడా ప్రదర్శిస్తూ సభ్యుల దృష్టిని మళ్లించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇలాంటి ప్రదర్శనలు ఈ పార్లమెంట్‌లో మున్నెన్నడూ లేవు’ అంటూ మితవాద వర్గానికి చెందిన పత్రికా రచయిత్రి బ్రైహెల్లీ దుమ్మెత్తి పోశారు.

ఈ ధోరణి కేవలం నాజత్‌నే విమర్శించేది కాదనీ, మొత్తం మహిళా లోకాన్నే కించపరుస్తున్నదనీ హోల్లాండ్‌ మంత్రిమండలి సభ్యులు ఎదురుదాడి చేశారు. మరోవైపు –ఫ్రెంచ్‌ సెక్యులరిజాన్ని పాఠశాలల్లో అమలు చేయడానికి చూస్తూ తమ మనోభావాలను గాయపరుస్తున్నదని ఆ దేశ ముస్లింలు నాజత్‌ మీద విమర్శలు గుప్పించారు. నిజం చెప్పాలంటే నాజత్‌ ఆ శాఖకు రాక ముందే ఫ్రెంచ్‌ ప్రాథమిక జాతి వివక్ష భావాలతో, అంతరాలతో నిండిపోయి ఉంది. దీనిని సంస్కరించడానికే ఆమె పూనుకున్నారు. అది మతవాదులకు నచ్చలేదు. అందుకే ఆమెపై ఇన్ని విమర్శలు.

పడుపువృత్తి నిర్మూలన
నాజత్‌కు ఇద్దరు కవల (మగ)పిల్లలు. అందులో ఒక అబ్బాయి 2015 జనవరి 7 న తీవ్రమైన జ్వరంతో పాఠశాలకు వెళ్లలేదు. ఉదయం పదకొండు ప్రాంతంలో పారిస్‌ కేంద్రంగా వెలువడే వారపత్రిక ‘చార్లీ హెబ్డో’ మీద ఉగ్రవాద దాడి జరిగింది. 12 మంది చనిపోయారు. దీని మీద ఫ్రాన్స్‌ మొత్తం విరుచుకుపడింది. ప్రపంచం మండిపడింది. ఇలాంటి పరిస్థితిలో మంత్రిమండలి సభ్యురాలిగా ఉన్న నాజత్‌ వంటి పరిస్థితి ఏ విధంగా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. ఇంటికి వెళ్లే సరికి టీవీలో పేలుడు అనంతర దృశ్యాలు, చావులు చూసి బిక్కచచ్చిపోయి ఉన్న కొడుకు. అక్కడితో ఆగలేదు. చార్లీ హెబ్డో మృతులకు సంతాపసూచకంగా దేశం మొత్తం ఒక నిముషం మౌనం పాటించాలని నిర్ణయించింది. దీనిని కొందరు ముస్లిం బాలురు వ్యతిరేకించారు.

అంటే నాజత్‌ మంత్రి కాక ముందే ఫ్రెంచ్‌ పాఠశాలల్లో తిష్ట వేసి ఉన్న మత వివక్షకు కూడా ఇదే నిదర్శనం. అయితే  ఎలాంటి విమర్శలు వచ్చినా నాజత్‌ వెనుకడుగు వేయలేదు. ఇలాంటి ప్రతికూల పరిస్థితి ఎదురైనప్పుడు తల్లి చెప్పిన మాటను మాత్రం ఆమె గుర్తుకు తెచ్చుకుంటారు. ‘లోకం నువ్వు అనుకున్నంత అందమైనది కాదు’ అనే మాట అది. నిజమే, లోకం అన్ని సందర్భాలలోను అందంగా ఉండదు. ఎవరు ఏమన్నా ఇప్పుడు ఫ్రాన్స్‌తో పాటు, అసలు ఐరోపా ఖండం నుంచే పడుపు వృత్తిని నిర్మూలించాలని ఆమె నాజత్‌ సమాయత్తమవుతున్నారు.

పోప్‌కే సమాధానం!
మత పరమైన విషయాలపై నాజత్‌ మీద ఎందరో దాడికి దిగారు. అయితే మొదటిగా దాడికి దిగిన వ్యక్తి సామాన్యుడు కాదు. సాక్షాత్తు పోప్‌ ఫ్రాన్సిస్‌. ఫ్రెంచ్‌ పాఠశాలల్లో నాజత్‌ జండర్‌ థియరీని బోధించేటట్టు చేస్తున్నారని పోప్‌ ఆరోపించడం కలకలమే సృష్టించింది. ‘మూర్ఖులు చెబుతున్నదంతా పోప్‌ అంతటివారు నమ్మడమే నాకు కోపాన్నీ, బాధనీ కలిగిస్తోంద’ని నాజత్‌ జవాబు చెప్పారు. విశేషం ఏమిటంటే,  ఫ్రాన్స్‌ అధ్యక్షుడు హోల్లాండ్‌ కూడా ఈ విషయంలో పోప్‌ వ్యాఖ్యలను మద్దతు ఇవ్వలేదు. సరికదా, నేను అధ్యక్ష పదవిని చేపట్టక ముందు నుంచీ నాజత్‌ నాకు తెలుసు, ఆమె అలాంటి థియరీలను ప్రోత్సహించదు అని సమర్థించారు.

మొరాకోను  మరిచిపోలేను
సిరియా నుంచి, మెక్సికో నుంచి వలసలు జరుగుతున్నాయి. సిరియా నుంచి నాటు పడవలో బయలుదేరిన కుటుంబానికి చెందిన ఎరుపు రంగు దుస్తుల చిన్నారి సముద్రపు అలలో శవమై కనిపించిన దృశ్యం ప్రపంచాన్ని కుదిపింది. ఆ బాధ నాజత్‌కు తెలుసు. కన్న ఊరునీ, దేశాన్నీ వదిలిరావడం అత్యంత బాధాకరమైన అనుభవం అంటారామె. నిజమే, నాజత్‌ కూడా మొరాకో పౌరసత్వాన్ని వదులుకోలేదు. ‘‘నేను ఫ్రాన్స్‌ని నా జన్మభూమే అనుకుంటున్నాను. రాజకీయవేత్తగా పదేళ్ల నుంచి ఫ్రాన్స్‌ సమాజం బాగునే మనసా వాచా కాంక్షిస్తున్నాను. సేవ చేస్తున్నాను. అయితే మొరాకో పౌరసత్వం ఇప్పటికీ కొనసాగించడానికి కారణం– నా మూలాలను నేను మరచిపోకుండా ఉండేందుకే’ అంటారు నాజత్‌.
– గోపరాజు నారాయణరావు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement