పరుగుల ఇమ్రాన్ తప్పటడుగులు | Cricketers Imran Khan wrong steps in the political race | Sakshi
Sakshi News home page

పరుగుల ఇమ్రాన్ తప్పటడుగులు

Published Sat, Sep 7 2013 12:35 AM | Last Updated on Sat, Mar 23 2019 8:32 PM

పరుగుల ఇమ్రాన్ తప్పటడుగులు - Sakshi

పరుగుల ఇమ్రాన్ తప్పటడుగులు

 
ఉగ్రవాదులను మెప్పించడానికి ఇమ్రాన్ చాలా శ్రమపడుతున్నారు. పాఠ్యపుస్తకాల్లో మార్పులైనా, ద్రోన్ దాడులను ఖండించడమైనా ఇందుకే. క్రికెట్ మైదానంలో పరుగులతో ఉరకలెత్తించిన ఇమ్రాన్‌ఖాన్ నియాజీ రాజకీయ క్రీడలో బుడిబుడి అడుగులూ, కొన్ని కొన్ని తప్పటడుగులు వేస్తున్నారు. జీవితంలో క్రీడాకారునిగా ఇన్నింగ్స్ పూర్తయ్యాక, ఇమ్రాన్ ప్రజాసేవకునిగా, రాజకీయ నాయకునిగా అవతరిం చారు. ఏప్రిల్, 1996లో ఆయన స్థాపించిన పాకిస్థాన్ తెహ్రీక్ ఎ ఇన్సాఫ్ (పీటీఐ) ఒకటిన్నర దశాబ్దం తరువాత 2013 మే 11న జరి గిన పాకిస్థాన్ ఎన్నికలలో మూడో అతి పెద్ద పార్టీగా నిలిచింది. కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేయలేకపోయినా, తాలిబన్, ఇతర ఉగ్రవాద సంస్థల కార్యకలాపాలతో నిత్యం వార్తలలో ఉండే కైబర్ పఖ్తున్‌ఖ్వావాలో ప్రాం తీయ ప్రభుత్వాన్ని మాత్రం ఏర్పాటు చేసిం ది. ఈ ప్రాంత విద్యాలయాలలో బోధిస్తున్న పాఠ్య పుస్తకాలలో ఉన్న దోషాలను ‘పరిహరిస్తా’మని ఆ ప్రభుత్వం పదిరోజుల క్రితమే ప్రకటించింది. ఈ నిర్ణయాన్ని సమర్థిస్తూ ఈ సెప్టెంబర్ 2న పార్టీ అధ్యక్షుడు ఇమ్రాన్ చేసి న ప్రకటన కలకలం సృష్టించిందనే చెప్పాలి. 
 
 ఏటా సెప్టెంబర్ 1న పఖ్తున్‌ఖ్వావాలో పాఠశాలలను తిరిగి తెరుస్తారు. రెండో తేదీన ఇమ్రాన్ ఈ ప్రకటన చేశారు. గతంలో పాఠ్యపుస్తకాల నుంచి తొలగించిన కొన్ని పాఠ్యాం శాలను మళ్లీ చేర్చాలన్నదే తన అభిమతమని ఇమ్రాన్ ప్రకటించారు. అందులో జీహాద్ వివరాలు కూడా ఉన్నాయి. కానీ ఇమ్రాన్ నిర్ణయాన్ని చాలా మంది ఉపాధ్యాయులు, మేధావులు వ్యతిరేకిస్తున్నారు. పఖ్తున్ ఖ్వావా ప్రాం తీయ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం చాలా విపరిణామాలకు దారితీస్తుందనీ, అక్కడి విద్యార్థుల ఆలోచనా విధానం మీద దుష్ర్పభావం చూపుతుందనీ వారు విమర్శిస్తున్నా రు. ఇందులో పెషావర్ విశ్వవిద్యాలయం ఆచార్యుడు డాక్టర్ ఫజల్ రహీమ్ మార్వాత్ ఒకరు. నిజానికి 2008లో అవామీ నేషనల్ పార్టీ ఇక్కడ ప్రాంతీయ ప్రభుత్వం ఏర్పాటు చేసినపుడు కొన్ని పాఠాలను తొలగించింది. దాని స్థానంలో ఆ ప్రాంతపు మత, సాంస్కృతిక విశిష్టతలు, కవులు, తత్వవేత్తల వివరాలు చేర్చింది. అప్పటి వరకు ఉన్న హింసను బోధించే, ఆయుధాలను గురించి వర్ణించే పాఠాలను పూర్తిగా తొలగించింది. అవన్నీ 1980 ప్రాంతంలో అఫ్ఘాన్ ఉగ్రవాదం, దాని ఆశయాల నేపథ్యంతో రూపొందించిన పాఠా లు. 2008లో వాటిని మార్చినపుడు పాఠ్యాం శాల రూపకర్తల సంఘానికి డాక్టర్ మార్వాత్ అధ్యక్షునిగా పనిచేశారు. ఇప్పటికే వేర్పాటు ధోరణులతో ఉన్న ఆ ప్రాంతంలోని పాఠశాలల్లో ఇమ్రాన్ పార్టీ చేయాలనుకుంటున్న మార్పులు అవాంఛనీయ ఫలితాలు చూపుతాయని డాక్టర్ మార్వాత్ అభిప్రాయపడ్డారు. 
 
 ఇమ్రాన్ పార్టీ ఇలాంటి మార్పుల వైపు మొగ్గక తప్పని ఒక విధానంతోనే అవతరిం చింది. ఉగ్రవాదులతో చర్చల ప్రక్రియకు పీటీఐ కట్టుబడి ఉందని ముందు నుంచీ ఇమ్రాన్ చెప్పుకుంటున్నారు. కానీ పఖ్తున్‌లో ప్రాంతీయ ప్రభుత్వం ఏర్పాటు చేసిన తరువాత ఆ మొగ్గు ఉగ్రవాదుల బుజ్జగింపు దిశగా సాగవలసివచ్చింది. దీనికి ప్రధాన కారణం పర్వేజ్ ఖట్టక్ నాయకత్వంలోని పఖ్తున్ ప్రాం తీయ ప్రభుత్వం ఎదుర్కొంటున్న ఒడిదుడుకులు. జమాత్ ఎ ఇస్లామి, కవామీ వతన్ పార్టీల మద్దతుతో సాగుతున్న ముఖ్యమంత్రి ఖట్టక్ సంకీర్ణ ప్రభుత్వం అక్కడి పరిస్థితులను చక్కబెట్టడం సంగతి అలా ఉంచితే, ముందు కుసాగే పరిస్థితిలోనే లేదు. ఈ ప్రాంతంలో మొత్తం నిఘా వ్యవస్థ ధ్వంసమైన సంగతి తెలిసిన ఖట్టక్ ప్రభుత్వం కంగుతినాల్సి వచ్చింది. అక్కడి వాస్తవ పరిస్థితుల గురించి నిజానికి ఇమ్రాన్ ప్రధానితో జరిపిన పలు సమావేశాలలో వివరించారు. అయినా ఎలాం టి చర్యలు లేవు. 
 
 అంతర్జాతీయ ఉగ్రవాదం మీద జరిపే పోరాటంలో కీలకంగా ఉన్నట్టు చెప్పుకుం టున్న పాకిస్థాన్, పఖ్తున్ ప్రాంతంలో ఉగ్రవాదంతో పోరుకు ఇప్పటికీ సరైన విధానాన్ని ఎంచుకునే సాహసం చేయలేదు. పఖ్తున్ ప్రాంత అభివృద్ధి విషయంలో అఖిలపక్ష సమావేశాలు వంటి నాన్చుడు ధోరణికే నవా జ్ ప్రభుత్వం పరిమితమైన సంగతి వాస్తవం. దీనితో నవాజ్ నాయకత్వంలోని పాకిస్థాన్ ముస్లింలీగ్(ఎన్) ప్రభుత్వాన్ని నమ్ముకోవడం కంటె ఉగ్రవాదానికి అనుకూలమైన ధోరణే మంచిదని ఇమ్రాన్ భావిస్తున్నట్టు కనిపిస్తున్నది. అందులో భాగంగానే కావచ్చు, ఆగస్టు మొదటివారంలో పాకిస్థాన్‌లో పర్యటించిన అమెరికా హోంమంత్రి జాన్ కెర్రీతో కూడా సమావేశమై పఖ్తున్ ప్రాంతంలో అమెరికా నిర్వహిస్తున్న ద్రోన్ విమానదాడులను ఆపివేయాలని ఇమ్రాన్ కోరారు. 
 
 ఎక్కువగా సాధారణ పౌరులనే బలిగొంటున్న ఈ విమాన దా డులవల్ల ఉగ్రవాదానికే బలం చేకూరుతుం దని కెర్రీతో ఇమ్రాన్ వాదించారని పత్రికలు వెల్లడించాయి. పాఠ్య పుస్తకాలలో మార్పుల యోచన కూడా ఉగ్రవాదులను మెప్పించడానికేనని రాజకీయ విశ్లేషకులు గట్టిగానే చెబుతున్నారు. దీనికి తోడు ‘యూదు ఏజెంట్’ అంటూ ఇమ్రాన్ మీద ప్రత్యర్థులు మళ్లీ ప్రచారం ప్రారంభించారు. ఇవి కాకుండా, మొన్నటి మే ఎన్నికలలో జరిగిన అవకతవకల విషయంలో సుప్రీంకోర్టు ‘సిగ్గుచేటుగా వ్యవహరించింది’ అని వ్యాఖ్యానించి, ప్రధాన న్యా యమూర్తి ఇఫ్తెకార్ చౌధురి ఆగ్రహానికి కూడా ఇమ్రాన్ గురైయ్యారు. తరువాత ఇన్సాఫ్ పార్టీ నేత వివరణ ఇచ్చినప్పటికీ ఇఫ్తెకార్ తృప్తి చెందలేదు. ఉగ్రవాదం, పేదరికం వంటి తీవ్ర సమస్యలతో తల్లడిల్లుతున్న పొరుగుదేశం పాకిస్థాన్‌లో భవిష్యత్తులో అధికారం చేపట్టే అవకాశం ఉన్న పార్టీ ప్రస్థానం ఇలా సాగడం భారత్‌ను ఆందోళనకు గురిచేసేదే. భారత్-పాక్ సంబంధాలకు అవరోధంగా ఉన్న శక్తులకు ఎంత చిన్న అండ దొరికినా పరి ణామాలు తీవ్రంగానే ఉంటాయి. ఇమ్రాన్ పార్టీ తీరు అందుకు అనుగుణంగానే ఉంది.
 - డా॥గోపరాజు నారాయణరావు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement