బాపట్ల అమెరికన్ మిషనరీ వారి ఉపాధ్యాయ శిక్షణ సంస్థకి ఆ పెద్దాయన సైకిల్ మీద వచ్చాడు, ఓ విద్యార్థిని వెతుక్కుంటూ. పేరు– చోరగుడి హనుమంతరావు. ఆనాడు ప్లీడరు గుమస్తాలంతా కలసి నిర్వహిస్తున్న నాటక సంస్థలో హరిశ్చంద్రుడి పాత్ర ధరించేవాడు. మొత్తానికి చిత్రలేఖనం తరగతిలో ఉన్న ఆ అబ్బాయిని పట్టుకుని బయటకు తీసుకొచ్చి ఆ రాత్రి ప్రదర్శించబోయే ‘సత్యహరిశ్చంద్ర’ నాటకం పాసులు నాలుగు చేతిలో పెట్టాడు. ఆపై చావు కబురు చల్లగా చెప్పినట్టు చెప్పాడు, కొన్ని గంటలలో ప్రదర్శించబోయే ఆ నాటకంలో ఒక వేషం కూడా వెయ్యాలని! ‘ఏ పాత్ర? మాతంగ కన్యా?’ అన్నాడా కుర్రాడు. అదో చిన్న పాత్ర. ‘కాదు, చంద్రమతి’ అన్నాడు హనుమంతరావు. హడలిపోయాడా కుర్రాడు.
ఒక్కసారి కూడా ముఖానికి రంగు పూసుకోలేదు. పోర్షన్ కూడా రాదు. ఎలా? వణికిపోయాడు.‘ఏం ఫర్వాలేదు. నీకు పద్యాలన్నీ వచ్చు, అది నాకు తెలుసు. అదే చాలు. మిగతా నేను చూసుకుంటా!’ అని చేతులు పట్టుకున్నంత పని చేశాడాయన. సరేననక తప్పలేదు. వెళ్లిపోతూ ఇంకోమాట కూడా చెప్పారు హనుమంతరావు, ‘ఒరేయ్ నాయనా! నువ్వు రాకపోతే ఊరి పరువుపోతుంది. ఇంక మేం తలెత్తుకోలేం. పైగా ముఖ్యఅతిథులు ఎవరో తెలుసు కదా! తిరుపతి వేంకటకవులు. వారు ప్రతి కళాకారుడినీ ఆశుకవిత్వంతో దీవిస్తారు!’ భయం భయంగా చంద్రమతి పాత్ర వేయడానికి కృత్యాద్యవస్థ మీద ఒప్పుకున్న ఆ కుర్రాడు స్థానం నరసింహారావు. అత్యంత నాటకీయంగా రంగస్థల ప్రవేశం చేసిన స్థానం నరసింహారావు (23.9.1902–21.2.1971) తరువాత మహా నటుడయ్యారు. పద్మశ్రీ బిరుదు అందుకున్నారు.
ఆయనకు అందమైన ఆకారం గాని, అవయవ సౌష్టవం గాని లేవు. అలా అని అందవికారి మాత్రం కాదు. సన్నగా పొడుగ్గా ఉండేవారు. పెద్ద పెద్ద చెవులు. పొడుగు ముక్కు. కోలముఖం. కానీ మంచి పలువరస. చామనచాయ శరీరం. తనకూ అందం ఉందని తృప్తి పడేవారు, అద్దంలో చూసుకుని. ఆకాలంలో ఫిట్స్ (చిన్నబిడ్డ గుణం అనేవారు) వచ్చిన పిల్లలకి పొగచుట్టతో నుదిటి మీద వాత పెట్టేవారు. అలాంటి మచ్చ జీవితాంతం ఉండిపోయేది. అది కూడా ఉండేది. అలాగే చెవికి పోగు. అది వంశ పారంపర్యంగా వచ్చింది. తాత తగిలించుకున్నదే తరువాత తండ్రి ఇంకొంత బంగారం వేయించి, బాగు చేయించి నరసింహారావుగారి చెవికి పెట్టారట. దీనికి తోడు ‘ముక్కునాదం’. అంటే మాట్లాడితే ముక్కుతో మాట్లాడినట్టు ఉంటుంది. కురచగా కత్తిరించిన జుట్టు, వెనకాల పిలకతో ఉండే ఆ పిల్లవాడిని తోటి పిల్లలు ఆటపట్టించేవారు. అలాంటి ఒక కుర్రవాడు స్త్రీ పాత్ర పోషణకి విఖ్యాతి గాంచాడు.
తన ఆకృతితో పాటు ప్రవృత్తితో కూడా పొసగే ఒక బృందం కోసం ఆయన అన్వేషించారు. స్థానం వారికి చిన్నతనం నుంచీ భక్తి మెండు. ఆ క్రమంలో దొరికింది ఒక భజన బృందం. నరాలశెట్టి వెంకయ్య అని ఒక తోటమాలి కొడుకు అందులో ఉండేవాడు. ఊరికి దూరంగా వారి పూలతోటలు ఉండేవి. అందులో కూలిపోతున్న ఓ పాక ఉండేది. ఈ భజన బృందం వెళ్లి ఆ పాకలో భజన చేసుకునే అవకాశం ఇవ్వాలని ఆ తోటమాలిని కోరారు. అంతా కలసి బాగు చేశారు. ప్రతి శనివారం జరిగే ఆ భజనకే సీతారాం బావాజీ అనే ఒక సాధువు తంబురాతో వచ్చేవాడు. అతడి సమక్షంలోనే మొదట రాగయుక్తంగా పాడడానికి, శాస్త్రీయంగా పాడడానికి స్థానం వారి జీవితంలో బీజం పడింది.
స్త్రీ పాత్ర విషయంలోనూ అలాగే జరిగింది. ఆయన చిన్నతనంలో కూచిపూడి భాగవతులు వచ్చి బాపట్లలో ప్రదర్శనలు ఇచ్చేవారు. అందులో వెంపటి వెంకటనారాయణ అనే ఆయన భామ వేషం అద్భుతంగా కట్టేవారట. ఆ స్త్రీ వేషం తన మనసులో ఎంతో ఆదరంతో మనసులో నిలిచి పోయి ఉండేదని చెప్పారు. ఈ దృశ్యాలన్నీ అంతిమంగా హఠాత్తుగా రంగస్థల ప్రవేశం చేయడానికి దోహదం చేశాయి. 1921లో బాపట్లలోనే తిరుపతి వేంకటకవులకీ, కొప్పరపు కవులకీ శతావధానం పోటీ జరిగింది. నెగ్గిన తిరుపతి వేంకటకవులని సత్కరించాలని భావించారు. ఆ సందర్భంగా ప్లీడరు గుమస్తాల బృందం చేత సత్య హరిశ్చంద్ర నాటకం వేయించాలని నిర్ణయించారు. ఆహ్వానాలు వెళ్లిపోయాయి. కానీ చంద్రమతి వేషధారి అస్వస్థుడై రాలేకపోతున్నట్టు చివరి నిమిషంలో తెలిసింది. ప్రత్యామ్నాయం ఏదీ సా«ధ్యం కాలేదు. చంద్రమతి పాత్రధారి మరొకరు దొరకలేదు.
మరో నాటకం వేద్దామంటే పాత్రధారులంతా లేరు. గుండెల్లో రాయి పడింది. అప్పుడే ఆపద్బాంధవుడిలా స్థానం దొరికాడు చోరగుడి హనుమంతరావుకి. వారి నాటకం రిహార్సల్స్ జరుగుతున్నప్పుడు వెళ్లి కూర్చోవడంతో పద్యాలన్నీ వచ్చేశాయి. ఒకసారి ఎవరూ లేనప్పుడు పాడుకుంటూ ఉంటే హనుమంతరావుగారు విన్నారు. ఆ ధైర్యంతోనే చంద్రమతి వేషం వేయించారు. స్థానం వారికి చిన్నతనంలోనే చిత్రలేఖనం కూడా అబ్బింది. ఆ కళతోనే, వేరే ఒకరి ఇంట రహస్యంగా తన వేషం తనే వేసుకున్నారాయన. చిన్న చిన్న లోపాలు ఉన్నా అరంగేట్రంలోనే తిరుపతి కవుల ఆశీస్సులు అందుకున్నారు స్థానం. కానీ ఇవేమీ తెలియని తల్లి, తండ్రిపోయాకా (తల్లి ఆదెమ్మ, తండ్రి హనుమంతరావు) ఇవేమి ‘అపరబుద్ధులు’ అంటూ కొడుకుని చీదరించుకుంది. చెవులు వెనుక మిగిలిపోయిన రంగు మరింత ఆగ్రహం తెప్పించిందామెకు.
దానితో ఇంకెప్పుడూ ముఖానికి రంగు పూసుకోనని హామీ కూడా ఇచ్చేశారాయన. కానీ, ఆ విష్కంభం స్వాతంత్య్రోద్యమ ఘట్టంతో తొలగిపోయింది. దుగ్గిరాల గోపాలకృష్ణయ్యగారి రామదండుకు ఆర్థికసాయం అందించాలనీ, అందుకు మళ్లీ సత్యహరిశ్చంద్ర ప్రదర్శించాలనీ అంతా నిర్ణయించారు. ప్రదర్శన చీరాలలో. కానీ స్థానం వారి తల్లి కొడుకు వేషం వేయడానికి ససేమిరా అన్నారు. చివరికి పెద్ద వకీలును రాయబారిగా పంపించి ఒప్పించారు. ఈసారి పోర్షన్ అంతా చదివి నటించారు. వెయ్యి రూపాయలు వచ్చాయి. గోపాలకృష్ణయ్యగారు కూడా ఎంతో మెచ్చుకున్నారు. కొన్ని మెలకువలు కూడా చెప్పారు. ఈ పరిణామంతో కాబోలు ఇంకొన్ని ప్రదర్శనలు ఇవ్వడానికి స్థానం వారి మాతృమూర్తి కూడా అంగీకరించారు. కొద్దినెలలకే తెలుగు ప్రాంతమంతా తిరిగి నాటకాలు వేయడం మొదలైంది.
వరంగల్‌లో ‘కృష్ణలీల’ నాటకంలో యశోద వేషం వేసినందుకు బంగారు పతకం వచ్చింది. ఆయన జీవితంలో పొందిన తొలి స్వర్ణ పతకం ఇదే. అనతికాలంలోనే ఆయన పేరు మారుమోగిపోయింది. కాపురం బాపట్ల నుంచి తెనాలికి మారింది. శ్రీరామవిలాస సభ అనే నాటక సమాజాన్ని స్థాపించి నటననే జీవికగా చేసుకున్నారు. రోషనార (రోషనార నాటకం), తామీనా (రుస్తుం సొహరాబ్ నాటకంలో), సంయుక్త (రాణీ సంయుక్త), శకుంతల (అభిజ్ఞాన శాకుంతలం), సత్యభామ (శ్రీకృష్ణ తులాభారం), చిత్రాంగి (సారంగధర), దేవదేవి (విప్రనారాయణ), కోకిల (కోకిల నాటకం), మల్లమ్మ (బొబ్బిలి), మధురవాణి (కన్యాశుల్కం), అనసూయ (అనసూయ నాటకం), మురాదేవి (చంద్రగుప్త), చింతామణి (చింతామణి), సుభద్ర (వీరాభిమన్య), సరళ (ఛత్రపతి శివాజీ), విద్యాధరి (కాళిదాసు), చండిక (చండిక నాటకం) వంటి పాత్రలు వేశారు. కానీ స్థానం వారంటే రంగస్థలం మీద సత్యభామకు మారురూపమయ్యారు.
స్థానం నరసింహారావుగారు నటనను ఒక తపస్సులా భావించారు. ఇదంతా ఆయన స్వీయచరిత్ర ‘నటస్థానం’లో అద్భుతంగా ఆవిష్కరించారు (స్థానం వారి అల్లుడు నేలకంటి వేంకటరమణమూర్తి 1974లో ఈ పుస్తకం ప్రచురించారు). నటులకు ఉండవలసిన లక్షణాలు, దర్శకునికి ఉండవలసిన ప్రత్యేకతలు, రంగస్థల కళాకారులకు ఉండవలసిన నిబద్ధత గురించి ఎన్నో విషయాలు ఆ పుస్తకంలో అద్భుతంగా ఆవిష్కరించారు. అలాగే స్త్రీపాత్రతో ఆయనకు ఎదురైన నమ్మశక్యం కానట్టు ఉండే అనుభవాలు, కొన్ని చేదు అనుభవాలను కూడా ఆయన నమోదు చేశారు. ఇవే కాకుండా తన జీవితంలో తారసిల్లిన అనేక మంది కళాకారుల గురించి స్థానం వివరించారు. ఒకరకంగా 1920వ దశకం నాటి తెలుగు నాటక రంగ చరిత్ర ఆ పుస్తకంలో కనిపిస్తుంది.
ముత్తరాజు వెంకటసుబ్బారావుగారు రాసిన శ్రీకృష్ణ తులాభారం నాటకం స్థానం వారి కీర్తిని అజరామరం చేసింది. మాధవపెద్ది వెంకటరామయ్య (కృష్ణుడు), పిల్లలమర్రి సుందరరామయ్య (నారదుడు), వంగర వెంకటసుబ్బయ్య (వసంతకుడు) పాత్రలు వేసేవారు. కృష్ణుడు తన స్వాధీనుడేనని చెప్పే ఒక సందర్భాన్నీ, అందుకు తగిన పాటనీ సత్యభామకు కూర్చడానికి స్థానం చేసిన ఆలోచన ఒక అద్భుతం. మొత్తానికి ఒక పాట ఆయన మనసుకు తట్టింది. ఒకసారి కడప దగ్గర ఈ నాటక బృందం చిన్న ఏరు దాటుతూ ఉండగా, ఒక ఎద్దుల బండి ఇసకలో కూరుకుపోయింది. నటులంతా గెంటుతున్నారు. ఒకరు మాత్రం బద్ధకంగా కూర్చున్నారు. మరొక నటుడు దీనిని స్థానం వారి దృష్టికి తీసుకువెళ్లారు. ఆ క్షణంలోనే ఆయన సరదాగా ‘మిరజాల గలడా నా యానతి’ అన్నారట. అదే గొప్ప పాటకు ప్రాణం పోసింది. ‘మిరజాలగలడా నా యానతి, వ్రతవిధాన మహిమన్ సత్యాపతి!’ అన్నదే ఆ పాట.
విశాఖజిల్లా మాడుగలలో ఒకసారి నాటకం వేశారు– శ్రీకృష్ణ తులాభారం. స్థానం వారు స్టార్ నటులు కాబట్టి ఒక ధనికుల ఇంట వేరే గది ఇచ్చి, అక్కడే వేషధారణ చేసుకుని రావడానికి ఏర్పాట్లు జరిగాయి. వేషం పూర్తయ్యాక ఇక బయలుదేరదామని అనుకుంటూ ఉండగా కరెంటు పోయింది. లోపల ఫ్యాను ఆగిపోయింది. గాలి కోసం అక్కడే ఉన్న పెరట్లో కుర్చీ వేయించుకుని కూర్చున్నారు స్థానం. అప్పుడే కొందరు ముత్తయిదువలు పేరంటం పిలుపుకోసం వచ్చారు. ఇల్లాలికి బొట్టు పెట్టి, అక్కడే కుర్చీలో కూర్చున్న సత్యభామకు కూడా బొట్టు పెట్టి పేరంటానికి పిలిచారు. ఎంతో హాస్యాన్ని పండించే వాస్తవాలను కూడా ఆయన రాశారు. ఒకసారి సురభి వారి బృందంలో సత్యభామ పాత్రధారిణికి ఇబ్బంది రావడంతో స్థానం వారిని తీసుకుని వెళ్లారు. ప్రదర్శన మొదలైంది. సత్యభామ వెళ్లి కృష్ణుడిని కౌగిలించుకోబోతే, కృష్ణుడు అమాంతం తప్పుకుంటున్నాడు.
ఇందుకు కారణం ఒక్కటే– ఆ కృష్ణ పాత్రధారి స్త్రీ. కాబట్టి స్థానం వారు వెళ్లి కౌగిలించుకున్నా బెదిరిపొయింది. అలాగే, పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో రోషనార నాటక ప్రదర్శనకు కలెక్టర్ అనుమతి నిరాకరించాడు. అందుకు కారణం– ఆ నాటక ప్రదర్శనకు కొందరు ముస్లింలు వ్యతిరేకత వ్యక్తం చేశారు. దీనితో గోదావరి దాటి తూర్పుగోదావరిలోని లంకలలో ఆ నాటకం ప్రదర్శించారు. స్థానం వారికి జరిగిన సత్కారాలకు లెక్కలేదు. 1956లో ఆయనకు కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ బిరుదు ఇచ్చింది. రంగూన్‌లో బంగారు కిరీటంతో అలంకరించారు. ఆనాటి మహా కవులు, రచయితలు అంతా ఆయనను అక్షరాలతో సత్కరించారు. స్థానం వారి ప్రత్యేకతను చరిత్ర విస్మరించలేదు. కన్నతల్లి ఆయనకు పురుష జన్మనిచ్చింది. కళామతల్లి స్త్రీ జన్మనిచ్చింది.
- డా. గోపరాజు నారాయణరావు
Comments
Please login to add a commentAdd a comment