
వలస భారతంలో కొత్తపర్వం
గ్రామాల నుంచి చిన్న పట్టణాలకీ, చిన్న పట్టణాల నుంచి పెద్ద పట్టణాలకీ, ఇక్కడ నుంచి నగరాలకీ మహా నగరాలకీ వలసలు జరుగుతున్నాయని కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి జైరామ్ రమేశ్ ఇటీవల చెప్పారు. 2001 సంవత్సరం లెక్కల ప్రకారం దేశంలో 309 మిలియన్ల మంది వలసలు పోయారు.
అభివృద్ధి గమనంలో వ్యవస్థ రూపం మార్చుకుంటుంది. కొన్ని స్థిరమైన అభిప్రాయాల నుంచి ప్రజలు బయటపడడానికి కూడా అది మార్గం చూపిస్తుంది. ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి వలస వెళ్లడం అలాంటిదే. ప్రస్తుతం వలసలు పోవడానికి కారణం కరవు కాటకాలో, పంటలు ధ్వంసం కావడమో, వృత్తుల విధ్వంసం వల్లనో జరుగుతున్నాయని అనుకోవడం పాక్షిక సత్యమే. ఈ మధ్య వెలువడిన కొన్ని నివేదికలు, సర్వేల ప్రకారం, ప్రస్తుతం వలసలంటే జీవన భృతికి సంబంధించిన వ్యూహం. కేవలం ‘పొట్ట చేతపట్టుకుని’ వెళ్లడం కాదు. అది ఆర్థికాభివృద్ధినీ, సామాజికాంశాలను ప్రభావితం చేస్తున్న పార్శ్వం. భారతదేశంతో పాటు చాలా ప్రపంచ దేశాలు ఈ దశలోనే ఉన్నాయి.
యునెస్కో, యునిసెఫ్ 2011లోనే ఇంటర్నల్ మైగ్రేషన్ ఇన్ ఇండియా ఇనిషియేటివ్ పేరుతో ఆ అంశం మీద అధ్యయనం ప్రారంభించాయి. యుఎన్ ఉమెన్, యుఎన్ హాబిటేట్ వంటి సంస్థలు కూడా పాలు పంచుకుంటున్నాయి. ఈ అక్టోబర్ మధ్యలో యునెస్కో విడుదల చేసిన ఒక నివేదిక ప్రకారం (2008లో జరిపిన ఒక సర్వే మేరకు) దేశ జనాభాలో 30 శాతం వలసలు పోయినవారే. వీరిలో ఎక్కువ మంది 15-29 సంవత్సరాల మధ్య వయస్కులే. అంటే 326 మిలియన్లు వలసదారులే. ఇంకా విశేషం, వలసలు పోతున్న వారిలో 70 శాతం మహిళలు. మెట్రోపాలిటన్ నగరాలలో నివశిస్తున్న ప్రతి పది మందిలో ముగ్గురు వలస వచ్చినవారే. కొన్ని నివేదికలు వలసలు పోతున్న వారిని రెండు రకాలుగా విభజిస్తున్నాయి- పొట్టకూటి కోసం వెళ్లినవారు, మెరుగైన జీవితాన్ని వెతుక్కుం టూ వెళ్లినవారు.
ఇంకొన్ని అధ్యయనాలు పని/ఉద్యోగం, వ్యాపారం, చదువులు, పెళ్లి, అక్కడే స్థిరపడిన వారి సంతా నం, కుటుంబాలతో వెళ్లిపోవడం వంటి కారణాలు కూడా వలసలకు మూలమని చెబుతున్నాయి. పంటచేలు బీడు పడిపోయిన మారుమూల గ్రామాల నుంచి నేరుగా నగరాలకో, పట్టణాలకో వలసలు పోవడం లేదు. గ్రామాల నుంచి చిన్న పట్టణాలకీ, చిన్న పట్టణాల నుంచి పెద్ద పట్టణాలకీ, ఇక్కడ నుంచి నగరాలకీ మహా నగరాలకీ వలసలు జరుగుతున్నాయని కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి జైరామ్మ్రేశ్ ఇటీవల చెప్పారు. 2001 సంవత్సరం లెక్కల ప్రకారం 309 మిలియన్ల మంది వలసలు పోయారు. 1991 సంవత్సరం లెక్కల ప్రకారం చూస్తే వలసలు 37 శాతం పెరిగాయని అర్థమవుతుంది. 1991లో 226 మిలి యన్ల మంది దేశంలో ఒక చోట నుంచి వేరొకచోటికి వలసపోయినట్టు తెలుస్తుంది. ఇందులో మళ్లీ 87 శాతం తమ సొంత రాష్ట్రాలలోనే ఒక చోట నుంచి ఇంకొక చోటికి వలసపోతున్నారు. 13 శాతం మాత్రం ఇరుగుపొరుగు రాష్ట్రాల వైపు చూస్తున్నారు.
దేశం సమగ్రాభివృద్ది వైపు త్వరితగతిన పురోగమిస్తోన్న సంగతి కూడా కొన్ని నివేదికలు చెబుతున్నాయి. 1990 తరువాత వచ్చిన పరిణామాలతో ఆర్థికవ్యవస్థలో అభివృద్ధి కనిపిస్తుంది. దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న వారి సంఖ్య కొంత తగ్గింది. తలసరి వినియోగం కూడా పెరి గింది. ఇప్పటికీ భారత్ వ్యవసాయమే ప్రధాన వృత్తిగా ఉన్న దేశమే అయినా, ఆ రంగం మీద ఆధారపడుతున్న వారి సంఖ్య పడిపోయింది. అయితే వ్యవసాయరంగంలో చోటు చేసుకున్న ఈ పరిణామం ఇతర రంగాలలో ఉద్యోగావకాశాలు పెరిగిన సంగతిని రుజువు చేస్తోందని నిపుణులు చెబుతున్నారు. సుదీర్ఘ చరిత్ర కలిగిన భారతదేశానికి ఇదొక సంధి దశ. ఈ దశలో వలసలు అనూహ్యం కా దు. నిజానికి వలసలు ఏ దేశానికైనా, ఏ కాలంలోనైనా కొత్త కాకపోయినా ప్రస్తుత పరిణామాలు ప్రత్యేకమైనవి.
ఈ దశలో ప్రభుత్వం నిర్వహిస్తున్న పాత్ర ఎలాంటిది? వలసల మీద ప్రభుత్వం దృష్టి పెట్టవలసిన కోణం ఏది అంటే వెంటనే సమాధానం దొరకదు. వ్యవసాయానికి తగిన ప్రోత్సాహం లేదు. కాబట్టే వలసలు పెరుగుతున్నాయి. అలా అని వ్యవసాయానికి ఇచ్చే ఆ కొద్దిపాటి కేటాయింపులు మానడం సాధ్యం కాదు. గ్రామీణాభివృద్ధి కోసం రూపొందించిన పథకాలు ఆశాజనకంగానే ఉన్నాయని ఎవరూ అనలేరు. ఏమైనా అంతర్రాష్ట్ర వలసలు పెరిగాయి, అది మంచికోసమేనని నిపుణులు చెబుతున్నారు. దీనిని ప్రోత్సహించకపోయినా, ఆపాలని ప్రయత్నించడం మంచిది కాదన్న వాదన కూడా ఉంది. కానీ నగరాలలో వలసల కారణంగా వస్తున్న సమస్యల మాటేమిటన్నది ఇప్పుడు అందిరి ముందు ఉన్న పెద్ద ప్రశ్న. ఏ విధంగా చూసినా సమీప భవిష్యత్తులో వలసల మీద గట్టి విధానాన్ని రూపొందించుకోవడం అనివార్యమే అవుతుంది.
డాక్టర్ గోపరాజు నారాయణరావు