నేపాల్‌కు సాగిన ‘డ్రాగన్’ నాలుక | Nepal Police Arrest Tibetans For 'Anti-China Activity' | Sakshi
Sakshi News home page

నేపాల్‌కు సాగిన ‘డ్రాగన్’ నాలుక

Published Thu, Mar 13 2014 12:22 AM | Last Updated on Sat, Sep 2 2017 4:38 AM

నేపాల్‌కు సాగిన ‘డ్రాగన్’ నాలుక

నేపాల్‌కు సాగిన ‘డ్రాగన్’ నాలుక

టిబెట్ మారుమూల ప్రాంతాలలో కూడా ప్రవేశించడానికి ఈ మార్గం చైనాకు వీలు కల్పిస్తుంది. ఇది ఇంతటితో ఆగుతుందంటే ఎవరికీ నమ్మకం కలగడం లేదు. చైనా ధోరణి, గతానుభవాలు ఇందుకు కారణం.
 
 మన పొరుగు బడుగు దేశం టిబెట్ రాజకీయ భవితవ్యం, రూపురేఖలు మారిపోయే రోజు దగ్గరలోనే ఉంది. క్వింఘాయ్-టిబెట్ రైల్వేమార్గాన్ని నేపాల్ సరిహద్దులలోని షిగాట్సే పట్ట ణం వరకు విస్తరించే ప్రణాళిక త్వరలోనే పూర్తి కాబోతోందని ఈ మధ్య చైనా ప్రకటించింది. గంటకు 120 కిలోమీటర్ల వేగం తో సాగే రైళ్ల కోసం చేపట్టిన విస్తరణ ప్రణాళిక ఇది. అక్టోబర్‌లో పూర్తి కాబోయే ఈ మార్గం వల్ల లాషా నుంచి టిబెట్ అవతలి (నేపాల్ వైపు)అంచులకు చేరుకోవడానికి ఐదు గంటలు పట్టే ప్రయాణం రెండు గంటలకు తగ్గుతుంది. ఈ ప్రకటన, ఈ ప్రణాళిక వెనుక ఉద్దేశాన్ని కొంచెం గమనించినా టిబెట్ రూపురేఖలు అనూహ్యంగా ఉండబోతున్నాయని గట్టిగా చెప్పవచ్చు.
 
 ఈ రైలు మార్గం ఉద్దేశం అభివృద్ధేనని చైనా చెబుతున్నది. కానీ టిబెట్ మారుమూల ప్రాంతాలలో కూడా ప్రవేశించడానికి ఈ మార్గం చైనాకు వీలు కల్పిస్తుంది. ఈ మార్గం ఇంతటితో ఆగుతుందంటే ఎవరికీ నమ్మకం కలగడం లేదు. చైనా ధోరణి, గతానుభవాలు ఇందుకు కారణం. ఈ రైలు మార్గాన్ని మరి కొంత విస్తరించి, నేపాల్ రాజధాని కఠ్మాండు వరకు విస్తరించడానికి ఆర్థిక సాయం చేయదలచినట్టు చైనా సంకేతాలు ఇచ్చిం ది. నేపాల్ కూడా ఆసక్తి చూపుతోంది. కానీ భారత్‌కు ఉండే అభ్యంతరాల వల్ల ఆచితూచి వ్యవహరిస్తున్నది.
 
 షిగాట్సే పట్టణాన్ని లక్ష్యంగా చేసుకుని రైలు మార్గం పొడిగించడంలోనే చైనా వ్యూహాత్మక దృష్టి బయటపడుతోంది. ఇది టిబెట్, నేపాల్ సరిహద్దులలో ఉంది. తషీల్‌హ్యునోప్ బౌద్ధ మ ఠం ఇక్కడిదే.  నిజానికి ఇది మంచి యాత్రాస్థలం. పంచన్ లామాల ప్రధాన పీఠం. పదకొండో పంచన్‌లామా గియాన్సినా నొర్బు చైనా మద్దతుదారు. గెలుగ్పా అనే బౌద్ధ తెగకు (టిబెట్‌లో రెండో పెద్ద తెగ) ఈయనే ఆధ్యాత్మిక గురువు. అంటే దలైలామా తరువాత పెద్ద ఆధ్యాత్మిక గురువు ఇతడే.
 
 వీటికితోడు నేపాల్ చైనా వైపు మొగ్గుతున్న సూచనలు ఇటీవల కాలంలో నిగ్గు తేలుతున్నాయి. టిబెట్ సరిహద్దులలోని టాటాపోనీ అనే పట్టణంలో రవాణా కేంద్రం ఏర్పాటు చేసుకోవడానికి ఆ రెండు దేశాల మధ్య అవగాహన కుదిరింది. ఇది చైనా నిర్మిస్తున్న రైలు మార్గానికి ఉపకరించేదే. మొన్న జనవరిలో చైనా ప్రధాని వెన్ జియాబావో నేపాల్‌లో పర్యటించినపుడు రైలు మార్గం నేపాల్ వరకు విస్తరించడం గురించి చర్చ జరిగింది.
 
 1959 నుంచి భారత్‌లోనే ప్రవాస ప్రభుత్వం నడుపుతున్న దలైలామా చైనా ఆధిపత్యం గురించి  ఇటీవల చేసిన ప్రకటన కూడా ముఖ్యమైనదే. స్వయం ప్రతిపత్తితో చైనాలో అంతర్భాగంగా ఉండడానికి టిబెట్‌కు అభ్యంతరం లేదని ఆయన ప్రకటించారు. కానీ కమ్యూనిస్టుల మీద ఆయన నిప్పులు చెరిగారు. అయితే చైనా ప్రభుత్వానికీ, పార్టీకీ మధ్య విభజన రేఖ ఎంత పలచనో దలైలామాకు తెలియనిది కాదు.  నిజానికి టిబెట్‌కు సంపూర్ణ స్వాతంత్య్రం కోసం జరుగుతున్న ఉద్యమానికి ఆయ న ఎప్పుడూ మద్దతుదారు కాదు. దలైలామా నాయకత్వంలోని తెగతో పాటు,  టిబెట్ బౌద్ధులలో రెండో పెద్ద తెగ గెలుగ్పాలు కూడా చైనాకు దగ్గరైన సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.
 
 రైలు మార్గ విస్తరణ పథకాన్ని చైనా రహస్యంగా సాగించడం లేదు. టిబెట్ మీదుగా భారత సరిహద్దులలోని రెండు పట్టణాల వరకు ఈ రైలు మార్గం విస్తరించే యోచన ఉన్నదని 2012లో చైనా ప్రక టించింది. అలాగే నేపాల్‌కు కూడా ఈ రైలు మార్గం విస్తరింప చేసే అవకాశం ఉందని ఎలాంటి శషభిషలు లేకుండానే చైనా అధికారులు అప్పుడే ప్రకటించారు. అంతకుముందే, 2011 డిసెంబర్‌లో సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షులు ములాయం సింగ్ ఈ విషయం మీద మన ప్రధానిని పార్లమెంటులో నిలదీశారు. ఇండియా మీద దాడికి చైనా సన్నాహాలు చేస్తున్నదని ములాయం సూటిగానే హెచ్చరించారు.
 
 కొన్ని సరిహద్దు వివాదాలు ఉన్నప్పటికీ చైనా దాడికి దిగుతుందని భావించడం లేదని ప్రధాని సమాధానం ఇచ్చారు. చైనా కదలికల మీద భారత్ నిఘా ఉందని రక్షణ మంత్రి ఆంటోనీ కూడా చెప్పారు. చిత్రం ఏమిటంటే 1962 నాటి చైనా దాడికి ముందు ప్రథమ ప్రధాని నెహ్రూ కూడా ఇలాంటి సమాధానమే ఇచ్చారు. రైలు మార్గాలు సరుకులు, ప్రయాణికుల రవాణాకే కాదు, సైనికులను వేగంగా తరలించడానికి ఉపయోగపడతాయని ప్రపంచమంతటికీ తెలుసు. కనీసం దీనినైనా మన నేతలు గుర్తించాలి. టిబెట్ భవితవ్యం మారిపోతే దాని ప్రభావం మొదట పడేది భారత్ మీదనే.    
 - డాక్టర్ గోపరాజు నారాయణరావు

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement