
‘జోకరు’గా మారిన యువరాజు
తొమ్మిదోసారి ఎంపీగా ఎన్నికైన కమలనాథ్ వ్యాఖ్య మరీ చిత్రం. ఈ ఓటమికి రాహుల్‌ను, సోనియాను బాధ్యులను చేస్తే రౌరవాది
నరకాలూ పట్టి పోతారన్నట్టు మాట్లాడారాయన. ఎందుకంటే, ఆ ఇద్దరూ కూడా యూపీఏ-2లో సభ్యులు కారట.
రాజును మించిన రాజభక్తి పరాయణులకు ఘనత వహిం చిన భారత జాతీయ కాంగ్రెస్‌లో లోటు లేదు. మొన్న జరి గిన సాధారణ ఎన్నికలలో ఎంతో పొదుపుగా 44 లోక్‌సభ స్థానాలను మాత్రమే గెలిచినా అధిష్టానం మీద పల్లెత్తు మాట పడనివ్వకుండా కాపాడుతున్న విధేయుల దండును చూస్తే ఇదే అనిపిస్తుంది. ఈ ఓటమికి కడుపు మండి కొంద రు అధిష్టానం మీద విమర్శలు సంధించారు. తిరుగుబాటుదారులంతా ముక్తకంఠంతో చెబుతున్న మాట - రాహుల్‌గాంధీ కాంగ్రెస్ పార్టీకి భారంగా మారిపోయారు. ఇక, విధేయులు చెబుతున్న మాటలలో, రాహుల్ పార్టీకి భారమే కావచ్చు, అయినా మోయక తప్పదన్న ధ్వనే ఉంది.
కేరళలో కాంగ్రెస్ పార్టీ మంచి ఫలితాలనే సాధించింది. అక్కడ 20 లోక్‌సభ స్థానాలకు, కాంగ్రెస్ నాయకత్వంలోని యూడీఎఫ్ కూటమి 12 స్థానాలు కైవసం చేసుకుంది. కానీ రాహుల్, సోనియాలు కుదేలైపోయే రీతిలో ఆ రాష్ట్ర కాం గ్రెస్ పార్టీ శాఖ నుంచే తీవ్ర వ్యాఖ్య వచ్చింది. టీహెచ్ ము స్తాఫా అనే సీనియర్ నాయకుడు రాహుల్‌ను ‘జోకర్’ అని అభివర్ణించి సంచలనం సృష్టించారు. కరుణాకరన్ మంత్రివర్గ సభ్యుడైన ముస్తాఫా ఈ ఎన్నికలలో కాంగ్రెస్ అపజయానికి కారణం రాహుల్ గాంధీయేనని కుండబద్దలు కొట్టారు. ‘ఆయన (రాహుల్) పార్టీకి రాజీనామా చేసి తీరాలి. ఆయన ఇంక ఎంతమాత్రం కొనసాగడానికి వీల్లేదు. ఆయనకు ఆయనే స్వచ్ఛందంగా రాజీనామా చేయకుంటే, తొలగించాల్సిందే. ఆయన ఒక జోకర్‌లా (ఎన్నికల ప్రచారంలో) ప్రవర్తించారు. ఇలాంటి ప్రవర్తన ఎన్నికలలో విజయానికి ఉపకరించదు’ అని ముస్తాఫా వివరించారు. ఇక ఒక్క స్థానం కూ డా గెలుచుకోని రాష్ట్రానికి చెందిన నేతలకు ఇంకెంత కడుపు మంట ఉండాలి? ఈ ప్రశ్నకు సమాధానం రాజస్థాన్ నుంచి వచ్చింది. రాజస్థాన్‌కు చెందిన కాంగ్రెస్ శాసనసభ్యుడు భన్వర్‌లాల్ శర్మ ఇంకో అడుగు ముందుకు వేసి, ‘ఆయన చుట్టూ ఉన్నవాళ్లంతా జోకర్లే. ఆ జోకర్ల బృందానికి రాహుల్ ఎండీ’ అని ఇంకాస్త తీవ్రమైన విసురు విసిరారు.
ఆ ఇద్దరినీ ఆలస్యం లేకుండా బయటకు పంపారు. కానీ ఈ వ్యాఖ్యలకు పార్టీలో మేధావి ముద్రాంకితుడు మణిశంకర్ అయ్యర్ ఇచ్చిన వివరణ నిజంగా రాహుల్‌కీ, సోనియాకీ మద్దతుగా ఇచ్చినదా? లేక, పార్టీ ఓడితే అందుకు బాధ్యత వహించడం, పదవులకు రాజీనామా చేయడం వంటి సత్సం ప్రదాయాలు ఈ పార్టీకి ఎప్పుడున్నాయి గనక? అని ఎత్తి పొ డవడానికా అన్నట్టే ఉంది. ‘ఇందిర, రాజీవ్, పీవీ హయాం లలో కూడా పార్టీ ఓడిపోయింది. అప్పుడు నాయకత్వ మా ర్పు ్రపశ్నే రాలేదు’ అన్నారాయన. తొమ్మిదోసారి ఎంపీగా ఎన్నికైన కమలనాథ్ వ్యాఖ్య మరీ చిత్రం. ఈ ఓటమికి రా హుల్‌ను, సోనియాను బాధ్యులను చేస్తే రౌరవాది నరకాలూ పట్టి పోతారన్నట్టు మాట్లాడారాయన. ఎందుకంటే, ఆ ఇద్ద రూ కూడా యూపీఏ-2లో సభ్యులు కారట. అంటే ఓటమికి బాధ్యతంతా మన్మోహన్‌సింగ్ నెత్తిన పెట్టా రు కమలనాథ్.
ముస్తాఫా, భన్వర్‌లాల్‌ల వ్యాఖ్య కాస్త కటువుగానే ఉం ది. కానీ ఇదే విషయాన్ని చాలా సున్నితంగా, సుతిమెత్తగా చెప్పిన నాయకులూ ఆ పార్టీలోనే ఉన్నారు. మన రాష్ట్రానికి చెందిన కిశోర్‌చంద్రదేవ్, మహారాష్ట్రకు చెందిన మిలింద్ దేవ్‌రా, ప్రియాదత్ రాహుల్ నాయకత్వ లోపం గురించి హుందాగా వ్యాఖ్యానించారు. నిజానికి ఇది చాలామంది కాంగ్రెస్ నేతల మనసులలో దాగి ఉన్న అభిప్రాయమే. కాంగ్రెస్ ఓటమి నుంచి అధిష్టానం గుణపాఠం నేర్చుకోవాలని కిశోర్‌చంద్ర అభిప్రాయపడ్డారు. అదే సమయంలో రాహుల్ చేసిన ప్రయోగాలు, సంస్కరణలు ఎదురు తిరిగాయన్న విషయాన్ని కూడా ఆయన అంగీకరించక తప్పలేదు.
యువనేత అంటూ కాంగ్రెస్ రాహుల్‌ను ఆకాశానికెత్తిం ది. కానీ ప్రధాని అభ్యర్థిగా ప్రకటించలేకపోయింది. ఆయన యువనేత పాత్రను కూడా నిర్వహించలేకపోయారు. భారతదేశ యువత రాహుల్‌ను తిరస్కరించిందని ప్యాట్రిక్ ఫ్రెంచ్ (ప్రఖ్యాత చరిత్రకారుడు. లిబర్టీ ఆర్ డెత్: ఇండియాస్ జర్నీ టు ఇండిపెండెన్స్ అండ్ డివిజన్; ది వరల్డ్ ఈజ్ వాట్ ఇటీజ్ అండ్ ఇండియా: ఏ పోర్ట్రెయిట్ పుస్తకాల రచయిత) వ్యాఖ్యానించడం విశేషం. 18-22 వయస్కులైన వారంతా మోడీవైపే మొగ్గారు. మా కుటుంబం అధికారంలో ఉండి ఉంటే, అయోధ్యలో మసీదు కూలేదికాదని రాహుల్ వ్యాఖ్యానించినపుడే ఆయన పార్టీకి ఎంత భారంగా మారిపోయారో గుర్తించి ఉండవలసింది. రాహుల్ కాంగ్రెస్ పార్టీ గౌరవం కంటె, ఆ పార్టీ నుంచి ఎన్నికైన ప్రధానుల మర్యాద కంటె తన కుటుంబాన్నే మిన్నగా చూస్తున్నారు. ఇలాంటి వ్యక్తి పార్టీకి భారం కాక, నడిపించగల నేత ఎలా అవుతారు?
డాక్టర్ గోపరాజు నారాయణరావు