
పన్నెండంకెల ప్రహేళిక
చరిత్రకారుల మాటేమోగానీ, ఇన్ని శతాబ్దాలు గడిచినా భారతీయులు తుగ్లక్‌ని మరచిపోకుండా చేయడంలో ప్రభుత్వాధిపతులు యథాశక్తిన ప్రయత్నిస్తూనే ఉన్నారు. ఆధార్ కార్డుల వ్యవహారమే ఇందుకు తాజా ఉదాహరణ. 2009లో యూపీయే-2 ఆర్భాటంగా ఆరంభించిన ఆధార్ కార్డుల పథకం ఒక ప్రహసనంగా మారిపోయింది. సాక్షా త్తు భారత అత్యున్నత న్యాయస్థానమే ఆధార్ విషయం లో కేంద్ర ప్రభుత్వ పనితీరును తప్పుపట్టింది. స్పష్టతే లేని ఈ పథకాన్ని ప్రపంచంలో వినూత్నం అంటూ యూపీయే దంబాలు పలికింది. యూపీయే ఘనంగా ప్రారంభించిన ఈ పథకం పౌరుల ప్రాథమిక హక్కులకు భంగకరంగా పరిణమించిందంటూ దాఖలైన ప్రజా ప్రయోజనాల వ్యాజ్యాన్ని సుప్రీంకోర్టు మన్నించింది.
ఆధార్ కార్డుకు ఆకృతి ఇచ్చిన యూపీయే సిద్ధాంత శిల్పుల మాటకీ, రాష్ట్ర ప్రభుత్వాలు దానిని ఆచరణలో పెడుతున్న తీరుకీ, అసలు ‘ఆధార్’ సూత్రధారి యునీక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా వివరణకీ పొం తన కనిపించదు. ఈ సంస్థ చైర్మన్ నందన్ నిలేకని ఏప్రిల్ 23, 2013న అమెరికాలో ఆధార్ సాధించిన ప్రగతి గురిం చి కాస్త ఎక్కువగానే చెప్పారు. 120 కోట్ల భారత జనాభాలో ఇంతవరకు 380 మిలియన్లకు ‘కార్డు’ చేరిపోయిందని చెప్పుకున్నారు. వచ్చే ఏడాదికి 600 మిలియన్లకు చేరుతుందని ఘంటాపథంగా చెప్పారు కూడా. ఆ లెక్కల నిజమైతే సెప్టెంబర్ 24, అక్టోబర్ 8 తేదీలలో సుప్రీంకోర్టు అంత కరాకండీగా తీర్పు ఇవ్వవలసిన అవసరం వచ్చేది కాదు. ఈ వ్యాజ్యం దాఖలు చేసిన కేఎస్ పుట్టుస్వామి (ఆంధ్రప్రదేశ్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్, ఏపీ వెనుకబడిన తరగతుల కమిషన్‌ల చైర్మన్ పదవులు చేపట్టారు) కూడా న్యాయ నిపుణుడే. ఆధార్ వ్యవహారం ఎంత అథమస్థాయిలో ఉందో కర్ణాటక హైకోర్టు మాజీ న్యాయమూర్తి పుట్టుస్వామి అత్యున్నత న్యాయస్థానానికి నివేదించారు. జస్టిస్ వీఆర్ కృష్ణయ్యర్ వంటి పదిహేడు మంది భారతీయ ప్రముఖులు వ్యక్తం చేసిన అభ్యంతరాలను కూడా సుప్రీంకోర్టు పరిగణనలోనికి తీసుకుంది.
ప్రభుత్వ సంక్షేమ పథకాలకు ఆధార్‌తోనే అర్హత కల్పించడం ప్రభుత్వ ఉద్దేశం. జననీ సురక్ష యోజన, విద్యార్థి వేతనాలు, పింఛన్లు, ప్రజా పంపిణీవ్యవస్థ, ఎల్‌పీజీ, మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణాభివృద్ధి పథకంలో భాగస్వామ్యం- వీటన్నిటినీ ఆధార్‌తో అనుసంధానం చేయడమే ధ్యేయంగా ప్రభుత్వం పనిచేస్తోంది. ఇందుకోసం యునీక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా పన్నెండు అంకెల ముద్ర (యునీక్ ఐడెంటిఫికేషన్ నెం బర్)ను ప్రసాదిస్తుంది. దీనినే సుప్రీంకోర్టు ధర్మాసనం ఏకగ్రీవంగా తిరస్కరించింది. ఏ సంక్షేమ పథకానికైనా ఈ ఆధార్‌ను ప్రాతిపదికగా లేదా అనివార్యంగా చేయవద్దని కేంద్రాన్ని, రాష్ట్ర ప్రభుత్వాలను కూడా ఆదేశించింది.
పెళ్లిళ్ల రిజిస్ట్రేషన్‌కీ, చావుపుట్టుకలకీ మహారాష్ట్ర వంటి కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ఆధార్‌ను అనివార్యం చేశాయి. లెసైన్సులకు ఆధార్ కావాలని పంజాబ్ అంటే, ఆ రాష్ట్ర హైకోర్టు కలగచేసుకోవలసి వచ్చింది. కానీ బెంగాల్ శాసనసభ మాత్రం ఆధార్‌కు వ్యతిరేకంగా తీర్మానం ఆమోదించే పనిలో ఉంది. నిజానికి చాలామందికి ఈ కార్డులు రాలేదు. పెళ్లి రిజిస్టర్ కాకపోతే ఆ కాపురానికి చట్టబద్ధత ఉండదు. అలాంటప్పుడు చ ట్ట పరిధి లేని ఈ కాపురాన్ని ఏమనాలని కొందరు ప్రశ్నిస్తున్నారు. ఆధార్ లేదు కాబట్టి వారి కాపురం చట్టబద్ధం కాలేదా? ఒక పక్క ప్రధాని కార్యాలయంలో విధానాల రూపకల్పనలో కీలకంగా ఉండే మాంటెక్ సింగ్ అహ్లూవాలియా కూడా ఆధార్ అధికార పత్రం కాలేదనే అన్నారు.
ఆధార్‌ను అక్రమ వలసదారులకు ఇవ్వవద్దని సుప్రీం ఆదేశించింది. ఒకరు ప్రతిపాదిస్తే వేరొకరికి ఈ కార్డు ఇవ్వవచ్చునన్న నిబంధన వల్ల ఎందరో బంగ్లా చొరబాటుదారులకు కార్డులు వచ్చిన సంగతిని సుప్రీం గుర్తు చేసింది. అంతేకాదు, ఆధార్‌కు కీలకమైన ఐరిస్ తదితర పరీక్షలు చేసే సిబ్బందికి సరైన అర్హతలే లేవంటూ వ్యాజ్యంలో పేర్కొన్న అంశాన్ని కూడా అత్యున్నత న్యాయస్థానం సమర్థించింది. ప్రమాణాల లేని మౌలిక వ్యవస్థతో ఈ ‘కార్డు’ జాతీయ భద్రతకు కూడా భంగకరంగా పరిణమించిన సం గతిని కూడా అత్యున్నత న్యాయస్థానం గుర్తు చేసేవరకు ప్రభుత్వానికి తెలియలేదు. ఇది ఈ దశాబ్దపు వింత. పథకాలు ఎన్నికలలో లెక్క చెప్పడానికి కాదు, అవి ప్రజల ఇక్కట్లు తీర్చేవి కావాలి.
డా॥గోపరాజు నారాయణరావు