
మండేగుండెల జెండా మండేలా
నివాళి: ‘నా విధికి నేనే నిర్దేశకుడిని... నా ఆత్మకు నేనే నావి కుడిని’... నలిగిన చిత్తుకాగితం మీద రాసుకుని దాచుకున్న ఆ కవిత ఒక మహోన్నత ఉద్యమకారుడిని చరి త్రపుటలలో నిలబెట్టింది. ప్రపంచం మొత్తం ఇష్టపడే అరుదైన రాజనీతిజ్ఞుడిని శిల్పించింది. విలియం ఎర్నెస్ట్ హెన్లీ రాసిన ఆ లాటిన్ కవిత ఇచ్చిన ఆత్మస్థయిర్యంతో ఆయన 27 ఏళ్ల సుదీర్ఘ కఠిన కారాగార క్లేశాన్ని అధిగమించగలిగాడు. ఆ కవిత పేరు ‘ఇన్విక్టస్’. అంటే జయించ సాధ్యం కానిది. నిజమే- నెల్సన్ రొలిహాహ్లా మండేలా (జూలై 18, 1918-డిసెంబర్ 5, 2013) అనితరసాధ్యమైన వాడు. ఇరవయ్యో శతాబ్దం మధ్య వరకు కనిపించిన ప్రపంచస్థాయి నేతల కోవలోని వాడు మండేలా. ‘మా దేశం ఓ ముద్దుబిడ్డను కోల్పోయింది.
మా ప్రజలు తండ్రివంటివాడిని కోల్పోయారు’ అంటూ మం డేలా మృతి ప్రకటనలో దక్షిణాఫ్రికా అధ్యక్షుడు ఘన నివాళి ఘటించడం తిరుగులేని వాస్తవం. ఇంకొకటి- ఆయన ప్రపంచ మిత్రుడు కూడా. మన ప్రభుత్వం ఆయనకు భారతరత్న (1990) ఇచ్చింది. ఒక సందర్భంలో ఇక్కడికి వచ్చినప్పుడే బెంగాలీ రచయిత్రి మహాశ్వేతాదేవికి జ్ఞానపీఠ్ ఆయన చేతుల మీదుగా ఇప్పించారు. అణచివేతకు గురైన వర్గాల గళాలకు పదును తెచ్చినవాడు. ప్రపం చ హక్కుల ఉద్యమాలకి ఆయన జీవితం నాటికీ నేటికీ కరదీపికే. ఒక్కమాటలో చెప్పాలంటే మండేలా అంటే- మండే గుండెల జెండా.
విద్యార్థి నేత
కొందరి పుట్టుపూర్వోత్తరాలు చెప్పుకోవడం లాంఛనం కోసం కాబోదు. మొదటి ప్రపంచ యుద్ధంలో మానవాళి కకావికలవుతున్న కాలమది. అప్పుడే జాతివివక్షకు చిరునామాగా ఉన్న దక్షిణాఫ్రికాలో, ట్రాన్స్‌కెయి అనేచోట రొలిహాహ్లా దలీభుంగా మండేలా పుట్టాడు. అసలు పేరు అదే. దీనర్థం ‘చెట్టుకొమ్మను వంచ డం’. వాడుకలో అయితే, ‘సమస్యలు సృష్టించేవాడు’. నెల్సన్ అనే ఆ ఇంగ్లిష్ పేరును అక్షరాలు దిద్దించిన మిస్ డింగేన్ పెట్టిందట. ఆ పేరే ఎందుకో తనకు తెలియదని మండేలా తన ఆత్మకథ ‘లాంగ్ వాక్ టు ఫ్రీడం’లో చెప్పుకున్నారు. జోసా భాష మాట్లాడే థెంబు సమూహంలోని మాడిబా తెగకు చెందుతాడాయన.
తండ్రి గాడ్లా హెన్రీ ఫాకానీస్వా. తల్లి నొసెకెని ఫ్యానీ. తండ్రి తన తెగకు పెద్ద. కానీ న్యాయవాద వృత్తి చేపట్టడానికి మండేలా ఆ వారసత్వాన్ని వదులుకున్నాడు. తన తెగ నుంచి బడికి వెళ్లిన తొలి బాలుడు కూడా ఆయనే. సౌతాఫ్రికన్ నేటివ్ కాలేజ్ (ప్రస్తుతం ఫోర్ట్ హేర్ విశ్వవిద్యాలయం)లో పట్టభద్రుడైన తరువాత విట్‌వాటర్‌సాండ్ విశ్వవిద్యాలయంలో న్యాయశాస్త్రం చదివారు. ఇక్కడ నుంచే ఆయన రాజకీయ జీవితం మొదలయింది. మండేలా విద్యార్థి నాయకుడు. 1944లోనే మండేలా నల్లజాతీయుల విముక్తి కోసం పోరాడుతున్న ఆఫ్రికన్ నేషనల్ కాంగ్రెస్ (ఏఎన్‌సీ) సభ్యుడయ్యారు. వెంటనే ఆ సంస్థ యువజన శాఖ నాయకత్వం చేపట్టాడు.
శాంతిపథంలో
న్యాయవాద వృత్తి చేపట్టడానికి అర్హతనిచ్చే పరీక్ష కూడా ఉత్తీర్ణుడైన తరువాత మండేలా హక్కుల ఉద్యమంతో మమేకమయ్యాడు. తన బాల్యమిత్రుడు, ఏఎన్‌సీ సభ్యుడు అలీవర్ టాంబోతో కలిసి 1952లో జోహెన్నెస్‌బర్గ్‌లో న్యాయ సలహా కేంద్రాన్ని ప్రారంభించారు. నల్లజాతీయులు న్యాయవాద వృత్తిని చేపట్టడం అదే. 1948 తరువాత జాతి వివక్ష ప్రభుత్వం రూపొందించిన చట్టాలతో (పాస్ లాస్) నష్టపోయిన వారి వ్యాజ్యాలను ఈ ఇద్దరు న్యాయవాదులు ప్రధానంగా వాదిస్తూ ఉండేవారు. నల్లజాతి వ్యతిరేక చట్టాల గురించి తన జాతీయులలో అవగాహన కల్పించడానికి ఆయన అప్పుడే దేశమంతా తిరిగాడు. అం తకు గాంధీజీ నిర్వహించినట్టే నల్లజాతి వ్యతిరేక చట్టాలకు నిరసగా శాంతి యుత ఉద్యమం మొదలుపెట్టాడు. దక్షిణాఫ్రికాలో జాతి వివక్ష లేని సామాజిక ప్రజాస్వామ్యం నెలకొల్పాలని పిలుపునిస్తూ 1955లో రచించిన ‘ఫ్రీడం చార్టర్’లో భాగస్వామి అయ్యాడు. దీనితో మరుసటి సంవత్సరమే ఆయన పర్యటనల మీద, ప్రసంగాల మీద జాత్యహంకార శ్వేతజాతి ప్రభుత్వం నిషేధం ప్రకటించింది. ఆరుమాసాల తరువాత మండేలాతో కలిసి, వంద మంది మీద రాజద్రోహ నేరం మోపారు. 1956 నుంచి 1961 వరకు ఈ కేసు విచారణ సాగింది. చివరికి మండేలాను కోర్టు నిర్దోషిగా ప్రకటించింది.
మారిన మార్గం
మండేలాను శాంతి పథం నుంచి పక్కకు నెట్టినది జాతి వివక్ష ప్రభుత్వమే. శ్వేత జాతీయుల నేషనల్ పార్టీ ప్రభుత్వం 1920 నుంచి చేసిన చట్టాల వల్ల నల్లజాతీయుల స్థితి అధ్వానంగా మారిపోయింది. దీనికి పరాకాష్ట వంటి చర్య షార్పివిల్లే ఊచకోత. మార్చి 21, 1960న షార్పివిల్లే పట్టణంలో దాదాపు ఐదువేల మంది నల్లజాతీయులు శాంతియుతంగా ప్రదర్శన నిర్వహించి పోలీసు స్టేష న్‌కు వెళ్లారు. వారి మీద కాల్పులు జరిగి, 69 మంది చనిపోయారు. ఇప్పుడు మార్చి 21వ తేదీని దక్షిణాఫ్రికాలో హక్కుల దినంగా పాటిస్తున్నారు. ఇదే మండేలాను హింసాపథం వైపు నడిపించింది. అజ్ఞాతంలోకి వెళ్లిపోయి, ఏఎన్‌సీ అనుబంధ సైనిక విభాగాన్ని ఆరంభించారాయన. 1962లో అల్జీరియా సంవత్సరం పాటు ఉండి, గెరిల్లా యుద్ధతంత్రంలో శిక్షణ కూడా తీసుకున్నారు. అల్జీరియా నుంచి తిరిగి వచ్చిన వెంటనే ఆగస్ట్ 5, 1962న జాతి వివక్ష ప్రభుత్వం అరెస్టు చేసింది. విచారణ తరువాత జూన్ 12, 1964లో కేప్‌టౌన్‌కు దగ్గరలోని రూబెన్స్ ఐలాండ్ జైలుకు పంపింది.
కంకర్రాళ్లు కొడుతూ
ఆ జైలులో మండేలా (ఖైదీ నెం.46664)కంకర్రాళ్లు కొట్టాడు. కానీ వాటితో పాటు కరుడుగట్టిన అధికారులు, పాలకుల మనసులను కూడా బద్దలుకొట్టాడు. మండేలా స్వస్థలం ట్రాన్స్‌కెయికి పరిమితం కావడానికి అంగీకరిస్తే విడుదల చేస్తామని ప్రభుత్వం నుంచి ఎన్నోసార్లు సంకేతాలు వచ్చినా ఆయన అంగీకరించలేదు. 1973 నుంచి 1988 వరకు ఇలాంటి ప్రతిపాదనలు వచ్చాయి. 1985లో హింసను వీడితే విడుదల చేస్తామని కూడా ప్రభుత్వం ప్రకటించింది. దేనికీ మండేలా లొంగలేదు. 18 సంవత్సరాలు ఆ జైలులోనే గడిచాయి. 1988లో క్షయ వ్యాధి సోకడంతో మండేలాను విక్టర్ వెర్సటర్ జైలుకు బదలీ చేశారు. ఈ కాలంలోనే బోతా అధ్యక్షుడిగా ఉన్న కాలంలో దక్షిణాఫ్రికా పరిస్థితులు దిగజారాయి. మండేలా విడుదలకు అంతర్జాతీయంగా ఒత్తిడి మొదలయింది. బోతా వారసుడు డీక్లార్క్‌తో సమావేశం జరిపిన తరువాత మండేలా ఫిబ్రవరి 11, 1990లో విడుదలయ్యాడు.
తొలి నల్ల అధ్యక్షుడు
మండేలా 1994-1999 మధ్య దక్షిణాఫ్రికా తొలి అధ్యక్షునిగా పదవీ బాధ్యతలు చేపట్టారు. శతాబ్దాలుగా శ్వేతజాతి నల్లజాతీయులను హింసించినప్పటికీ ఆ వివక్ష మరొకజాతి అనుభవించకూడదన్న ఔదార్యమే ఆయనలో కనిపిస్తుంది. రెండు రంగుల మధ్య ఆయన సమన్వయం సాధించడానికి ఆయన కృషి ఆరంభించారు. రగ్బీ శ్వేతజాతి క్రీడ కాబట్టి నల్లజాతీయులు దూరంగా ఉంచారు. కానీ ఆ క్రీడను తిరిగి ఆడమని తన జాతిని మండేలా ప్రోత్సహించాడు. క్రీడలతో ఐక్యత సాధించడం ఆయన ఉద్దేశం. బానిసత్వంతో మగ్గిన దేశాన్ని పునర్ నిర్మించడానికి ప్రయత్నించాడు. మండేలా అధ్యక్షుడైన తరువాతే దేశంలో తాగునీటి సౌకర్యం అందుబాటులోకి వచ్చింది. మా దేశంలో జైలుకు వెళ్లివచ్చిన తరువాత అధ్యక్షులవుతారని ఒక సందర్భంలో పదునైన చురక విసిరిన మండేలా పదవి నుంచి దిగిపోయిన తరువాత సేవారంగాన్ని ఎంచుకోవడం గమనార్హం.
పదవీ కాలంలో ఆయన తీవ్రమైన విమర్శలకు గురికాలేదు. చనిపోయిన తన కుమారుడి పేరు మీద ఎయిడ్స్ బాధితులకీ, వ్యాధి నివారణకి ఆయన కృషి చేశాడు. 500 ఆస్పత్రులు, 30 లక్షల మందికి ఫోను సౌకర్యం ఇచ్చాడు. అన్నిటికంటె ముఖ్యంగా 15 లక్షల మంది పిల్లలను బడికి పంపించాడు. ఏడున్నర లక్షల ఇళ్లకు విద్యుత్ ఇచ్చాడు. మండేలా మరణించాడు. అలసిన అలజడి సేద తీరుతోంది. జాతి వివక్ష మీద పోరాటానికి కామా పెట్టినట్టయింది. కానీ మండేలా ఇచ్చే స్ఫూర్తి ఈ ప్రపంచానికి ఎప్పటికీ అవసరమే.
అజేయం...
నన్ను కప్పుతున్న రాత్రికి ఆవల
బిలంలా నల్లగా ధ్రువం నుంచి ధ్రువం వరకు
దేవుళ్లెవరైనా ఉంటే వాళ్లకు కృతజ్ఞతలు
నాకు అజేయ ఆత్మను ప్రసాదించినందుకు
పరిస్థితుల కబంధ హస్తాల్లో చిక్కుకున్నా
నేను బెదరలేదు... బిగ్గరగా రోదించనూ లేదు
విధి విసిరిన ఆఘాతాలకు
నా తల నెత్తురోడినా, తలవంచలేదు
ఆగ్రహ బాష్పాల ఈ ప్రదేశానికి ఆవల
అస్పష్టంగా భయవిహ్వల ఛాయలు
అయినా ఏళ్లనాటి భీతి
నన్ను నిర్భీకుడిగానే కనుగొంటోంది, కనుగొంటుంది కూడా
ఈ ద్వారం ఎంత ఇరుకుగా ఉందనేది విషయమే కాదు
ఎంతగా శిక్షల తాకిడికి గురవుతున్నాననేదీ కాదు
నేనే నా తలరాతకు యజమానిని నేనే నా ఆత్మకు సారథిని
విక్టోరియన్ కవి విలియం ఎర్నెస్ట్ హేన్లీ (1849-1903) రాసిన ఈ కవితను మండేలా జైల్లో ఉన్నప్పుడు తరచుగా చదువుకుంటూ స్ఫూర్తి పొందేవారు. (తెలుగు అనువాదం: పన్యాల జగన్నాథదాసు)
మండేలా మాటలు..
మహాత్మాగాంధీ తనకు ఆదర్శమని పలు సందర్భాల్లో చెప్పిన మండేలా, తన పోరాటంలో గాంధీ మార్గాన్నే అనుసరించారు. జాతి వివక్షకు వ్యతిరేకంగా మొక్కవోని దీక్షతో పోరాటం సాగించారు. ఆఫ్రికా ప్రజల పోరాటానికి తన జీవితాన్నే అంకితం చేశారు. రంగు, మతం, నేపథ్యాల కారణంగా మనుషులెవరూ ద్వేషిస్తూ పుట్టరని, వారు ద్వేషించడాన్ని నేర్చుకుంటారని, ద్వేషించడం నేర్చుకోగలిగిన మనుషులకు ప్రేమించడమూ నేర్పవచ్చని విశ్వసించారు.
భారతదేశం గాంధీ పుట్టిన దేశం. దక్షిణాఫ్రికా ఆయనను దత్తత తీసుకున్న దేశం. ఆయన భారత్, దక్షిణాఫ్రికా రెండు దేశాల పౌరుడు. ఆయన మేధో, నైతిక సంపత్తికి రెండు దేశాలూ తోడ్పడ్డాయి. ఈ రెండు వలస దేశాల్లోనూ విముక్తి ఉద్యమాలకు ఆయన రూపమిచ్చారు.’’
- 2000, జనవరి 3న టైమ్ మేగజీన్‌లో రాసిన ‘ద సేక్రెడ్ వారియర్’ వ్యాసంలో.
జాతి వివక్షను దాని అన్ని రూపాల్లో చాలా తీవ్రంగా ద్వేషిస్తున్నా. దీనిపై నా తుదికంటా పోరాడుతా.’’
- ఓ సమ్మె కేసుపై 1962లో జరిగిన కోర్టు విచారణలో..
నా జీవితకాలంలో నన్ను నేను ఆఫ్రికా ప్రజల పోరాటానికి అంకితం చేశాను. తెల్లవారి ఆధిపత్యానికి వ్యతిరేకంగా పోరాడాను. నల్లవారి ఆధిపత్యానికి వ్యతిరేకంగా పోరాడాను. అందరూ శాంతియుతంగా, సమాన అవకాశాలతో కలిసి జీవించే ప్రజాస్వామ్య, స్వేచ్ఛా సమాజం కావాలనేది నా ఆకాంక్ష. ఆ ఆకాంక్ష కోసం నేను జీవించాలనుకుంటున్నా. కానీ.. ఆ ఆకాంక్ష కోసం అవసరమైతే నేను చనిపోవటానికి సిద్ధం.’’
- 1964లో ప్రిటోరియా సుప్రీంకోర్టులో ప్రకటన
ఒక సోదరుడితో మరో సోదరుడు పోరాడే ఈ యుద్ధంలో పాలుపంచుకునే వారందరికీ నా సందేశమిది: మీ తుపాకులు, మీ కత్తులు, మీ కొడవళ్లు తీసుకెళ్లి సముద్రంలో పారేయండి. మృత్యు కర్మాగారాలను మూసేయండి. ఈ యుద్ధాన్ని ఇక ముగించండి.’’
- 1990 ఫిబ్రవరి 25న డర్బన్‌లో ఒక బహిరంగ సభలో ప్రసంగం
ఏ ఒక్కరూ మరొక వ్యక్తిని అతడి శరీర రంగు, అతడి నేపథ్యం, అతడి మతం కారణంగా ద్వేషిస్తూ పుట్టరు. మనుషులు ద్వేషించటం నేర్చుకుంటారు. వారు ద్వేషించటం నేర్చుకోగలిగినపుడు.. వారికి ప్రేమించటం కూడా నేర్పించవచ్చు. ఎందుకంటే ద్వేషం కన్నా ప్రేమ అనేది మానవ హృదయానికి మరింత సహజంగా వస్తుంది.’’
‘‘ధైర్యం అంటే భయం లేకపోవటం కాదని.. భయాన్ని అధిగమించటమని నేను తెలుసుకున్నా. ధైర్యవంతులంటే భయం లేని వారు కాదు.. భయాన్ని జయించినవారు.’’
- లాంగ్ వాక్ టు ఫ్రీడమ్, 1995
డా॥గోపరాజు నారాయణరావు