వివరం: జ్వాలాగ్ని | Alluri Srirama raju to key role leadership for Tribal movements | Sakshi
Sakshi News home page

వివరం: జ్వాలాగ్ని

Published Sun, Jun 29 2014 1:11 AM | Last Updated on Sat, Sep 2 2017 9:31 AM

వివరం: జ్వాలాగ్ని

వివరం: జ్వాలాగ్ని

జూలై 4 అల్లూరి జయంతి
గిరిజనోద్యమాలకు చరిత్రపుటలలో దక్కే చోటు పది, పదిహేను పంక్తులే. కానీ, అందులో ప్రతి అక్షరం ఒక అడవిపాట. ప్రతి వాక్యం సెలయేటి ప్రవాహం. వన సౌందర్యాన్నీ, ఆ అందం మాటున దాగిన బీభత్సాన్నీ  ఏకకాలంలో ఆవిష్కరించగలిగే వాక్యాలవి. ఆ కొన్ని వాక్యాలే ఏ తరం వారినైనా కొండగాలిలా కదిలించగలుగుతున్నాయి. తెలుగువారిని ఇప్పటికీ కదిలిస్తున్న విశాఖ మన్యం ఉద్యమం అలాంటి గిరిజనోద్యమమే. ఆ ఉద్యమానికి నాయకత్వం వహించిన అల్లూరి శ్రీరామరాజు అసమాన చరిత్ర పురుషుడే.  
 
 అల్లూరి ఎలా ఉండేవారు?
 రామరాజు ఎలాంటి దుస్తులు ధరించేవాడు? ఆయన తపస్సు చేసుకోవడానికి మన్యం వచ్చినా ఏనాడూ కాషాయం ధరించినవాడు కాదు. గెడ్డాలూ, మీసాలతో ఎప్పుడూ తెల్లటి లుంగీ, పైన ఉత్తరీయం ధరించి ఉండేవాడు. మెడలో యజ్ఞోపవీతం ఉండేది. కాళ్లకి చెప్పులు ఉండేవి కావని ఆయనను చూసిన వారు చెప్పారు. ఉద్యమం ప్రారంభమైన తరువాత ఆయన తక్కువగానే కనిపించినా ఏనాడూ కాషాయ వస్త్రాలతో కనిపించలేదు. ఖద్దరు ఖాకీ నిక్కరు, తెల్లటి ఖద్దరు చొక్కా ధరించి ఉండేవాడు. సహచరులు కూడా అంతే. లేదా ఎర్ర నిక్కరు ధరించేవాడు. అన్నవరం వచ్చినపుడు ఆయనతో మాట్లాడిన చెరుకూరి నరసింహమూర్తి కూడా ఆయనను ఖాకీ నిక్కరు, తెల్లటి ఖద్దరు చొక్కాలోనే చూసినట్టు చెప్పారు. అలాగే రామరాజు భోజనం చేసేవారు కాదు. పాలు, పళ్లే తీసుకునేవారు. ఇది చిటికెల భాస్కరనాయుడిగారి కుటుంబీకులు, వారి పెద్ద కుమార్తె సత్యనారాయణమ్మ చెప్పిన సంగతి.
 
 బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా మైదానాలలో జరిగిన పోరాటంలో భారత జాతీ య కాంగ్రెస్‌తో పాటు, వందల సంస్థలు త్యాగాలు చేశాయి. ఆ త్యాగాలకు దీటుగా స్వేచ్ఛ కోసం కొండకోనలు కూడా ప్రతిధ్వనించాయి. నిజానికి రైతాంగ పోరాటాలూ, గిరిజనోద్యమాలూ భారత జాతీయ కాంగ్రెస్ ఆవిర్భవించడానికి (1885) నూట ఇరవయ్యేళ్లకు ముందే ప్రజ్వరిల్లాయి. చౌర్స్ (బెంగాల్ వనసీమలలో, 1768), ఖాసీలు (అస్సాం,1835),  కోలీలు (గుజరాత్, మరాఠా కొండలలో, 1824-48); ఆ తర్వాత ఖోందులు (ఒరిస్సా), సంథాలులు (బీహార్), ముండాలు (1899-1900), భిల్లులు (రాజస్థాన్, 1913), కుకీలు(మణిపూర్, 1919), చెంచుల (నల్లమల అడవులు, 1921) ప్రతిఘటనలు ఇందుకు కొన్ని ఉదాహరణలు. ఆ తరువాత జరిగినదే అల్లూరి ఉద్యమం (1922-24).
 
 వీరుడి పుట్టుక
 సీతారామరాజుగా మనందరం పిలుచుకుంటున్న ఆ చరిత్రపురుషుడి పేరు నిజానికి శ్రీరామరాజు. విశాఖ జిల్లా పాండ్రంగిలో అమ్మమ్మగారి ఇంట పుట్టిన రామరాజు (జూలై 4, 1897) మైదాన ప్రాంతాల నుంచి కొండ కోనలకు వెళ్లి చరిత్ర మరచిపోలేని ఒక గిరిజనోద్యమాన్ని నిర్మించడం గొప్ప వైచిత్రి. తొలి సంతానం కాబట్టి తల్లి సూర్యనారాయణమ్మ, తండ్రి వెంకటరామరాజు ‘చిట్టిబాబు’ అని పిలుచుకునేవారు. తరువాత సొంత ఊరు మోగల్లు (ప్రస్తుతం పశ్చిమ గోదావరి జిల్లా, అప్పుడు కృష్ణా జిల్లా) నుంచి అదే జిల్లాలో తణుకు, అక్కడ నుంచి రాజమహేంద్రవరం ఆ కుటుంబం తరలిపోయింది. కారణం- వెంకటరామరాజు ఫోటోగ్రాఫర్. శ్రీరామరాజుకు తొమ్మిదేళ్ల వయసు వచ్చి, కొంచెం బయటి ప్రపంచం తెలుస్తున్న కాలంలో అతడు చూసినది ‘వందేమాతరం’ ఉద్యమ ఆవేశాన్నే. బెంగాల్ విభజనకు వ్యతిరేకంగా మొదలయిన ఆ ఉద్యమం గురించి ప్రచారం చేయడానికి 1907 లో బిపిన్‌చంద్రపాల్ రాజమండ్రి వచ్చారు. బిపిన్‌పాల్‌తో పాటు అదే వేదిక మీద నుంచి ముట్నూరి కృష్ణారావు, చిలకమర్తి లక్ష్మీనరసింహం, గాడిచర్ల హరిసర్వోత్తమరావు వంటివారు ఇచ్చిన ఉపన్యాసాలు రాజమండ్రి, కాకినాడ, చుట్టుపక్కల ప్రాంతాలను జాతీయావేశంతో నింపివేశాయి.  
 భారతీయులలో తొలిసారి సమష్టి రాజకీయ చైతన్యాన్ని తీసుకువచ్చిన ఘనత కూడా వందేమాతరం ఉద్యమానిదే. ఈ చారిత్రక దృశ్య మాలికను కొడుకు కళ్లకు కట్టిన ఆ ఫోటోగ్రాఫర్ 1908లో హఠాత్తుగా కన్నుమూశాడు. అక్కడ నుంచి శ్రీరామరాజుకు కష్టాలు మొదలయ్యాయి. రామచంద్రపురం, రాజమండ్రి, కాకినాడ, నరసాపురం టైలర్ హైస్కూలు, విశాఖపట్నం వంటి చోట ఆయన  చదువు సాగింది. తర్వాత ఈ చదువులూ, ఉద్యోగాల గొడవ నుంచి దూరం వెళ్లిపోయాడు శ్రీరామరాజు. ఉత్తర భారతం, బెంగాల్, హిమాలయాలు చూశాడు. అక్కడ నుంచి నేరుగా విశాఖ మన్యంలో ఉన్న కృష్ణదేవిపేటకు వచ్చాడు. ఆ యాత్రలో ఆయన భారతదేశంలో చూసిన వాతావరణం, వందేమాతరం ఉద్యమం సమయంలో రాజమండ్రిలో కనిపించిన ఆవేశానికంటె ఎంతో తీక్షణమైనది.
 
 మొదటి ప్రపంచ యుద్ధం వేసిన బాట
 ఇప్పటికి సరిగ్గా వందేళ్ల క్రితం ప్రారంభమైన మొదటి ప్రపంచ యుద్ధం పుణ్యమా అని ప్రపంచ దేశాలతో పాటు, బ్రిటిష్ వలస భారత్ కూడా ఆర్థికంగా కుంగిపోయింది. కరవుకాటకాల జాడలు మొదలయినాయి. ఆకలి చావుల నుంచి జనాన్ని తప్పించడానికి అన్నిచోట్ల పనికి ఆహారం పథకం రీతిలో పనులు చేపట్టారు. విశాఖ మన్యానికి సింహద్వారం వంటి నర్సీపట్నం నుంచి లంబసింగి (చింతపల్లి కొండ మార్గంలో) వరకు తలపెట్టిన రోడ్డు నిర్మాణం ఆ ఉద్దేశంతో ఆరంభించినదే.
 
 ఈ పనినే గూడెం డిప్యూటీ తహశీల్దార్ బాస్టియన్ బినామీ పేరుతో తీసుకుని, నామమాత్రపు కూలితో మన్యవాసులతో పనిచేయిస్తూ, వేధించడం మొదలుపెట్టాడు. అటవీ చట్టాలను అడ్డం పెట్టుకుని కొన్ని దశాబ్దాలుగా నిత్యం సాగుతున్న హింసకు ఇది అదనం. తగులబడిపోతున్న అడవులను ప్రాణాలకు తెగించి, ఎలాంటి ప్రతిఫలం లేకుండా చల్లార్చడం, పోలీసులు, అటవీ సిబ్బంది దోపిడీని మౌనంగా చూడడం గిరిజనుడికి అలవాటైపోయిన హింస. చట్టాల పేర అడవుల నుంచి దూరంగా ఉంచడం వల్ల ఆకలి బాధ మరొకటి. ఈ బాధల నుంచి విముక్తం కావాలని మన్యవాసులు కోరుకుంటున్నకాలమది. పైగా కొద్దినెలల క్రితమే ఒక తాటాకు మంటలా భగ్గుమని చల్లారిపోయిన గరిమల్ల మంగడి తిరుగుబాటు రేపిన కల్లోలం ఇంకా చల్లారలేదు.
 
 నిజానికి మన్యానికి తిరుగుబాట్లు కొత్తకాదు. 1879-80లో జరిగిన తిరుగుబాటు మొదటి ‘రంప తిరుగుబాటు’గా ప్రసిద్ధి గాంచింది. తరువాత పది వరకు అలాంటి తిరుగుబాట్లు జరిగాయని చెబుతారు. చివరిది, రెండవ రంప ఉద్యమంగా పేరు పొందినది రామరాజు నాయకత్వంలో నడిచినదే. అంటే మన్యవాసులకు పోరాటమంటే ఏమిటో బోధించనక్కరలేదు. వ్యూహాల గురించి పాఠాలు అవసరం లేదు. కావలసినది నాయకత్వం.
 
 నాయకుడి ఆగమనం

 ఉత్తర భారత యాత్రను ముగించుకుని జూలై 24, 1917న శ్రీరామరాజు నేరుగా విశాఖ మన్యానికి నడిబొడ్డున ఉన్న కృష్ణదేవిపేటకు వచ్చాడు. అక్కడ ఆయనను చేరదీసిన చిటికెల భాస్కరనాయుడి కుటుంబానికి చెప్పిన వివరాల ప్రకారం, తపస్సుకు అనువైన స్థలం కోసం అన్వేషిస్తూ ఆ ప్రదేశానికి వచ్చాడాయన. తెల్లటి లుంగీ, పై కండువాతో, చేతిలో చిన్న సంచి, అందులో రెండు గ్రంథాలతో మాత్రమే రామరాజు ఆ ఊరు వచ్చాడు. అతడొక యతి అన్న భావంతో చిటికెల వారి కుటుంబం ఆదరించింది. భాస్కరనాయుడి తల్లి సోమాలమ్మ రామరాజు ఇంటికి ఉత్తరం రాయించి, మళ్లీ కుటుంబాన్ని కలిపింది. వీరి కోసం ఊరి చివర తాండవ నది ఒడ్డున శ్రీవిజయరామ నగరం అనే చిన్న వాడను స్థాపించారు గ్రామస్థులు. అక్కడే గాం గంటం దొర, మల్లుదొర, ఇతర గిరిజన నేతలు ఆయనను కలిసేవారు. వీరంతా మునసబులు, ముఠాదారులు. అంటే మన్యం గ్రామాల, గ్రామాల సమూహాల అధికారులు. మొత్తంగా అటవీ చట్టాల బాధితులు.
 
  ఉద్యమానికి శ్రీకారం
 ఆగస్టు 22, 1922న శ్రీరామరాజు చింతపల్లి పోలీసు స్టేషన్ మీద దాడి చేసి, ఆయుధాలు తీసుకుని వెళ్లాడు. నిజానికి ఆయన 1917లోనే మన్యానికి వచ్చాడు. మధ్యలో ఆ ఐదేళ్లు ఆయనేం చేశాడు? మొదట ప్రజలకు దగ్గరయ్యాడు. తనకు తెలిసిన మూలికా వైద్యం చేశాడు. మంచీచెడ్డా చెప్పాడు. పంచాయతీలు పెట్టి కోర్టులను బహిష్కరించేటట్టు చేశాడు. వేసవి వస్తే రాత్రీపగలూ లేకుండా జీలుగు కల్లు తాగి ఆ తోటలకే పరిమితమయ్యే గిరిజనాన్ని సంస్కరించాడు. దీనితో ప్రభుత్వం ‘నాన్ కో ఆపరేటర్’ ముద్ర వేసి అరెస్టు చేసి, నర్సీపట్నం జైలులో రెండో నెంబర్ సెల్‌లో నిర్బంధించింది. అడ్డతీగల దగ్గర పైడిపుట్టలోనే ఉండాలని ఆదేశించింది. ఇవన్నీ అధిగమించి గిరిజనాన్ని కూడగట్టి ఉద్యమించగలిగాడు.
 
 ఉద్యమ గమనం

 చింతపల్లి పోలీసు స్టేషన్ మీద దాడి చేసిన మరునాడే కృష్ణదేవిపేట మీద  శ్రీరామరాజు దళం దాడి చేసింది. ఆ వెంటనే రాజవొమ్మంగి పోలీసు స్టేషన్ మీద దాడి  చేసింది. 1922 నుంచి 24 వరకు జరిగిన ఈ ఉద్యమం భారతీయ గిరిజనోద్యమాలలో సుదీర్ఘమైనది. కానీ 1923కు ఉద్యమం కొంచెం బలహీనపడి, రకరకాల వదంతులు వ్యాపించాయి. రాజు దళం రంగూన్ పారిపోతోందన్నది అందులో ఒకటి. వెంటనే కొండదళం సభ్యుల తలలకు వెలలు ప్రకటించింది ప్రభుత్వం. అయితే హఠాత్తుగా రామరాజు ఏప్రిల్ 12, 1923న అన్నవరం కొండ మీద కనిపించి పోలీసులను నివ్వెరపరిచాడు. అప్పుడే చెరుకూరి నరసింహమూర్తి అనే ఆయనకు తన ఉద్దేశాలు వెల్లడించాడు.
 
 మరోవైపు దాదాపు రెండేళ్లుగా సాగుతున్న ఆందోళన, పోలీసులూ, సైనికుల కవాతులు మన్యాన్ని అతలాకుతలం చేశాయి. పంటలు లేవు. అంతా నిర్బంధం. ఈ పరిస్థితులలో కొందరు నాయకులను స్థానికులే పట్టి ఇచ్చేశారు. అయినా భారతీయులను ఎవరినీ చంపరాదంటూ ఉద్యమ కారులకు తను విధించిన షరతును సడలించడానికి రామరాజు అంగీకరించలేదు. 1924 మే మాసంలో రేవుల కంఠారం అనేచోట జరిగిన ఉద్యమకారుల సమావేశంలో ఈ విషయమే చర్చనీయాంశమైంది. ఆ షరతును పూర్తిగా ఉపసంహరించుకోవాలని ఉద్యమకారులు కోరినా రామరాజు అంగీకరించలేదు. ఉద్యమకారులు జరిపిన ఆఖరి సమావేశం అదే.
 
 1.    కృష్ణదేవిపేటలో తాండవ నది ఒడ్డున అల్లూరి అర్చించిన నీలకంఠేశ్వరుడు.
 2.    కృష్ణదేవిపేటలో అల్లూరిని దహనం చేసిన చోట నిర్మించిన స్మారక మందిరం.
 3.    అల్లూరి పట్టుపడిన మంపలో నిర్మించిన స్మారక స్థూపం.
 
 
భీమవరం (పగో జిల్లా) సమీపంలోని కుముదవల్లి ఆయన స్వగ్రామం. అగ్గిరాజు పేరుతో ఆయన ఉద్యమంలో పని చేశాడు. ఆయనను చాలాకాలం ప్రభుత్వ గూఢచారి అనుకున్నారు. నిర్బంధం ఎక్కువైన తరువాత అతడు హఠాత్తుగా మాయమైపోవడమే దీనికి కారణం. తరువాత ఈ విషయం గురించి ఎన్‌జీ రంగా ఉమ్మడి మద్రాసు శాసనసభలో ప్రశ్న వేశారు. అప్పుడే అసలు విషయం తెలిసింది. ఆయనను పోలీసులు పట్టుకుని అండమాన్ జైలుకు తరలించారు. ఆయన అక్కడే విష జ్వరంతో చనిపోయాడు. అది అప్పటి దాకా గుప్తంగానే ఉండిపోయింది.

అల్లూరి శ్రీరామరాజు కొద్దికాలం పాటు చదువు సాగించిన టైలర్ హైస్కూలు. పశ్చిమగోదావరి జిల్లా నరసాపురంలో వశిష్ట గోదావరి ఒడ్డునే ఈ పాఠశాల ఉంది. ఇప్పటికీ విద్యను అందిస్తున్నది.
 
 దామనపల్లి ఘటన

 దామనపల్లి ఘటనకు (సెప్టెంబర్ 24, 1922) విశాఖ మన్య పోరాటంలోనే కాదు, భారత స్వాతంత్య్రోద్య చరిత్రలోనే స్థానం ఉండాలి. దామనపల్లి ఒక ఘాట్ మార్గం. ఒక పక్క లోతుగెడ్డ వాగు. మరో పక్క కొండ. మధ్యలో సన్నటి దారి. ఇక్కడికి రామరాజు దళం వస్తున్నదని పోలీసులకు సమాచారం అందింది. అది నిజమే కూడా. దీనితో  స్కాట్ కవర్ట్, నెవైలి హైటర్ అనే ఇద్దరు సైనికాధికారుల నాయకత్వంలో పోలీసు బలగాలు అక్కడకు చేరాయి. కానీ రామరాజుకు మన్యమంతటా వేగులు ఉండేవారు. దామనపల్లి గ్రామ మునసబు తమ్ముడు కుందేరి బొర్రంనాయుడు పోలీసులు మోహరించి ఉన్న సంగతిని రామరాజు దళానికి చేరవేశాడు. రామరాజు వ్యూహం ప్రకారం తన దళంతో ఎండుపడాలు చేరువనే ఉన్న సరమండ ఘాటీ దిగువన మాటు వేశాడు. గంటం కొందరు సభ్యులతో దామనపల్లి ఘాటీ సమీపంలోనే కుంకుడుచెట్ల తోపులో కాపు వేశాడు. మల్లుదొర ఇంకొందరు కలసి దిబ్బలపాడు అనేచోట నక్కి ఉన్నారు.
 
 బ్రిటిష్ పటాలం నాలుగు అంచెలుగా కదులుతోంది. అప్పటికే భారతీయులే రక్షణ కవచంగా ఇంగ్లిష్ అధికారులు వ్యూహాలు పన్నుతున్నారు. మొదటి వరసలో యాభయ్ మందితో ఒక అడ్వాన్సు పార్టీ ఉంది. తరువాత నల్ల సోల్జర్ల దళం. ఆ వెనుక భద్రంగా కవర్ట్, హైటర్ నడుస్తున్నారు. వీరి వెనుక మరో పోలీసు దళం. మొత్తం మూడు వందల మంది. పది మైళ్ల కాలిబాట అది. ఒక బిందువు దగ్గరకు వచ్చే సరికి హఠాత్తుగా కాల్పులు మొదలయ్యాయి. ఎటూ పాలుపోలేదు పోలీసులకి. అటు పర్వతం, ఇటు వాగు. వెనుక నుంచీ, ముందు నుంచీ కాల్పులు. మొదటి రెండు రౌండ్లలో ఒకటి వచ్చి కవర్ట్ కణతలో దూసుకుపోయింది.

రామరాజు అనుచరులు
 రామరాజు వెంట నడిచిన వారంతా గిరిజనులే. గాం గంటం దొర(బట్టిపనుకుల), అతడి తమ్ముడు మల్లు, కంకిపాటి ఎండు పడాలు(పదల), గోకిరి ఎర్రేసు(గసర్లపాలెం), బొంకుల మోదిగాడు(చింతలపూడి),  మొట్టడం బుడ్డయ్యదొర (కొయ్యూరు), సంకోజు ముక్కడు (సింగన పల్లి) వంటివారు సేనానులుగా వ్యవహరించారు. మొత్తం 276 మందిని విశాఖలో ఏర్పాటు చేసిన ప్రత్యేక ట్రిబ్యునల్‌లో విచారించారు. ఇందులో ఎర్రేసు గొప్పవిలుకాడు. అగ్గిరాజు అనే పేరిచర్ల సూర్యనారాయణరాజు కూడా రామరాజు వెంట నడిచినా ఆయన గిరిజనుడు కాదు.
 
 మరో తూటా హైటర్ భుజంలోకి దూసుకుపోయింది. ఇద్దరూ వాగులో పడిపోయారు. శవాలై తేలారు. వీరిని కాపాడాలని విశ్వ ప్రయత్నం చేసిన మరో ఇద్దరు భారతీయులు చనిపోయారు. నిజానికి ఆ ఘాట్ రోడ్డులో ఆ క్షణంలో రాజు దళం కాల్చడం మొదలు పెడితే ఏ ఒక్కరూ మిగిలేవారు కాదు. కానీ రాజు ఆ పని చేయలేదు. కవర్ట్, హైటర్ ఇద్దరూ మొదటి ప్రపంచ యుద్ధంలో ఐరెన్ క్రాస్ సంపాదించిన సైనికులు. ఈ ఇద్దరినీ కాల్చి చంపిన వాడు గోకిరి ఎర్రేసేనని చెబుతారు. కవర్ట్, హైటర్ సమాధులు నర్సీపట్నంలో ఇప్పటికీ ఉన్నాయి. వాటి మీద వివరాలు కూడా ఉన్నాయి. ఆగస్టు 26, 1922న ఏజెన్సీ కమిషనర్ స్టీవర్ట్ మద్రాసు ప్రెసిడెన్సీ ప్రధాన కార్యదర్శి గ్రాహమ్‌కు దామనపల్లి ఉదంతం మీద ప్రత్యేక నివేదికనే పంపాడు.
 
 కొందరు అసంతృప్తితో వె ళ్లిపోయారు. మే6, 1924 రాత్రికి రామరాజు ఒక్కడే కొత్త రేవళ్ల గ్రామం మీదుగా మంప అనే కుగ్రామం చేరుకున్నాడు. అక్కడే జొన్న చేలో మంచె మీద పడుకున్నాడు. వేకువనే స్నానం కోసం అక్కడే ఉన్న చిన్న కుంటలో స్నానం చేస్తుండగా పట్టుబడ్డాడు. ఆ నీటి కుంటకు కొంత దూరంలోనే దట్టమైన చింతలతోపు ఉంది. అక్కడే ఈస్ట్‌కోస్ట్ దళానికి చెందిన జమేదార్ కంచుమేనన్, ఇంటిలిజెన్స్ పెట్రోలింగ్ సబిన్స్‌పెక్టర్ ఆళ్వారునాయుడు వచ్చి బంధించారు. ఎలాంటి ప్రతిఘటన ఎదురుకాలేదు.
 
 రూధర్‌ఫర్డ్ ఆదేశం మేరకు, కృష్ణదేవిపేటకు తీసుకువెళ్లాలని నిర్ణయించారు. ఒక నులక మంచం తెప్పించి దానికి రామరాజును బంధించి కొయ్యూరు మీదుగా కృష్ణదేవిపేటకు తీసుకుపోతుండగా మధ్యలో అస్సాం రైఫిల్స్ అధిపతి గూడాల్ ఆపి విచారణ పేరుతో తీసుకుపోయి కాల్చి చంపాడు. తరువాత శవాన్ని కృష్ణదేవిపేటకు తీసుకువెళ్లి తాండవ ఒడ్డున దహనం చేశారు. రామరాజు మరణించిన తరువాత కూడా కొద్దికాలం ఉద్యమం సాగింది. ఒక్కొక్కరుగా దొరికిపోయారు. జూన్ 7, 1924న పెద్దవలస సమీపంలో ఎద్దుమామిడి-శింగధారల దగ్గర ఆరేడుగురు సహచరులతో కనిపించిన గాం గంటం దొరను కాల్చి చంపారు. దీనితో ఉద్యమానికి తెర పడినట్టయింది.
 - డా॥గోపరాజు నారాయణరావు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement