కొన్ని దశాబ్దాల క్రితం నాటి మాట. ఓ ఉక్కు కర్మాగారం పనితీరును పరిశీలించడానికి భారత నిపుణుల బృందం ఒకటి అమెరికా వెళ్లింది. మొదట సాధారణ యంత్రాల పని తీరును ఈ బృందానికి వివరించిన అమెరికన్ సాంకేతిక నిపుణుడు చివరిగా ఒక భారీ యంత్రం దగ్గరకు తీసుకుపోయాడు. ఆ యంత్రం పని విధానం ఏమిటో పరిశీలించాలంటే 75 అడుగుల ఒక నిచ్చెన ఎక్కవలసి వచ్చింది. అప్పటిదాకా ఆ భారీ కర్మాగారమంతా తిరిగి ఉన్న బృందంలోని చాలామంది చేతులెత్తేశారు. అప్పుడు ఒకాయన తన కోటు, బూట్లు తొలగించి ఆ నిచ్చెన ఎక్కడం ఆరంభించారు. ఆపై ఆయన వెనుక చాలామంది వెళ్లారు.
కానీ మధ్యలోనే దిగిపోయారు. మొదటిగా నిచ్చెన ఎక్కడం ఆరంభించిన ఆ భారతీయుడు– నిజానికి వృద్ధుడు– మాత్రం మెట్లన్నీ ఎక్కారు. అప్పటికే ఆయన భారతదేశపు ఇంజనీర్లలో సర్వోన్నతునిగా సమున్నత శిఖరాల మీద నిలిచి ఉన్నవారు. ఆయనే మోక్షగుండం విశ్వేశ్వరయ్య. అప్పటికీ, ఇప్పటికీ విశ్వేశ్వరయ్య భారతీయ ఇంజనీరింగ్ రంగంలో సమున్నతుడే. ఇంజనీరింగ్ చదువు వేరు. ఇంజనీర్‌గా ఆలోచించడం, బతకడం వేరు. అసలైన ఇంజనీర్‌గా బతికారు కాబట్టే మోక్షగుండం విశ్వేశ్వరయ్య జయంతిని (సెప్టెంబర్ 15) ఇంజనీర్స్ డే గా భారతదేశం జరుపుకుంటోంది. ఒక ఇంజనీర్ ఒక దేశానికి చేయగలిగిన సేవ ఎలాంటిదో కూడా విశ్వేశ్వరయ్య జీవితం బోధిస్తుంది.
‘సర్ ఎమ్వీ’గా పిలుచుకునే విశ్వేశ్వరయ్య జీవితం గురించి, ప్రతిభను గురించి; నీతి, నిజాయితీ, విలువల గురించి మైసూర్‌లో కథలు కథలుగా చెప్పుకునేవారట. ఆయన కార్యాలయానికి వెళుతున్న సమయాన్ని చూసి గడియారాలు సరి చూసుకోవచ్చుననేది అందులో ఒకటి మాత్రమే. ఆయన చెప్పిన మాటలు కూడా చిరస్మరణీయాలుగా మిగిలాయి. ‘గుర్తుంచుకో! నీది రైల్వే క్రాసింగ్‌లను పరిశుభ్రంగా ఉంచే పనే కావచ్చు. కానీ ప్రపంచంలో మరే క్రాసింగ్ కూడా లేనంత పరిశుభ్రంగా నీవు శుభ్రం చేసిన క్రాసింగ్ ఉండాలి’ అన్నారాయన. ఎంత గొప్పమాట! విశ్వేశ్వరయ్యను ఆధునిక భారత నిర్మాతలలో ఒకరిగా గౌరవిస్తారు. మేధస్సు, నిజాయితీ, పనినే దైవంగా భావించే తత్వం ఆయనను ఆ స్థాయికి తీసుకుపోయాయి. ప్రతిభకు ఆయన కొత్త ప్రమాణాలను అద్దారు.
ఇదంతా ఒక పేద కుటుంబం నుంచి వచ్చిన బాలుడు, భారతీయ ఇంజనీరింగ్ రంగ పితామహునిగా తనను తాను ఆవిష్కరించుకున్న ఇతిహాసం. ఎందుకంటే–బానిసత్వంలో కావచ్చు, వలసవాదుల పాలనలో కావచ్చు. దేశీయమైన జ్ఞాన సంపదనూ, సృజననూ, కళనూ అన్నింటికీ మించి ఆ నేల నుంచి జనించిన చింతనా ధోరణిని అలాంటి చీకటియుగంలో రక్షించుకోవడం అన్నింటికంటే పెద్ద సవాలు. ఈ సవాలును ఎదుర్కొన డంలో యోధులూ, నేతలూ, పాలకులూ నిర్వహించే పాత్ర చరిత్రలో ఎప్పుడూ ఉత్తేజకరమైనదే. సరిగ్గా పరిశీలిస్తే శాస్త్రవేత్తలు, సాంకేతిక నిపుణులు, కళాకారులు, రచయితలు నిర్వహించే పాత్ర కూడా ఆ యోధులు, నేతలు, పాలకులు నిర్వహించిన పాత్రకు సమాంతరంగా కనిపిస్తుంది.
బానిసత్వం నుంచి వలసవాదుల ఏలుబడిలోకి, ఆపై స్వేచ్ఛా స్వాతంత్య్రాలలోకి సాగిన ప్రయాణమే ఆధునిక భారత చరిత్ర. ఒక పక్క బానిసదేశమన్న ముద్ర ఉన్నప్పటికీ, ఆ ముద్రను ప్రపంచం పట్టించుకోకుండా చేసినది– ఇక్కడ పుట్టిన ప్రతిభే. సీవీ రామన్, హోమీ జహంగీర్ బాబా, శ్రీనివాస రామానుజన్, సుబ్రహ్మణ్యం చంద్రశేఖర్, యల్లాప్రగడ సుబ్బారావు, పీసీ రే, జేసీ బోస్, శాంతిస్వరూప్ భట్నాగర్, విక్రమ్ సారాభాయ్, సత్యేంద్రనాథ్ బోస్ వంటివారు– వంచిపెట్టినా పైకి లేచే జ్వాలల్లా – వలస పాలనలో ఉన్నప్పటికీ భారతదేశపు వెలుగులు ఎలాంటివో లోకానికి చాటారు. వీరితో పాటు ప్రేమ్‌చంద్, శరత్‌బాబు, బంకింబాబు, సుబ్రహ్మణ్యభారతి, స్వామీ వివేకానంద వంటివారు కూడా విదేశీ పాలన, సంకెళ్లు సృజనకు అడ్డుకావని నిరూపించినవారే.
మోక్షగుండం విశ్వేశ్వరయ్య కూడా అలాంటి విశిష్ట భారతీయుడే. భారత స్వాతంత్య్ర సమరంలో కీలకంగా ఉండి, స్వతంత్ర భారత ప్రభుత్వంలో కూడా ముఖ్య భూమికను పోషించిన మహనీయులలో ఎవరికీ తీసిపోని అద్భుతమైన వ్యక్తులే వీరింతా. స్వతంత్ర భారత పునర్నిర్మాణంలో అటు నేతలదీ, ఇటు నిపుణులదీ సరిసమానమైన పాత్ర.‘మోక్షగుండం విశ్వేశ్వరయ్య లేదా ‘ఎమ్వీ’(సెప్టెంబర్ 15, 1860–ఏప్రిల్ 14, 1962) కుటుంబం ప్రస్తుత ప్రకాశం జిల్లా నుంచే ఏనాడో కర్ణాటక (నాటి మైసూర్ సంస్థానంలో ముద్దనహళ్లి) తరలిపోయింది. తండ్రి శ్రీనివాసశాస్త్రి సంస్కృత పండితుడు, ఆయుర్వేద వైద్యుడు. తల్లి వెంకాచమ్మ. 12వ ఏటనే తండ్రిని కోల్పోయిన ఎమ్వీ అష్టకష్టాలు పడి విద్యార్థి వేతనాలతో ఇంజనీరింగ్ చదివారు. ఒక్కొక్కమెట్టు ఎక్కి, ‘భారతరత్న’ (1955) అయ్యారు. ఐదో జార్జి చక్రవర్తి కాలంలో బ్రిటిష్ ప్రభుత్వం ‘సర్’ పురస్కారంతో (1915) సత్కరించింది.
ఎమ్వీ ప్రతిభను, భారత దేశ పునర్నిర్మాణంలో ఆయన నిర్వహించిన పాత్రను పరిశీలిస్తే అద్భుతమనిపిస్తుంది. వ్యవసాయాభివృద్ధికీ, పారిశ్రామికాభివృద్ధికీ కూడా ఇంజనీర్‌గా ఆయన తన వంతు కృషి చేశారు. విద్యుదుత్పానకు పథకాలు చేపట్టారు. ఇనుము ఉక్కు పరిశ్రమల స్థాపనకు తోడ్పడ్డారు. నౌకాశ్రయాల నిర్మాణానికి తన మేధస్సును వినియోగించారు. సాంకేతిక విద్యాభివృద్ధికి కళాశాలలు స్థాపించారు. చివరిగా మైసూరు సంస్థానానికి దివాన్‌గా పనిచేసి రాజనీతిజ్ఞతను కూడా ప్రదర్శించారు. ఇది మేధోపరంగా విశ్వేశ్వరుడి విశ్వరూపం.
1924లో ఆయన కృష్ణరాజ సాగర్ డ్యామ్ నిర్మాణం చేపట్టారు. కావేరి మీద నిర్మించిన ఈ డ్యామ్ వల్ల 1,20,000 ఎకరాలు పచ్చదనాన్ని పులుముకున్నాయి. ప్రతి భారతీయుడు చూడాలని కలలు గనే బృందావన్ గార్డెన్స్ ఈ డ్యామ్ నిర్మాణం ఫలితమే. ఇది భారతదేశంలో నిర్మించిన పెద్ద డ్యామ్‌లలో ఒకటి. విశాఖ నౌకానిర్మాణ సంస్థకు సముద్ర కోత వల్ల ముప్పు ఏర్పడింది. దీనిని పరిష్కరించినవారు ఎమ్వీ. 1900 సంవత్సరం మొదటి దశకంలో వరదలతో అతలాకుతమైన హైదరాబాద్ నగరాన్ని ఆదుకున్నవారు కూడా ఆయనే. 1909లో ఆయనను ఇంజనీరింగ్ సలహాదారుగా నియమించిన నిజాం ప్రభుత్వం ఈ ప్రాంతానికి ఎంతో మేలు చేసింది.
మైసూర్ బ్యాంక్ (1913లో ఎమ్వీ స్థాపించిన ఈ బ్యాంకే ఇప్పుడు స్టేట్ బ్యాంక్ ఆఫ్ మైసూర్ పేరుతో కార్యకలాపాలు నిర్వహిస్తున్నది), ప్రభుత్వ సబ్బుల కర్మాగారం (1916), భత్కల్ నౌకాశ్రయం, భద్రావతి ఇనుము– ఉక్కు కర్మాగారం, జోగ్ జలపాతం (షిమోగ) దగ్గర శరావతి హైడ్రో ఎలక్ట్రికల్ ప్రాజెక్టు (1035 మెగావాట్ల సామర్థ్యం కలిగినది), బెంగళూరు– మైసూరు రైలు రోడ్డు మార్గం వంటివన్నీ విశ్వేశ్వరయ్యగారి చేతుల మీదుగా నిర్మితమైనవే. వరదలు వచ్చినప్పుడు వాటికవే తెరుచుకునే తలుపులను ఏర్పాటు చేసిన ఘనత కూడా ఆయనదే.
1912లో మైసూరు మహారాజు ఎమ్వీని దివాన్‌గా నియమించాలని నిర్ణయించారు. ఈ విషయం ఆయనకు కూడా చెప్పారు. తన నిర్ణయం చెప్పడానికి ముందు ఎమ్వీ ఒక చిన్న సభ ఏర్పాటు చేశారు. తన ఇంటిలోనే తన బంధువర్గాన్ని పిలిచి విషయం చెప్పారు. అంతా సంతోషించారు. ఆలస్యమెందుకన్నారు. అయితే ఒక్క షరతు మీద చేరతానని ఎమ్వీ చెప్పారు. అదేమిటంటే, తాను దివాన్ పదవిలో ఉండగా బంధువర్గం నుంచి ఏ ఒక్కరు వచ్చి తమకు సాయం చేయమని అడగరాదు. ఈ నిబంధనను ఆయన బంధువర్గం మీద విధించడమే కాదు, తన మీద తాను కూడా విధించుకున్నారు. ఒకసారి ఒక మిత్రుడు రాత్రివేళ ఎమ్వీతో ఏదో పని మీద వచ్చాడు. అప్పటికి ఆయన దీపం వెలుగులో కలంతో ఏదో రాసుకుంటున్నారు. మిత్రుడు వచ్చి కూర్చున్నాక, పని పూర్తి చేసుకుని, ఆ దీపాన్ని ఆర్పేశారు ఎమ్వీ.
ఆ కలం కూడా మూసేశారు. అక్కడే ఉన్న మరో దీపం, మరో కలం తీసుకుని మిత్రుడి పని గురించి అడిగారు. ముందు ఈ దీపాలు, కలాల మార్పు ఏమిటో చెప్పమన్నాడామిత్రుడు. మిత్రుడు వచ్చినప్పుడు ఎమ్వీ చేస్తున్నది ప్రభుత్వ పని. ఆ పని అయిపోగానే ఆ దీపం ఆర్పేశారాయన. ప్రభుత్వం ఇచ్చిన భత్యంతో వెలిగించేది. రెండో దీపం తన సొంతం. మిత్రుడి కోసం అది వెలిగించారు. ఆ దీపం మాటేమో గానీ, ఎమ్వీ నిజాయితీ ఎలాంటి వారికైనా జ్ఞాననేత్రాన్ని తెరిపించే వెలుగే. 100 ఏళ్లు పరిపూర్ణ, అర్థవంతమైన జీవితాన్ని గడిపి 101వ ఏట కన్నుమూశారు విశ్వేశ్వరయ్య. బ్రహ్మ అనే కంటికి కనిపించని ఇక ఇంజనీర్ నిర్మించిన సజీవ పరిపూర్ణ నిర్మాణం ఎమ్వీ.
Comments
Please login to add a commentAdd a comment