చారిత్రక సంధ్యను ఆవిష్కరించిన కథకుడు వి.చంద్రశేఖరరావు
చరిత్రకి నీడ వంటిది సాహిత్యం. కాని హేతువునీ, కార్యకారణ సంబంధాన్నీ పట్టించుకున్నంతగా ఆ కాలపు ఆత్మఘోషను చరిత్ర వినిపించుకోదు. ఒక పరిణామం మీద వ్యక్తుల స్పందన గురించి చరిత్రకు అక్కరలేదు. వ్యక్తి మీద చరిత్ర పరిణామం ఎలా ప్రతిఫలించిందో ఎక్కడా నమోదు కాదు. చరిత్రకు నీడ వంటి సాహిత్యంలోనే ఆ ప్రతిఫలనాలూ గుండెలయలూ కనిపిస్తాయి వినిపిస్తాయి. వెల్లువలా వచ్చిన దళితోద్ధరణ ఒక కెరటంలా పతనం కావడానికి వెనుక ఉన్న కారణాలు చరిత్రనే విస్తుపోయేటట్టు చేసే రీతిలో ఉంటాయి.
అయితే ఇలాంటి పరిణామాల మీద నోరు విప్పడానికి మరీ ముఖ్యంగా వాటిని అక్షరబద్ధం చేయడానికి ముందుకు వచ్చేవారు అరుదు. అగ్రకులాల అహంకారానికి బలైనవాడూ కోటేశే ఓ పెద్ద దళిత జనోద్ధారకుడు పెట్టిన హింసతో చనిపోయిన వాడూ మరో కోటేశే కావడం చరిత్రను విస్తుపోయేటట్టు చేసే విషయం కాదని ఎలా చెప్పడం! స్థానీయతను స్వచ్ఛందంగా వదిలించుకోవాలనుకుని శతథా యత్నిస్తున్న మన సమాజపు చారిత్రక సంధ్యను ఆవిష్కరించడం చరిత్రకారుడితో కాదు, సాహిత్యకారుడి సృజనతోనే సాధ్యమవుతుంది. డాక్టర్ వి.చంద్రశేఖరరావు చాలా కథలు అలాంటి సృజనతో వెలువడినవే.
సోవియెట్ రష్యా పతనం సమసమాజం కోసం స్వప్నించేవారి పాలిట అశనిపాతమే అయింది. చెదిరిపోయిన కల గందరగోళాన్ని సృష్టించింది. ఆ గందరగోళంలో నిజరూపాలు బయటపడ్డాయి. ఈ అంశంతో సాగిన కథ ‘లెనిన్ ప్లేస్’. ఈ మహా పరిణామం మీద ప్రపంచ వ్యాప్తంగా కొన్ని లక్షల పేజీల సమాచారం వెలువడింది. కానీ సృజనాత్మక రచనలు తక్కువే. తెలుగులో ఇంకా తక్కువ. ఆ లోటును చంద్రశేఖరరావు తీర్చారనిపిస్తుంది. నిజానికి చాలామంది కమ్యూనిస్టులు ఆ సిద్ధాంతాన్ని నమ్మామని అనుకున్న రచయితలు ఆ ఉదంతానికి కొంచెం ముందే సాయిబాబా భక్తులుగా మారిపోవడం ఒక వాస్తవం. ఈ కథలో సోవియెట్ రష్యా పతనం తరువాత స్టీఫెన్ లెనిన్ ఫోటోకు బొట్టు పెట్టి దండ వేసి ధ్యానం చేసిన దృశ్యం తెలుగు ప్రాంత వామపక్ష మేధావుల దివాలాకోరుతనం మీద గొప్ప విసురనిపిస్తుంది. ఇది ఇక్కడితో ఆగలేదు. ఒకప్పుడు వామపక్ష ఉగ్రవాదాన్ని ఆరాధించి తరువాత బాబాలతో తమ పుస్తకాలను ఆవిష్కరింపచేసుకున్న మేధావులు కూడా ఇక్కడ ఉన్నారు. మన ఫ్యూడల్ భావాలనీ, ఛాందసాలనీ కమ్యూనిస్టు సిద్ధాంతం కాస్తా కూడా కదల్చలేకపోయిన సంగతిని రచయిత తాత్వికంగా చిత్రించారు. ఇలాంటి ఇతివృత్తాన్ని కథగా తీసుకోవడం నిజానికి సవాలు.
‘చిట్టచివరి రేడియో నాటకం’ స్థానీయతను గురించిన ఒక ఆర్తిని ఆవిష్కరిస్తుంది. ఎంత ఆధునికతను సంతరించుకున్నప్పటికీ మనదైన భాష, కళ మాత్రమే మన మనసుల వరకు రాగలవన్న గూగీ వా థియాంగ్ (ఏ డెవిల్ ఆన్ ది క్రాస్) నమ్మకం ఈ కథకుడిలోనూ మనం చూస్తాం. స్వేచ్ఛను వదులుకోవడం ఇష్టంలేని సంగీతజ్ఞుడు టిప్పు సుల్తాన్ ఆజ్ఞను ధిక్కరించి నాలుకను కోసుకున్న సన్నివేశం కూడా ఈ కథకుడిని కదిలించింది. అది గొప్ప ఆర్తికి నిదర్శనం. తమ తమ కళాతృష్ణకు తామే ఎలా సమాధి కట్టవలసి వచ్చిందో చెబుతుంది ఈ ‘నాటకం’. చివరిగా దంతపు భరణిలో వీణ వాయించే వేళ్లను చూపించడం గగుర్పొడిచేటట్టు ఉన్నా దేశీయమైన కళాసంపదకు జరుగుతున్న సత్కారం అలాంటిదే మరి. ‘నిద్రపోయే సమయాలు’ కథలో కూడా స్వచ్ఛమైన, నిజాయితీతో కూడిన సృజనకు క్రమంగా చెదలు పట్టిన తీరును ఆవిష్కరించారు రచయిత.
‘సిద్ధార్థా వగపెందుకు?’, ‘ద్రోహవృక్షం’ కథలు మనిషితనాన్ని కోల్పోతున్న వ్యక్తులకు సంబంధించినవి. దశాబ్దాలుగా ఘర్షణ పడుతున్న రెండు కులాలకు చెందినప్పటికీ ఇద్దరు వ్యక్తులు నిర్జన ప్రాంతంలో కలుసుకున్నప్పుడు ప్రదర్శించిన ప్రవర్తనకీ మళ్లీ వారివారి సమూహాలలోకి వెళ్లినపుడు వారిలో వచ్చిన మార్పు గురించీ చెప్పడానికి రచయిత ఈ కథ రాశారనిపిస్తుంది. ఈ ఇద్దరినీ మంచి మిత్రులుగా చూపించడానికి ఒక కొండ కొసను వేదికను చేయడం గొప్ప ప్రతీకాత్మకంగా ఉంది. ‘సిద్ధార్థా వగపెందుకు?’ ప్రత్యేకమైన కథ. నిజానికి ఇందులో మేడమ్ మాలతి ప్రధాన పాత్ర. అయినా ఆమె తెర మీద కనిపించేది తక్కువే. కానీ ఆమె కొడుకు భావనల ద్వారా మాలతి పాత్రను మన కళ్లకు కట్టారు.
కొన్ని సందర్భాలలో మనుషులలో స్పందనలు చాలా సహజం. వాటి మీద మేధావి, రచయిత, ఉద్యమం.. మరొకటి మరొకటి అంటూ ముసుగులు వేసినా అవి ఏదో ఒక క్షణంలో తొలగిపోక తప్పదు. ఆ వాస్తవాన్ని సున్నితంగా అనిపించే రీతిలోనే అయినా ఆఖర్న కుండబద్దలు కొట్టిన పద్ధతిలో రచయిత చిత్రించారు. ‘మోహనా! మోహనా’ కదలించే కథ అనే కన్నా గొప్పగా ఆలోచింప చేసే కథ అనాలి. కొద్దిగా డబ్బు, చుట్టూ నలుగురు మనుషులు, కాస్త కీర్తి లభించగానే ఎవరైనా ఒక రకంగానే ప్రవర్తిస్తారు. ఆధిపత్య ధోరణి కబళిస్తుంది. ఇందుకు దళిత నాయకత్వం కూడా అతీతం కాదు. ఇదే ఈ కథలో నేర్పుగా ఆవిష్కరించారు రచయిత. ఇది ‘వైట్ కాలర్ దళితుల’ కథ. జీవని, కొన్ని చినుకులు కురవాలి, సుందరం కలది ఏ రంగు, హైకూ, నలుపు వంటి మొత్తం 31 కథల సంకలనమిది.
కవులు ప్రత్యేకమైన శైలినీ, భాషనూ సృష్టించుకున్నట్టు ఈ కథకుడు తనదైన పంథాను రూపొందించుకున్నారని అనిపిస్తుంది. కానీ ‘నిద్రపోయే సమయాలు’ కథలో నిజాయితీతో కూడిన సుందరం సృజనను పరిస్థితులు కబళించినట్టు కొన్ని కథలలో మాత్రం శైలి ఇతివృత్తాన్ని అధిగమించడం కూడా ఉంది.
- గోపరాజు నారాయణరావు