‘మార్పు’ను తూర్పారబట్టిన ప్రపంచం
ఈ సదస్సు ప్రాధాన్యాన్ని దేశాధినేతలు తొందరగానే గ్రహించారు. వాతావరణ మార్పులను నిరోధించడానికి తాము ఎలాంటి చర్యలు చేపట్టనున్నారో ఇక్కడ క్లుప్తంగా ప్రసంగించిన వంద దేశాల అధినేతలు వెంటనే ప్రకటించారు.
‘నా చిట్టితల్లీ! నీ దేశపు అందమైన సూర్యోదయాలు, సుందరమైన సరస్సులు అదృశ్యం కావు. అవి మాయమై పోకుండా మేం పోరాడతాం.... ఎవరో వచ్చి వాటినీ, నిన్నూ మింగుతారని భయపడకు!....’ ఇలా సాగింది, సెప్టెంబర్ 23న ‘వాతావరణం మార్పులు’ అనే అంశం మీద న్యూయార్క్‌లో జరిగిన సదస్సులో కాతే జట్‌నిల్ కిజినెర్ అనే 26 సంవత్సరాల కవయిత్రి చదివిన కవిత. తన ఏడు నెలల కూతురును ఉద్దేశించినట్టు రాసిన ఈ కవిత ప్రపంచ దేశాల నేతలను కంటతడి పెట్టించింది. జట్‌నిల్ మార్షల్ దీవుల (ఉత్తర పసిఫిక్ సముద్రం) నుంచి ఈ సదస్సుకు హాజరయ్యారు. వాతావరణం లో మార్పుల పుణ్యమా అని ప్రపంచ పటంలో తన ఉనికిని కోల్పోవడానికి దాదాపు సిద్ధమైన ప్రాంతం ఈ చిన్నదేశమే. వాతావరణ మార్పుల కోసం తక్షణమే ఉద్యమించవలసిన దేశం కూడా అదే. సముద్ర మట్టానికి కేవలం ఆరు అడుగుల ఎత్తులోనే ఆ దీవులు ఉన్నాయి. వాతావరణ మార్పులతో ముంచెత్తే వరదలు, కరువులు రెండింటినీ కూడా ఆ దేశం అనుభవిస్తోం ది. అందుకే వాతావరణ మార్పుల పెను ముప్పు నుంచి భవిష్యత్ తరాలను రక్షించేందుకు ప్రపంచ నేతలంతా కార్యరంగంలోకి దూకాలని ఆమె కోరారు. ఈ దీర్ఘ కవితలో ప్రకృతి వర్ణనలు ఉన్నాయి. సౌందర్య దృష్టి ఉంది. కానీ వాటి ఉద్దేశం శ్రోతలను రంజింప చేయడం కాదు, కదిలింప చేయడం. ఇందులో కవయిత్రి విజయం సాధించారు.
వాతావరణ మార్పుల సమస్య ఇప్పుడు మార్షల్ దీవులది మాత్రమే కాదు. అది ప్రపంచ సమస్య. ఇది పాతికేళ్లకో, యాభై ఏళ్లకో ప్రభావం చూపించే సమస్య కూడా కాదు. ప్రపంచం ముంగిటకు వచ్చింది. ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థలను అతలాకుతలం చేసే స్థాయికి ఇది ఇప్పటికే చేరుకున్నది. ఇది మరింత తీవ్రం కాబోతోందని అంచనా. ప్రస్తుత పరిస్థితిని బట్టి ఈ సమస్య నుంచి ప్రపంచాన్ని బయట పడవేయడానికి ఇప్పటికీ కొన్ని అవకాశాలు మిగిలి ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ఐక్య రాజ్యసమితి ప్రధాన కార్యదర్శి బాన్‌కీ మూన్ ఈ అంశం మీద న్యూయార్క్‌లో సదస్సును ఏర్పాటు చేశారు. దీనికి ప్రభుత్వాధినేతలనే కాకుండా, ఆర్థిక సంస్థల, వాణిజ్య సంస్థల, పౌర సంఘాల ప్రముఖులను కూడా ఆహ్వానించారు. వాతావరణ పరిరక్షణకు, ఉద్గారాలను నిరోధించడానికి వీలుగా ఎలాంటి పటిష్ట చర్యలు తీసుకోబోతున్నారో బాన్‌కీ మూన్ ప్రపంచ దేశాధినేతల నుంచి స్పష్టమైన హామీలను కోరడం ఈ సదస్సు విశేషం. 2015లో జరగబోయే సమావేశంలో చేసుకోబోయే ఒప్పందాల నేపథ్యంలో ప్రపంచ దేశాలలో రాజకీయ సంకల్పం నెలకొల్పడం కూడా ఐరాస ప్రధాన కార్యదర్శి ఉద్దేశం. నిజానికి ఈ అంశం మీద భవిష్యత్‌లో జరిగే కృషికి నాయకత్వం వహించే అవకాశాన్ని కూడా ఆయా దేశాలకు ఈ సదస్సు కల్పిస్తున్నది.
ఒక్కరోజుకే పరిమితమైనప్పటికీ ఈ సదస్సు ప్రాధా న్యాన్ని దేశాధినేతలు తొందరగానే గ్రహించారు. వాతావరణ మార్పులను నిరోధించడానికి తాము ఎలాంటి చర్యలు చేపట్టనున్నారో ఇక్కడ క్లుప్తంగా ప్రసంగించిన వంద దేశాల అధినేతలు వెంటనే ప్రకటించారు. ఆర్థిక సాయాన్ని ప్రకటించిన దేశాలు కూడా ఉన్నాయి. భూమి వేడిమిని రెండు సెల్షియస్ డిగ్రీలకు తగ్గించవలసిన అవసరం గురించి కూడా ప్రపంచ దేశాల నేతలు ఏకతాటి మీదకు వచ్చారని కూడా చెప్పవచ్చు. ఆర్థికాభివృద్ధికి భంగం కలగకుండానే, దారిద్య్రం మీద పోరాటం సాగిస్తూనే ఉద్గారాలను తగ్గించవచ్చునని కూడా చాలామంది అభిప్రాయపడ్డారు. ఉద్గారాలను తగ్గించేందుకు ఇంధనం, రవాణా, పరిశ్రమలు, వ్యవసాయం, నగరాలు, అడవుల, నిర్మాణాలు వంటి వాటి ద్వారా జరగవలసిన కృషి చేపట్టనున్నట్టు ప్రభుత్వాధినేతలతో పాటు, వాణిజ్య సంస్థల, ఇతర వ్యవస్థల అధిపతులు కూడా హామీ ఇచ్చారు. చాలామంది ప్రభుత్వాధినేతలు ఇంకో అడుగు ముందుకు వేసి 2015లో పారిస్‌లో జరిగే విశ్వ పర్యావరణ ఒప్పందంలో భాగస్వాములు కావడానికి ముందుకు వచ్చారు. 1990 స్థాయికి తమ దేశాలలో గ్రీన్‌హౌస్ ఉద్గారానికి తగ్గించడానికి పాటుపడతామని పలు యూరప్ దేశాలు హామీ ఇచ్చాయి. అంటే నలభై శాతం ఉద్గారాల తగ్గింపు మీద అవి దృష్టి సారిస్తాయి. తన పవన, సౌర విద్యుత్ సామర్థ్యాన్ని 2020 నాటికి రెట్టింపు చేయనున్నట్టు భారత ప్రతినిధి ప్రకటించారు.
వాతావరణంలో మార్పులు వచ్చేశాయి. అవి వాటికవే వచ్చినవి మాత్రం కావు. కాబట్టి ప్రపంచ దేశాలలో రావలసిన మార్పు గురించి హెచ్చరించడానికి ఉద్దేశించిన ఈ సదస్సు శుభప్రదంగా, విజయవంతంగా ముగిసింది. ‘ఇంక ప్రపం చానికి కావలసినది చర్యలే, మాటలు కాదు’ అన్న బాన్‌కీ మూన్ మాటను అందరూ శిరసావహిస్తారని ఆశిద్దాం.
గోపరాజు నారాయణరావు