కమలానికి కలహాల చీడ
సాబిర్ విషయమే కాదు, ఈ ఎన్నికల నేపథ్యంలో జరిగిన పలు పరిణామాలు బీజేపీలో సమన్వయ లోపం ఎంత అథమ స్థాయిలో ఉన్నదో చాటి చెప్పేవే.
‘పార్టీలో చేరతానంటే దావూద్ ఇబ్రహీంను కూడా చేర్చుకుంటారా?’ వంటి తీవ్రమైన ప్రశ్నను ఎదుర్కొన్న బీజేపీ కంగు తినకుండా ఉండడం అసాధ్యం. నాయకత్వం దిమ్మెరపోయే స్థాయిలో ఇలా ప్రశ్నించినవాడు ఆ పార్టీ ఉపాధ్యక్షుడు ముక్తార్ అబ్బాస్ నక్వీ. పార్టీలో నక్వీ ముస్లిం వర్గానికి చెందిన ప్రముఖుడు. ఇది నక్వీ ఆగ్రహం అని అనుకోనక్కరలేదు. రేపటి ఎన్నికలలో అత్యధిక స్థానాలు కైవసం చేసుకుని అధికారంలోకి వస్తుందని సర్వేలు ప్రకటించిన బీజేపీ పరువు ప్రతిష్టలకు సంబంధించినది.
సర్వేలు అనుకూలంగా ఉన్నాయి. పార్టీ ప్రకటించిన ప్రధాని అభ్యర్థి నరేంద్రమోడీకి అనుకూలంగానే పరిణామాలన్నీ జరుగుతున్నాయి. ఉత్తర ప్రదేశ్‌లో ఒక ముస్లిం మత సంస్థ మోడీకి ఓటు వేయవచ్చునని చెప్పడం ఇందుకు ఉదాహరణ. కానీ ఆ ఉత్సాహం పార్టీలో అత్యుత్సాహంగా పరిణమిస్తున్న సూచనలు కూడా కనిపిస్తున్నాయి. జనతాదళ్ (యు) నుంచి వారం క్రితం బహిష్కృతుడైన సాబిర్ అలీని పార్టీలో చేర్చుకోవడం బీజేపీ చేసిన ఘోర తప్పిదమని విమర్శలు వె ల్లువెత్తాయి.
దీని మీదే నక్వీ తన ట్విటర్‌లో మండిపడ్డారు. ఎవరీ సాబిర్? ఇతడు రాజ్యసభ మాజీ సభ్యుడు. ఇండియన్ ముజాహిదీన్ సభ్యుడు, పలు పేలుళ్ల కేసులతో సంబంధం ఉన్న యాసిన్ భత్కల్‌తో తనకు స్నేహం ఉందని సగర్వంగా చెప్పినవాడు. భత్కల్‌ను ఇతని ఇంటిలోనే అరెస్టు చేశారు. నక్వీ వెల్లడించిన వాస్తవాలు ఇవే. ఇలాంటి వ్యక్తిని పార్టీలోకి ‘ఆహ్వానించడం’ మీద నక్వీ వెళ్లగక్కిన ఆగ్రహాన్ని అర్థం చేసుకోకతప్పదు. సాబిర్ గతమంతా ఉగ్రవాద సంస్థలను కీర్తించడం, బీజేపీని తూర్పార పట్టడమేనని ఆయన గుర్తు చేశారు. అందుకే బీజేపీ నాలుక్కరుచుకుని ఈనెల 28న చేర్చుకుని, మరునాడే సభ్యత్వాన్ని రద్దు చేసింది. ఈ అంశంలో నక్వీ పార్టీకి మేలే చేశారు. కానీ పార్టీ అంతర్గత అంశాల మీద అంతర్గత వేదికల మీదే మాట్లాడాలని జాతీయ అధ్యక్షుడు రాజ్‌నాథ్ సింగ్ అప్పుడే నోళ్లు నొక్కే కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం గమనార్హం. వారం లో ఇలాంటి ఉదంతం ఆ పార్టీలో రెండోసారి కావడమే ఇందుకు కారణం. అంటే మరిన్ని జరిగే ప్రమాదం ఉందా?
సాబిర్ చేరిక ఘటనకు ఆరురోజుల ముందు కర్ణాటకలో ఇలాంటి గడ్డుస్థితినే బీజేపీ ఎదుర్కొనవలసి వచ్చింది. శ్రీరామసేన కర్ణాటక శాఖ అధ్యక్షుడు ప్రమోద్ ముతాలిక్‌ను చేర్చుకుని, ఐదు గంటల వ్యవధిలోనే సభ్యత్వం ఉపసంహరించుకున్నారు. ముతాలిక్ వివాదాస్పదుడే. 2009లో మంగళూరులో ఒక పబ్ మీద అనుచరులతో కలసి దాడి చేసి, కొందరు యువతుల మీద భౌతిక దాడికి పాల్పడ్డాడన్న ఆరోపణ ఉంది. దీని మీద దేశమంతా గగ్గోలు రేగింది.
ఈ ఉదంతంలోని అతిని కాదనలేం. అయినా ముతాలిక్‌కు సభ్యత్వం ఇచ్చి నాలుక్కరుచుకున్నారు. ఇక సాబిర్‌ను పార్టీలోకి ‘ఆహ్వానించడం’ మీద తెర వెనుక జరిగిన తతంగం గురించి వినవస్తున్న వార్తలు వికృతంగా ఉన్నాయి. సాబిర్ రాకకు మోడీ ఆమోదం ఉందన్నది అందులో ఒకటి. ఎందుకంటే సాబిర్ చేరికను గుజరాత్ బీజేపీలో ముస్లిం ప్రముఖుడు జఫార్ సారేష్‌వాలా సమర్థించాడు. ఇతడు మోడీ అనుచరుడిగా ప్రసిద్ధుడు.
సాబిర్ విషయమే కాదు, ఈ ఎన్నికల నేపథ్యంలో జరిగిన పలు పరిణామాలు బీజేపీలో సమన్వయ లోపం ఎంత అథమ స్థాయిలో ఉన్నదో చాటి చెప్పేవే. కర్ణాటక శాఖ నుంచి విడివడి, మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో పార్టీ ఓటమికి కారణమైన యడ్యూరప్ప, శ్రీరాములను తిరిగి తీసుకోవడాన్ని ప్రతిపక్ష నేత సుష్మా స్వరాజ్ వ్యతిరేకించారు. వృద్ధనేత అద్వానీ, ఎం ఎం జోషీ, జస్వంత్‌సింగ్, నవజోత్ సిద్ధూల నియోజక వర్గాల నిర్ణయం మీద చెలరేగిన వివాదం అంతిమంగా మోడీని బాధ్యుడిని చేసేలా ఉంది. ఇందులో అద్వానీ, జోషీల నియోజక వర్గాల నిర్ణయానికి సంబంధించి మోడీకి ప్రత్యక్ష ప్రమేయం ఉంది కూడా. దీని మీద లాలూ తీవ్రమైన వ్యాఖ్య చేశారు. మోడీకి భయపడి బీజేపీ సీనియర్లంతా పరుగులు తీస్తున్నారని, దీనితో అక్కడ తొక్కిసలాట కూడా జరుగుతోందని అన్నారు. కాంగ్రెస్ వ్యతిరేక ఓటుతో అధికారంలోకి వచ్చామన్న భావన కంటె, సానుకూల ఓటుతోనే గద్దెనెక్కామన్న మాట బీజేపీకీ, దేశానికీ కూడా అవసరం. బీజేపీ గెలుపు వ్యూహంలో ఇది కూడా ఉండాలి. అయితే సాబిర్‌ను పెద్దల సభకు కూడా పంపి, నిన్నటి దాకా మోసిన బీహార్ ముఖ్యమంత్రి నితీశ్, అతడు నమో జపం ఆరంభించడంతో బయటకు పంపారు. ఇప్పుడు నితీశ్ ఈ దేశాన్ని మోడీత్వ నుంచి కాపాడతానని అనడం ఇంకొక వైచిత్రి.
-డాక్టర్ గోపరాజు నారాయణరావు